ఎంత ఉన్నత విద్యాశాఖ చూస్తున్నా అన్నీ తెలుసుననుకోవటం ఎంత పెద్ద తప్పో మధ్యప్రదేశ్ మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్‌కు జ్ఞానోదయమైనట్టుంది. బ్రహ్మసమాజ వ్యవస్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ ‘బ్రిటిష్ ఏజెంటు’ అంటూ మొన్న శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి బలంగా ఉన్న వర్తమానంలో ఇష్టానుసారం మాట్లాడితే ఆ మరుక్షణం నుంచే విమర్శల జడి మొదలవుతుంది.
అందుకే 24 గంటలు తిరగకుండా ‘నోరు జారాను... తప్పయి పోయింద’ంటూ ఆయన ఒక వీడియో విడుదల చేయాల్సివచ్చింది. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్‌లోనే కాదు... దేశదేశాల్లో ఉన్న బెంగాలీ పౌరులంతా ఒక్కటై ఆగ్రహా వేశాలు వ్యక్తం చేశారు. తక్షణం దీన్ని చల్లార్చకపోతే పెను సమస్య అవుతుందని భయపడిన పశ్చిమ బెంగాల్ బీజేపీ విభాగం, పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి ఆయనతో పశ్చాత్తాప ప్రకటన చేయించాయి. బెంగాల్ మేధాచరిత్ర గర్వించదగ్గది.
‘బెంగాల్ ఇవాళ ఏం ఆలోచిస్తుందో... దేశం రేపు అదే ఆలోచిస్తుంది’ అన్న నానుడి ఒకప్పుడు జోరుగా వినబడటానికి కారణం 19వ శతాబ్దిలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యారంగాల్లో అక్కడ పెల్లుబికిన సంస్కరణలే! వీటన్నిటి వెనుకా రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారు. 1857లో ఆయన స్థాపించిన బ్రహ్మసమాజం హిందూ మతానికి వ్యతిరేకం కాదు. ఆయన నిరీశ్వరవాది అంతకన్నా కాదు. కుల వ్యవస్థ, ఆ వ్యవస్థలోని అంతరాల దొంతరలూ, సతీ సహగమనం, బాల్య వివాహాలు వగైరా దురాచారాలూ, మూఢనమ్మకాలూ ఆ మతవ్యాప్తికి, దాంతోపాటు సమాజ గమనానికి అడ్డంకిగా ఉన్నాయని ఆయన విశ్వసించారు.
తన భావాల వ్యాప్తికి ప్రిన్స్ ద్వారకానాథ్ టాగూర్, ఆయన కుమారుడు దేబేంద్రనాథ్ టాగూర్, కేశబ్‌చంద్రసేన్ వంటివారితో కలిసి బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. తన వాదనలకు వేదాలూ, ఉపనిషత్తులూ ఆధారం చేసుకున్నారు. ఏకేశ్వరోపాసన ఆయన సిద్ధాంతం. పట్టువదలని విక్రమార్కు డిలా రామ్మోహన్ రాయ్ పోరాడినందు వల్లే సతి దురాచారాన్ని నిషేధిస్తూ చట్టం వచ్చింది. స్వాతంత్య్రానికి వందేళ్ల క్రితమే సమాజం మూఢ నమ్మకాల ఉచ్చు నుంచి బయటపడాలనీ, దురాచారాలు సమసిపోవాలనీ, మహిళలకు సైతం విద్య అందాలనీ తపించినవారాయన.
ఆయన స్ఫూర్తితో పంజాబ్‌లో ఆర్య సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్ వంటివి ఆవిర్భవించాయి. వీటి దారులు వేరైనా మత సంస్కరణలే ఈ సంస్థల ధ్యేయం. చిన్ననాడే బెంగాలీ భాషతోపాటు సంస్కృతం, పర్షియన్, అరబిక్, హిందూ స్తానీ భాషల్లో నిష్ణాతుడై ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులతో పనిచేశారు. 1814లో ఆ ఉద్యోగాన్ని వదిలి ఆత్మీయ సభ పేరిట సంఘాన్ని స్థాపించి 1821లో వారపత్రిక ‘సంబాద్ కౌముది’ని ప్రచురించటం మొదలుపెట్టారు. ఆ రకంగా ఆయన దేశ పత్రికారంగానికి ఆద్యుడు.
దేశంలో మొదటగా 1823లో ఈస్టిండియా కంపెనీ అధికారులు కలక త్తాలో స్థాపించిన కళాశాల సంప్రదాయ సంస్కృత విద్యాబోధనకే పరిమితమైనప్పుడు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయటంతోపాటు విద్యార్థులకు సైన్సు, రేఖాగణితం, రసాయన శాస్త్రం, అనాటమీ వంటివి బోధించాలని అప్పటి గవర్నర్ జనరల్ అమ్‌హెస్ట్‌కు లేఖ రాశారు. సాధించారు. నిరుడు బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు తాము తీసుకుంటున్న చర్యల వెనకున్న స్ఫూర్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పిన సంగతి పర్మార్‌కు గుర్తులేదనుకోవాలి.
వర్తమాన ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కోసం చరిత్రను వక్రీకరించటం పర్మార్‌తోనే మొదలు కాలేదు. గతంలోనూ కొందరు నాయకులు ఇదే బాపతు మాటలతో విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలో ఇతర చోట్ల కన్నా బెంగాల్‌లో సామాజిక, సాంస్కృతిక ప్రతీకలుగా వెలుగులీనినవారు అధికం. వారిపై ఆరాధనా భావం, గౌరవ ప్రపత్తులు కూడా ఎక్కువ. వారి జోలికిపోతే, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే వచ్చే ఏడాది జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టి మునుగుతుందని బీజేపీ గ్రహించినట్టుంది. తెలిసీ తెలియకుండా నోరు పారేసుకోవటం మంచిది కాదు.


