సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచన
హాజరైన ఆరు దేశాల ప్రధాన సీజేఐలు
న్యూఢిల్లీ: అంచనా వేయలేని తీర్పుల సంఖ్యను, తీర్పుల్లో భిన్నత్వాన్ని తగ్గించడానికి ఏకీకృత జాతీయ న్యాయ విధానం తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయస్థానాలు కచి్చతత్వంతో, స్థిరత్వంతో తీర్పులివ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో బార్, ధర్మాసనాల ప్రాధాన్యతను వివరించారు. కోర్టులను రాజ్యాంగానికి రక్షకులుగా భావిస్తే.. దీపం పట్టుకొని వారి మార్గాన్ని ప్రకాశవంతం చేసేవారే బార్ సభ్యులు అని వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తులు విధులు నిర్వర్తించడానికి బార్ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ఏకీకృత జాతీయ న్యాయ విధానం గురించి లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్‌నాథ్, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే భూటాన్, కెన్యా, మారిషస్, శ్రీలంక, నేపాల్, మలేíసియా సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు సైతం హాజరు కావడం విశేషం.


