అందరూ అనుకున్నట్టే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్’ సోమవారం మరణశిక్ష విధించింది. ఆమెతోపాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం ఇదే శిక్ష పడింది. నిరుడు ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డాక ఆమె బంగ్లా వదిలి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడామెను తమకు అప్పగించాలంటూ తాత్కాలిక ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరింది.
అధికారంలో కొనసాగాలన్న లక్ష్యంతో హసీనా అనేక అవకతవకలకు పాల్పడటం, వ్యతిరేకుల్ని జైలుపాలు చేయటం, న్యాయమైన ఉద్యమాలను సైతం ఉక్కుపాదంతో అణిచేయటం వాస్తవం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి తీరుతెన్నులు కూడా ఏమంత మెరుగ్గా లేవు. ‘పేదవాళ్ల బ్యాంకర్’గా పేరు తెచ్చుకుని 2006లో నోబెల్ బహుమతి సాధించిన ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్న దాఖలా కనబడదు.
తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో మతతత్వ వాదుల ప్రాబల్యం పెరిగింది. మైనారిటీ హిందువులకూ, మహిళలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులేర్ప డ్డాయి. ఆఖరికి న్యాయమూర్తులుగా పనిచేసినవారిని సైతం వేధించి, రాజీనామాలు చేయించారు. ఆరోపణలొచ్చినప్పుడల్లా అవి అవాస్తమని ప్రకటించటం తప్ప యూనస్ చేసిందేమీ లేదు. బహుశా ఇలాంటి పరిణామాల వల్ల కావొచ్చు... యూనస్‌కు హోంశాఖ ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఖుదాబక్ష్ చౌధురి సెలవు పేరిట ఇటీవల దేశం వదిలిపోయారు.
హసీనాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంపై జరిగిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే 1,400 మంది మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. కానీ వాటిపై విచా రణ జరిపి శిక్షించటానికి తాత్కాలిక ప్రభుత్వానికి హక్కూ, అధికారం ఉన్నాయా? బంగ్లా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వం అనే ఏర్పాటే లేదు.
పోనీ హఠాత్తుగా ప్రధాని దేశం విడిచిపోయారు గనుక ఆపద్ధర్మంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకున్నా, ఏడాదిలోగా ఎన్నికలు ఎందుకు జరపలేకపోయారు? అసలు హసీనాపై తీర్పు సందర్భమే కక్షపూరిత మైనది. ఈ నెల 14న తీర్పు ఇవ్వబోతున్నట్టు పక్షం రోజుల క్రితం ‘ట్రైబ్యునల్’ ప్రకటించింది. తర్వాత దాన్ని 17కు మార్చారు. ఆ తేదీ ఆమె పెళ్లి రోజు కావటం తప్ప మరేమీ కారణం లేదు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో సాధించదల్చుకున్నదేమిటో?!
తూర్పు పాకిస్తాన్... బంగ్లాదేశ్‌గా ఏర్పడి 54 ఏళ్లవుతోంది. ఆ సందర్భంగా పాక్ పాలకులపై సాగిన పోరాటంలో పాలుపంచుకుని, బంగ్లాదేశ్ ఆవిర్భావ అనంతరం తొలి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్‌తో సన్నిహితంగా పనిచేసిన యూనస్ ఇప్పుడు పాక్ అను కూల శక్తులతో చేతులు కలిపారు. పాక్ నేతలకూ, సైనికాధికారులకూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అచ్చం వారిలానే మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు.
నిజానికి హసీనా, యూనస్ 2007 వరకూ కలిసి పనిచేశారు. ఆ సంవత్సరం అప్పటి అధ్యక్షుడు లాజుద్దీన్ అహ్మద్ ఆత్యయిక స్థితి ప్రకటించినప్పుడు సైన్యం తిరగబడి ఆయన్ను తొలగించింది. ఆ తర్వాత అవినీతిపై పోరాటం చేస్తామన్న సైనిక పాలకులకు యూనస్ మద్దతు పలకటంతో ఇద్దరి మధ్యా చెడింది. అటు తర్వాత ఏర్పడిన హసీనా ప్రభుత్వం యూనస్‌ను ఇబ్బందుల పాలు చేసింది. 172 కేసుల్లో విచారణను ఎదుర్కొనటం, ఒక కేసులో శిక్ష కూడా పడి బెయిల్‌పై ఉండటం వగైరాలు సాగాయి.
పదవీ భ్రష్టత్వం ప్రాప్తించింది గనుక హసీనా ప్రభుత్వ అణచివేత చర్యలన్నీ ఆమెకు చుట్టుకున్నాయి. ఆ ఉద్యమం విఫలమైతే ఇవాళ విద్యార్థి నాయకులు, కొందరు రాజకీయ నాయకులు దోషులుగా నిలబడవలసి వచ్చేది. బంగ్లాలో అవామీ లీగ్ ప్రాబల్యం తగ్గి నట్టు లేదు. తీర్పు వెలువడటానికి ముందే అక్కడక్కడ హింస చోటుచేసుకుంది.
సోమవారం ఢాకా పూర్తిగా స్తంభించింది. హసీనాపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరగాల్సిందే. కానీ ఆ పని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ద్వారా జరగాలి. దేశంలో ప్రజా స్వామిక వాతావరణం ఏర్పడాలి. ఇవేమీ లేని విచారణలు, శిక్షలు ప్రజల్లో విశ్వసనీయత కలిగించలేవు.


