సీఎం మార్పు వివాదంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం
ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేసిన సిద్ధరామయ్య, డీకే
మరోవైపు ఇద్దరి మధ్య ట్వీట్ల వార్
త్వరలోనే పరిష్కారం లభిస్తుందంటున్న పరిశీలకులు
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణిపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆయా అంశాలు ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగడానికి సంబంధించి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యపై రాహుల్ అసహనానికి కారణాలను విశ్లేషిస్తే...
అధిష్టానం ఎవరనే చర్చకు తావిచ్చిన సీఎం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మీ సమస్యలు, విజ్ఞప్తులు ఏమైనా ఉంటే ఆయనకు తెలియజేయాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ గడచిన వారాంతంలో సూచించారు. అయితే ఖర్గేను సిద్ధరామయ్య కలుసుకున్నప్పటికీ.. తాను రాహుల్‌తో మాత్రమే చర్చిస్తానని, నేరుగా అధిష్టానంతో తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. బహుషా ఈ కారణంతోనే మీడియాతో ఖర్గే మాట్లాడుతూ అధికార మారి్పడి విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడే ‘పార్టీ హైకమాండ్’ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఖర్గే ఈ ‘అసహాయ వ్యాఖ్యలు’ చర్చనీయాంశమయ్యాయి. దీనంతటికీ సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణే కారణమని రాహుల్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నట్లు నివేదికల అందడం రాహుల్ అసహనానికి మరొక కారణం.
దేవరాజు అరస్ రికార్డును అధిగమించిన తర్వాత రాజీనామా?
మరోవైపు ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధరామయ్య కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒత్తిడి ఎక్కువయితే ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో వచ్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తప్పుకునే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజు అరస్ రికార్డును సిద్ధరామయ్య డిసెంబర్‌లో అధిగమిస్తారు. దీంతో అప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైకమాండ్ అంటే అదొక బృందం: ఖర్గే
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మరో ముగ్గురు నలుగురు కీలక నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని చర్చించి అన్నింటికి పరిష్కారం చూపుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం బెంగళూరులో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ఒకే ఒక్కరు కాదని, అదొక బృందమని, పార్టీ పెద్దలంతా కలసికట్టుగా కూర్చొని మాట్లాడుకుని రాష్ట్ర సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామన్నారు. సోనియాగాంధీ శుక్రవారం విదేశాల నుంచి వచ్చాక ఈ సమస్య పరిష్కారం ఒక కొలిక్కి వచ్చే వీలుంది.
సీఎం, డిప్యూటీ సీఎం ‘ట్వీట్ల’ యుద్ధం!
కర్ణాటక పరిణామాలు తాజాగా ‘ట్వీట్ల’ రాజకీయానికి దారితీశాయి. డిప్యూటీ సీఎం చేసినట్లు చెబుతున్న ఒక ట్వీట్‌కు కౌంటర్‌గా అన్నట్లు సీఎం మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలో పెద్ద శక్తి’ (వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్) అని డీకే శివకుమార్ ‘ట్వీట్’ చేశారు. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను డీకే ‘ఈ ట్వీట్ ద్వారా’ గుర్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆ ట్వీట్ తాను చేయలేదని, అదొక నకిలీ పోస్టు అని డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కాగా ‘ప్రజల కోసం మంచి ప్రపంచం నిరి్మంచలేనప్పుడు ఆ మాటకు శక్తి లేనట్లే’ అని అర్థం వచ్చేలా సీఎం ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదేళ్ల పరిపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ ప్రభుత్వ చేపట్టిన పలు పథకాలను వివరించారు. కర్ణాటక అనేది ఒక నినాదం కాదని, అది మాకు ఒక ప్రపంచమని ట్వీట్ చేశారు.


