సాక్షి, ఢిల్లీ: దేశరాజధాని వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకోలేని పరస్థితుల్లో అవస్థతలు పడుతున్నారని.. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ ఏం పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం వాయు కాలుష్యంపై కొందరు పర్యావరణవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోంది. పేద, ధనిక అన్నివర్గాల వాళ్లు కాలుష్యం బారిన పడుతున్నారు. నేనూ ఢిల్లీ వాయి కాలుష్యం బాధితుడినే. విషపూరిత వాయువులతో పిల్లలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు అని అన్నారాయన.
‘‘మోదీగారూ.. భారతదేశపు పిల్లలు మన కళ్ల ముందే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? ఈ అంశంపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి లేదా? ఒక ప్రణాళిక లేదు, బాధ్యతంటూ లేదా?’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.
ఇప్పటికైనా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. కాలుష్యాన్ని కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలి అని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా కొందరు చిన్నారుల తల్లులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు.. వాయు కాలుష్యం సోర్స్ నుంచే అరికట్టాలన్న పర్యావరణవేత్తలు.. చిన్నారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. గత రెండు వారాలుగా ఢిల్లీ వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పిల్లలను పరిస్థితులు చక్కబడేదాకా స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది కూడా.


