తన దుందుడుకు చర్యతో, దుష్ట పోకడతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని సంక్షోభం ఊబిలోకి నెట్టేశారు. వెనిజులా రాజధాని కారకాస్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి అమెరికా సైన్యం భీకర దాడులకు దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోనూ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌నూ కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి అపహరించుకుపోయింది. ఆయన ‘మాదకద్రవ్య ఉగ్రవాదానికి’ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసి న్యూయార్క్‌లో బంధించింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి.
కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా దాని కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, అఫ్గానిస్తాన్ నెత్తుటి ముద్దలయ్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది.
వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరు చుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం నికృష్టం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్‌ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగు కుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.
దేశాల మధ్య సమస్యలొస్తే శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి సిద్ధపడకుండా ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అధినేతను అపహరించటం ఉగ్రవాదం. అలాంటి చర్యలు ప్రపంచ శాంతిని భగ్నం చేస్తాయి. కానీ పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను సాధారణ విషయంగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. మదురో పెద్ద నియంతంటూ ప్రచారం లంకించుకున్నాయి. ట్రంప్ దరిదాపుల్లోకి రాగల నియంత ప్రపంచంలో ఉంటాడా? చావెజ్ వారసుడిగా 2013లో అధికారంలోకొచ్చిన మదురో నియంత అనటం పచ్చి బూటకం.
2019 ఏప్రిల్‌లో ‘తిరుగుబాటు’ చేసి అధికారంలోకొచ్చానని ప్రకటించుకున్న గెయిడో సాయుధ బృందం రక్షణలో రాజధాని కారకాస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా జనం నవ్వుకున్నారు. పోలీసులూ, సైనికులూ అతగాణ్ణి ఏమీ అనలేదు. చివరకు మదురో స్వయంగా పిలిచి నవ్వుతూ తలమీద ఒక్కటిచ్చి పొమ్మన్నారు. వేరే దేశంలో ఎక్కడైనా అది ఉరికంబం ఎక్కేంత తీవ్ర నేరం. కనీసం యావజ్జీవం జైల్లో మగ్గేంత అపరాధం.
వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికిపైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత అక్కడ ప్రాథమిక హక్కులు. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావెజ్ స్వాధీనం చేసుకోవటంవల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది.
అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా దీర్ఘకాలంగా సమస్యలకు ఎదురీదుతోంది. ప్రాణావసర మందులు కరువై లక్షమంది ప్రజలు మరణించారు. దారిద్య్రాన్ని తట్టుకోలేక 80 లక్షల మంది దేశం వదిలిపోయారు. ఇటీవల మదురో చర్యలు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు తోడ్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే మదురో చైనా కరెన్సీ యువాన్లలో వాణిజ్యం నెరపడం, చైనా, రష్యా, ఇరాన్‌లతో జతకట్టడం, బ్రిక్స్‌లో చేరేందుకు సంసిద్ధం కావటం అమెరికాను కలవరపరిచాయి.
అత్యధిక చమురున్న దేశం ఎదిగేలా కనబడటంతో డాలర్‌ను కాపాడుకోవటానికి అమెరికా ఈ తప్పుడు చర్యకు దిగింది. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్‌ల్యాండ్... ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి.


