32 ఏళ్ల తర్వాత గుజరాత్ లో స్థిరావాసం
సింహం, పులి, చిరుత మూడూ ఉన్న ఏకైక రాష్ట్రంగా రికార్డు
ఔను. పులి నవ్వింది. నిత్యం సింహగర్జనలే వింటూ వచ్చిన గుజరాతీలకు శ్రవణానందం కలిగేలా గొంతెత్తి మరీ గాండ్రించింది. మూడు దశాబ్దాల పై చిలుకు సుదీర్ఘ విరామం అనంతరం గుజరాత్ లో దర్జాగా పాదం, కాదు కాదు, పంజా మోపింది. దాంతో, పులుల కోసం తమ 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు తెర పడి గుజరాతీలు
తెగ సంబరపడి పోతున్నారు.
గుజరాత్. మన దేశంలో సింహాలకు ఆలవాలమైన ఏకైక రాష్ట్రం. అయితే అంత పెద్ద రాష్ట్రంలో పెద్ద పులి తిరగాడి మూడు దశాబ్దాలు దాటింది. ఆ లోటును తీరుస్తూ ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో కాలు మోపింది. పొరుగునున్న మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, దొహాడ్ జిల్లాలోని రతన్ మహ ల్ అభయారణ్యంలో 9 నెలలుగా స్వేచ్ఛా విహారం చేస్తోంది.
కొన్నేళ్లుగా పులులు అడపదడపా పక్క రాష్ట్రాల నుంచి రావడం పరిపాటే అయినా, ఏదో చట్టం చూపుగా ఇలా వచ్చి అలా వెళ్లినవే తప్ప ఇలా నెలల పాటు తిష్ఠ వేసుకున్న దాఖలా మాత్రం ఇదేనని గుజరాత్ అటవీ అధికారులు చెబుతున్నారు. ఇంత కాలం ఉండటమంటే ఇక ఇక్కడే ఉండిపోవడమేనని వారు వివరించారు. దీన్ని తమకు గర్వకారణంగా, గుజరాత్ పర్యావరణ, జీవ వైవిధ్య చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గ ఉదంతంగా అభివరి్ణంచారు రాష్ట్ర అటవీ మంత్రి అర్జున్ మోద్వాడియా. అటవీ శాఖ అధికారులు కూడా, ‘ఇన్నేళ్లుగా పులులకు మొహం వాచి ఉన్నాం.
రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకునేది లేదు. గుజరాత్ లో పులుల సంఖ్యను ఇతోధికంగా పెంచడమే ఇప్పుడు మా ఏకైక లక్ష్యం‘ అంటున్నారు. వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ ఐదేళ్ల కోడె ప్రాయంలో ఉన్న మగ పులి. దాంతో దానికి ఈడూ జోడూ అయిన ఒక చూడ చక్కని ఆడ పులిని సెట్ చేసే ప్రయత్నంలో పడింది గుజరాత్ అటవీ శాఖ. మధ్యప్రదేశ్‌లోని జబువా, కథియవాడా ప్రాంత అడవుల్లో కొన్నేళ్లుగా పులుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
దాంతో వాటికి అవసరమైన వేట దొరక్క వలస బాట పడుతున్నాయి. గుజరాత్ లోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ ఆ బాపతేనని అటవీ అధికారులు చెబుతున్నారు. గుజరాత్ నేలపై పులులు అరుదుగా అప్పుడెప్పుడో 1980ల్లో ఒకసారి, మళ్లీ 2002 ప్రాంతంలో ఇంకోసారి చట్టం చూపుగా అడుగు పెట్టాయని వారు వివరించారు. ‘గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతం సింహాలకు పెట్టింది పేరు. ఇక సెంట్రల్ గుజరాత్ చిరుతలకు ఆలవాలం. ఇప్పుడు పులి రాకతో మా రాష్ట్రానికి నిండుడ వచ్చింది‘ అన్నది వారి మాట.
– సాక్షి, నేషనల్ డెస్క్


