సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్‌లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.
కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.
ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు
పవర్ షేరింగ్ ఏంటంటే..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది.


