సమస్యలున్నచోట నిప్పురాజేయటం సులభం. నిన్న మొన్నటివరకూ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులతో ఊపిరాడని ఇరాన్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. భవనాలు, బస్సులు, దుకాణాలు తగలబడుతున్నాయి. రాజధాని తెహ్రాన్ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అదొక్కటే కాదు...దేశంలోని 31 ప్రావిన్సుల్లో ఉన్న 180 నగరాలు, పట్టణాలు ఇప్పుడు ఆగ్రహావేశాలతో రగులుతున్నాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ, కరెన్సీ విలువ పడిపోతూ దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న జనం గత రెండువారాలుగా రోడ్లపై వెల్లువెత్తుతుండగా, ఇంతవరకూ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 538 మంది మరణించారు.
పదివేలమందిని జైళ్లలోపెట్టారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సాధించలేనిది ఇరాన్‌లో సునాయాసంగా చేయగలిగారు. వెనిజులాలో ఇదే మాదిరి ప్రేరేపించి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్న సాకుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని ట్రంప్ ఏడాదిగా ప్రయత్నించారు. అది అసాధ్యం కావటంతో నేరుగా సైన్యాన్ని పంపి మదురో దంపతుల్ని అపహరించారు. ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు చేయటానికి అమెరికా సంసిద్ధమవుతోంది.
దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్యదేశాలు పగబట్టి అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ప్రాణావసర ఔషధాల కొరత వేధిస్తోంది. తగిన వైద్య సదుపా యాలు కరవై రోగాల బారిన పడిన చిన్నపిల్లలు కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబకటం, నిరసనలు వెల్లువెత్తడంలో ఆశ్చర్య మేమీ లేదు. ఇటీవల ఆందోళనకారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌లో విదేశీ మహిళగా భావిస్తున్న ఒకామె అరెస్టయినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రకటన లివ్వాలో చెప్పే వీడియో బయటికొచ్చింది. తమ వెనుక ఎవరూ లేరని... దుర్భర పరిస్థి తుల్ని తట్టుకోలేక నిరసనల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పాలన్న హితబోధ ఉంది.
ఇరాన్‌కు ఇలాంటి నిరసనలు కొత్తగాదు. 1979లో ఇరాన్ షా మహమ్మద్ రెజా పెహ్లవీని గద్దెదించిన ఇస్లామిక్ విప్లవం అనంతరం పాశ్చాత్య దేశాలు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి. 2022లో మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, ఉనికి కోసం అంటూ సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయగలిగింది. ఇక అడపా దడపా ఏదో ఒక వంకతో ఇరాన్‌పై క్షిపణుల్ని ప్రయోగించటం, దేశ సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని, అణు శాస్త్రవేత్తలనూ హత్యలు చేయించటం ఇజ్రాయెల్‌కు రివాజు. ఇలా జరిగిన ప్రతిసారీ ద్రోహుల్ని పట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించి, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆందోళనల తీవ్రత ఎక్కువుంది. దిగువ తరగతి ప్రజలతో పాటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి.
నిరసనలు చల్లార్చటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. దుకాణదారుల డిమాండ్లకు స్పందనగా సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌ను మార్చారు. ప్రతి ఇంటికీ నెలకు ఏడు డాలర్ల మొత్తం ఇచ్చేందుకు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదన్నారు. సాధారణ ప్రజానీకం సమస్యల్ని పరిష్కరిస్తానని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తానని అధికారంలోకొచ్చిన మసూద్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతిని అరికట్టలేక పోయారు. ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నా నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది.
పైపెచ్చు నిరసనల్లో పాల్గొంటున్న వారిని ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నార’ంటూ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ప్రజల్ని మరింత రెచ్చగొట్టింది. ఈ నేరారోపణ కింద ఉరిశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించటానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అమెరికాలో స్థిరపడిన ఒకప్పటి నియంత ఇరాన్ షా కుమారుడు రెజా పెహ్లావి తానొచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు. ఛాందసవాద ధోర ణుల్ని తగ్గించుకుని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పితే తప్ప బలప్రయోగంతో నిరసనలు అణిచేయటం అసాధ్యమని ఇరాన్ పాలకులు గుర్తించాలి.


