సైన్యానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పిలుపు
సైనిక దళాల్లో సమూల మార్పులు తీసుకురావాలని వెల్లడి
ఢిల్లీలో ప్రారంభమైన ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఘర్షణలు పెరిగిపోతున్నాయని, శాంతియుత పరిస్థితులు క్రమంగా మటుమాయం అవుతున్నాయని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. వివాదాలు, యుద్ధాల కారణంగా ప్రపంచమంతటా అస్థిర వాతావరణం ఏర్పడిందని అన్నారు. గురువారం ఢిల్లీలో సైన్యం ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’సదస్సులో ఉపేంద్ర ద్వివేది ప్రసంగించారు.
నేడు మనం రోజురోజుకూ విస్తరిస్తున్న బహుళ ధ్రువ ప్రపంచంలో నివసిస్తున్నామని వెల్లడించారు. అగ్ర దేశాల నడుమ పోటీ పెరిగిపోతోందని చెప్పారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ద్విధ్రువ ప్రపంచం ఉండేదని, అప్పట్లో రెండు అగ్రదేశాలు పరస్పరం పోటీపడ్డాయని గుర్తుచేశారు. ఇప్పుడు మరికొన్ని దేశాలు ఈ పోటీలో చేరాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది అందరికీ ప్రతికూల సమయమని ఉద్ఘాటించారు.
జాతీయ భద్రత, ముందు జాగ్రత్త చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నామో ఆలోచించుకోవాలని చెప్పారు. భౌగోళిక రాజకీయ పరిణామాలు నానాటికీ వేగంగా మారిపోతున్న తరుణంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సైనిక దళాల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా సైన్యాన్ని తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు.
మూడు దశల కార్యాచరణ
దేశ రక్షణ, అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ‘5ఎస్’కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఉపేంద్ర ద్వివేది తెలియజేశారు. అవి.. సమ్మాన్(గౌరవం), సంవాద్(చర్చ), సయోగ్(సహకారం), సమృద్ధి(సౌభాగ్యం), సురక్ష(భద్రత) అని వివరించారు. ప్రస్తుత అమృతకాలంలో మన ప్రయాణం ‘వికసిత్ భారత్’దిశగా సాగుతోందని వ్యాఖ్యానించారు. 5ఎస్ స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని కోరారు.
‘మార్పు కోసం సంస్కరణ: సశక్త్, సురక్షిత్ భారత్’అనే థీమ్‌తో ఈ ఏడాది ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’నిర్వహిస్తున్నారు. సైనిక దళాల సీనియర్ అధికారులు, దేశ విదేశాల నుంచి రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు హాజరయ్యారు. భారత సైన్యంతో గతంలో ప్రకటించిన దశాబ్దపు(2023–2032) దార్శనికతను ఉపేంద్ర ద్వివేది ప్రస్తావించారు. సవాళ్లను ఎదిరించే దిశగా సైన్యాన్ని సన్నద్ధం చేయడానికి మూడు దశాల కార్యాచరణను ప్రకటించారు.
సైన్యం ఆధునీకరణకు 2032, 2037, 2047 నాటికి చేపట్టే చర్యలను వివరించారు. రక్షణ రంగంలో స్వయం స్వావలంబన(ఆత్మనిర్భరత)కు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టంచేశారు. అలాగే నూతన ఆవిష్కరణలను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ), సైబర్, క్వాంటమ్, స్పేస్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ రంగాల్లో ప్రయోగాల దశ నుంచి దాటి మరింత ముందుకు వెళ్తున్నట్లు తేలి్చచెప్పారు. దేశ రక్షణ కోసం సైన్యం, పౌర సమాజం మధ్య సమన్వయం పెరగడానికి చర్యలు తీసుకుంటున్నామని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.


