మూడో ప్రపంచ దేశాల వలసల విషయంలో కఠిన వైఖరి అవలంభించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వైట్‌హైజ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆ మూడో ప్రపంచ దేశాలంటే ఏంటనే ప్రశ్న తెర మీదకు వచ్చింది..
బుధవారం అమెరికా వైట్ హౌస్ వద్ద అప్గాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి నేషనల్ గార్డ్స్ సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళా సిబ్బంది మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై భగ్గుమన్న ట్రంప్.. మరోసారి ఇమిగ్రేషన్ పాలసీపై కఠిన ఆంక్షల ప్రస్తావన తీసుకొచ్చారు. "నేను శాశ్వతంగా మూడో ప్రపంచ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధిస్తాను. బైడెన్ ప్రభుత్వంలో అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని పంపిస్తాను. అదే విధంగా దేశానికి ఉపయోగకరంగా లేకుండా అమెరికాను ప్రేమించకుండా ఉన్న వారిని దేశం నుంచి పంపిస్తాను. అమెరికాలో శాంతిని దెబ్బతీసేవారిని సభ్యత్వం రద్దు చేస్తాను. వారికి మన దేశంలో ఎటువంటి సబ్సిడీలు అందకుండా చేస్తాను" అని ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
మూడో ప్రపంచ దేశాలంటే..
కోల్డ్ వార్ సమయంలో(1947-1991) మెుదటి సారిగా ప్రపంచ దేశాలను విభజిస్తూ పదం వాడారు. పెట్టుబడిదారి వ్యవస్థ, నాటో కూటమిలో సభ్యత్వం కలిగిన దేశాలను మెుదటి ప్రపంచ దేశాలుగా పిలిచేవారు. వీటికి అమెరికా నేతృత్వం వహించేది. ప్రణాళికమైన ఆర్థిక వ్యవస్థ వార్సా ఒప్పందంలో (నాటోకి ప్రత్యామ్నాయంగా) భాగమైన దేశాలను రెండవ ప్రపంచ దేశాలుగా పిలిచేవారు. ఈ దేశాలకు యూ.ఎస్.ఎస్ ఆర్ నాయకత్వం వహించేది. ఈ రెండు కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉన్న దేశాలను మూడో ప్రపంచ దేశాలు అనేవారు. అయితే..
ఆ సమయంలో అభివృద్ధి చెందకుండా ఉన్న దేశాలను, పేదరికంలో మగ్గే దేశాలను మూడో ప్రపంచ దేశాల కేటగిరీలో చేర్చారు. ఈ జాబితాలో ఆనాడు భారత్ కూడా ఉండేది. అయితే ఈ భావన కేవలం రాజకీయ పదం మాత్రమే. దీనికంటూ ఓ అధికారిక గుర్తింపులాంటిదేం లేదు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంతో..
ట్రంప్ తాజా ప్రకటన నేపథ్యంతో ఆ మూడో ప్రపంచ దేశాలు ఏంటా? అని వెతుకులాట మొదలైంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదానికి అసలే అర్థమే లేదు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రకారం అత్యంత అభివృద్ధి చెందిన జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. ఇందులో ఆఫ్రికా నుంచి 32 దేశాలు, ఆసియా నుంచి 8 దేశాలు, ఒక కరేబియన్ దేశం(హైతీ,), ఫసిఫిక్ రీజియన్‌లోని మూడు దేశాలు ఉన్నాయి. ఈ లెక్కన అభివృద్ధి లేకుండా పేదరికంలో మగ్గుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా భావించొచ్చు.
ఆయన ఉద్దేశం అదేనా?..
అయితే ట్రంప్ డిక్షనరీలో దీనర్థం వేరే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే.. గతంలో ట్రంప్ యూఎస్‌కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ లిస్ట్‌లో అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటితోపాటు ఏడు దేశాల ప్రయాణికులపైనా అప్పట్లో పాక్షికంగా నిషేధం విధించారాయన. దీంతో తాజా ప్రకటన ఆ దేశాలను ఉద్దేశించేనా? అని విశ్లేషణ నడుస్తోంది.
ఇంతకీ భారత్ ఎక్కడుంది?
ట్రంప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రకటనతో రాజకీయ విశ్లేషకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఆయన ఏ ప్రతిపాదికన ఆ వార్నింగ్ ఇచ్చి ఉంటారో అర్థం కాక యూఎస్ సాయం మీద ఆధారపడిన పేద దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతానికైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు, లో.. లోయర్ మిడిల్ ఇన్‌కమ్ దేశాలు అనే పాదాలను వాడుతున్నారు. ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ జాబితాలోనే ఉండేది. అయితే.. ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అంతేకాదు.. ఈ మధ్యే జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కూడా.


