క్యూలోనే ప్రాణాలు విడిచిన గిరిజన మహిళా రైతు
గుణ: గిరిజన మహిళా రైతు ఒకరు పంట పొలానికి అవసరమైన ఎరువుల కోసం దుకాణం వద్ద ఏకంగా రెండు రోజులపాటు క్యూలో ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలో క్యూలో ఉండగానే ఆమె ప్రాణాలు విడిచారు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుషెపూర్ గ్రామానికి చెందిన భురియా బాయి (58) మంగళవారం ఉదయం నుంచి ఏకబిగిన లైన్‌లో ఉన్నారు.
రాత్రంతా ఆమె అక్కడే ఉండిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, మధుమేహంతో బాధపడుతున్న భురియా బాయి బుధవారం రాత్రి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందజేస్తామని గుణ ఎంపీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా చెప్పారు. మహిళా రైతు మరణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.


