బ్యాంకాక్: అది బ్యాంకాక్ శివార్లలో నిశ్శబ్దం తాండవించే వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయం. అంత్యక్రియల కోసం వచ్చేవారితో రద్దీగా ఉండే ప్రదేశం. ఆ రోజు, ఆలయ జనరల్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఫిత్సనులోక్ ప్రావిన్స్ నుండి 500 కిలోమీటర్లు ప్రయాణించి ఒక వ్యక్తి 65 ఏళ్ల తన సోదరి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకొచ్చాడు.
ఇంతలో శవపేటికలో శబ్దాలు వినిపించడంతో.. ఆలయ సిబ్బంది నిశ్చేషు్టలయ్యారు. లోపల కదులుతున్న వృద్ధురాలిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బ్యాంకాక్ శివార్లలోని నాన్‌థాబురి ప్రావిన్స్‌లోని వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.
అసలేం జరిగిందంటే..
ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం ఒక వృద్ధురాలు ఊపిరి ఆగిపోయి, చనిపోయినట్లు కనిపించడంతో ఆమె సోదరుడు శవపేటికలో భద్రపరిచి తీసుకొచ్చాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా, శవపేటిక నుండి సన్నని శబ్దం వినిపించింది. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది, అందుకే శవపేటిక తెరవమని కోరాను. ఆమె మెల్లగా కళ్లు తెరుస్తూ, శవపేటిక పక్కకు తడుతూ కనిపించింది. ఆమె చాలా సేపటి నుండి తడుతూ ఉందేమో’.. అని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
మరణ ధ్రువపత్రం లేక..
వాస్తవానికి, ఆ మహిళ గతంలోనే తన అవయవదానానికి సమ్మతించడంతో.. ఆమె సోదరుడు మొదట బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, అధికారిక మరణ ధ్రువపత్రం లేకపోవడంతో ఆసుపత్రి తిరస్కరించింది. అనంతరం వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో ఉచిత దహన సంస్కారాలు చేస్తారని తెలిసి ఆదివారం శవపేటికను తీసుకురాగా, అక్కడ కూడా అదే ధ్రువపత్రం అడిగారు. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్.. ఆ పత్రం గురించి వృద్ధురాలి సోదరునికి వివరిస్తున్నప్పుడే.. శవపేటికలో శబ్దం వినిపించింది.
వెంటనే ఆలయ సిబ్బంది ఆమెను పరీక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఖర్చులను తామే భరిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించారు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణాలతో రావడం, ఆలయ సిబ్బందికి, ఆమె సోదరుడికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చింది.


