26/ 11 సరిగ్గా 17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యావత్ దేశం విషాదంతో నిండిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై పాక్ ఉగ్రమూకలు విరుచుకపడ్డది ఈ రోజే. అమాయకులైన ప్రజలపై కాల్పులు జరుపుతూ 166 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. ఉగ్రదాడినుంచి తృటిలో తప్పించుకున్న దీవిక అనే బాధితురాలు ఆరోజు చేదు జ్ఞాపకాల్ని నేషనల్ మీడియాతో పంచుకున్నారు.
నవంబర్ 26 సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారా భారత్ వచ్చిన 10మంది ఉగ్రవాదులు హోటల్ తాజ్, ఒబెరాయ్, ఛత్రపతి మహారాజ్ టర్మినల్ రైల్వేస్టేషన్లలో చొరబడి అమాయక ప్రజలపై విచ్చల విడిగా కాల్పులు జరిపారు.
ఆ ఘటనలో ప్రత్యక్ష బాధితురాలైన దీవిక మాట్లాడుతూ "ఆరోజు కసబ్ కాల్పులు జరుపుతున్న సమయంలో కసబ్ మోహంలో ఏమాత్రం భయం కనిపించలేదు. కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు. ఆ మోహం ఇప్పటికీ నాకళ్లేదుటే మెదులుతుంది. ఆ కాల్పుల ఘటనను కళ్లారా చూసాను. నాకళ్లేదుటే చాలా మంది చనిపోయారు. ఆ రాత్రిని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. ప్రతి రోజు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నాను" అని ఆ భయానక రోజును గుర్తు చేసుకుంటూ ఆమె ఆవేదనకు లోనయ్యారు.
కోర్టులో కసబ్ ను గుర్తించడానికి వెళ్లినప్పుడు కసబ్ ను గుర్తించే ప్రయత్నంలో తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కానీ తాను ఆ రోజు కాల్పులు జరిపింది కసబ్ అని తేల్చి చెప్పానని అన్నారు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300కు పైగా ప్రజలు గాయపడ్డారు. ఆరోజు జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఈ రోజు నివాళులర్పిస్తారు.
ముంబై ఉగ్రదాడిలో మిగతా ఉగ్రవాదులంతా భారత బలగాలు జరిపిన కాల్పుల్లో మరణించగా అజ్మల్ కసబ్ ఒక్కరే ప్రాణాలతో పోలీసులకు పట్టుబడ్డాడు. కసబ్ ను 2012 నవంబర్ 21న రహస్యంగా ఉరి తీశారు.


