రాజ్యాంగం ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు
బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై మలికార్జున ఖర్గే ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం దాడి చేస్తూ దాని ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగ విలువలు, సూత్రాలను ఒక పద్ధతి ప్రకారం కాలరాస్తున్నాయని, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం రూపకల్పనలో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎలాంటి పాత్ర లేదని ఖర్గే బుధవారం ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అణచివేసే బాధ్యతను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ముందుకు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రాజ్యాంగం అనేది పేదలకు ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడిని సహించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు.
ఈ దాడిని ఎదుర్కోవడానికి తాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటానని స్పష్టంచేశారు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని, అది ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం, గౌరవం, న్యాయం చేకూర్చడమే రాజ్యాంగం ఇస్తున్న హామీ అని వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, సిద్ధరామయ్య పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.


