త్వరలో చర్చలు మొదలవుతాయి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
‘చర్య’లకూ ఆస్కారముందని వ్యాఖ్యలు
టెహ్రాన్‌లో ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు
599కు పెరిగిన నిరసన మృతుల సంఖ్య
దుబాయ్: దాడులు తప్పవన్న తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సామరస్యంగా చర్చించుకుందామని ప్రతిపాదించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఆ దేశ నాయకత్వంతో చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. అయితే నిరసనకారుల మరణాల సంఖ్య ఇలాగే పెరిగితే మాత్రం తాను చర్చలకు బదులు ‘చర్యలు’ తీసుకోవాల్సి రావచ్చని ట్రంప్ హెచ్చరించారు.
‘‘మా సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గట్టి ఆప్షన్లనే పరిశీలిస్తున్నాం’’ అని వెల్లడించారు. అమెరికా దాడికి దిగితే దీటుగా తిప్పికొడతామన్న ఇరాన్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా, ‘వారు అదే చేస్తే కనీవినీ ఎరగని రీతిలో వారిపై విరుచుకుపడతాం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ చర్చల ప్రకటనపై ఇరాన్ ధ్రువీకరించలేదు. అయితే అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధకార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాచీ చెప్పారు. అయితే అవి ఏకపక్షంగా ఉంటే అంగీకరించబోమన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ మాత్రం నిరసనల్లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, రక్తపాతాల ఏకైక ఉద్దేశం తమపై దాడికి అమెరికాకు అవసరమైన సాకు కల్పించడమేనని దుయ్యబట్టడం విశేషం. మరోవైపు మూడో వారానికి చేరిన ఇరాన్ ఆందోళనల్లో మృతుల సంఖ్య599కు చేరుకున్నట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వీరిలో 525 మంది దాకా నిరసనకారులు కాగా మిగతా మృతులు పోలీసు, భద్రతా సిబ్బంది అని పేర్కొంది. క్షతగాత్రుల సంఖ్య 11 వేలు దాటినట్టు తెలిపింది.
ప్రదర్శనల్లో అధ్యక్షుడు..
నిరసనలు నింగినంటుతున్న వేళ ఇరాన్‌లో మరో పరిణామం చోటుచేసుకుంది. వాటికి ప్రతిగా ప్రభుత్వ అనుకూలంగా ఉన్న వేలాది మందితో ఇరాన్ సర్కారు రాజధాని టెహ్రాన్‌లో భారీ ప్రదర్శనలకు దిగింది. అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో పాటు విదేశాంగ మంత్రి తదితరులు వీటిలో పాల్గొనడం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ప్రజాగ్రహంగా ఇరాన్ వీటిని అభివర్ణించింది.
కెర్మన్, రష్త్ తదితర పట్టణాల్లోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాయి. మరోవైపు, ఇరాన్‌లో సుస్థిరత నెలకొనాలని చైనా ఆకాంక్షించింది. ఈ విషయంలో బయటి శక్తుల ప్రమేయానికి తావుండరాదని స్పష్టం చేసింది. సొంత ప్రజల మీదే ఇరాన్ యంత్రాంగం ఇంత దారుణంగా దమనకాండకు దిగడం దారుణమని జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ విమర్శించారు. నిరసనకారుల ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.
స్టార్ లింక్ సేవలు కట్
మిన్నంటుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కట్టడి చేసే యత్నాల్లో భాగంగా ఇరాన్‌లో స్టార్ లింక్ ఉపగ్రహ సేవలను ఖమేనీ యంత్రాంగం నిలిపేసింది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ ‘కిల్ స్విచ్’ను యాక్టివేట్ చేసినట్టు సమాచారం. ఈ అత్యాధునిక జామింగ్ పరిజ్ఞానాన్ని ఇరాన్‌కు రష్యా లేదా చైనా అందించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్‌వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కొద్దిరోజుల క్రితమే నిలిపేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నెట్‌వర్క్ ద్వారానే అక్కడి సమాచారం అంతో ఇంతో బయటి ప్రపంచానికి తెలుస్తూ వస్తోంది. తాజాగా ఆ లింకును ఇరాన్ తెంచేసింది.
ఏమిటీ కిల్ స్విచ్?
స్టార్‌లింక్ ఉపగ్రహాలను జామ్ చేసేందుకు ఇరాన్ యంత్రాంగం వాడిన కిల్ స్విచ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిలిటరీ గ్రేడ్‌జామింగ్ ఎక్విప్‌మెంట్. దీని ఖరీదు 15.6 లక్షల డాలర్లని సమాచారం. స్టార్‌లింక్ రిసీవర్లు తమ యూజర్లను లొకేట్ చేసి వారితో కనెక్టయ్యేందుకు జీపీఎస్‌ను వాడతాయి. మిలిటరీ గ్రేడ్ జామర్లు ఆ లింకును తెంపేస్తాయి. అందుకోసం సదరు ఉపగ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో సిగ్నళ్లను విడుదల చేస్తాయి. మొత్తం వ్యవస్థను కలిపి కిల్ స్విచ్‌గా పేర్కొంటారు. 2014 నుంచీ రష్యా ఈ టెక్నాలజీని వాడుతోంది.


