
బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి పనిచేస్తున్నాయి
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు
వేధింపులు ఆపకపోతే ఢిల్లీవరకూ పోరాటం చేస్తామని హెచ్చరిక
కోల్‌కతా: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి.. బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పుగా ఉన్న బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని, ఆ తరువాత కేంద్రంలో ఓడించేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జరిగిన ర్యాలీలో మమత ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీలను ఆ పార్టీ వేధిస్తోందని, బెంగాలీ కమ్యూనిటీ గుర్తింపును తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బెంగాలీ చిహ్నాలను సైతం అవమానించే దుష్ట చర్యలకు పాల్పడుతోందని, 2019లో ఆ పార్టీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు బెంగాలీ ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించడం, నిర్బంధ శిబిరాలకు తరలించడం చేస్తోందన్నారు. ఎంత మందిని జైలులోపెడతారో చూస్తానని, ఈ వేధింపులు ఆపకపోతే తమ ప్రతిఘటన ఉద్యమం ఢిల్లీకి చేరుకుంటుందని హెచ్చరించారు. బెంగాలీ భాష, సంస్కృతిపై బీజేపీ దాడికి వ్యతిరేకంగా జూలై 27 నుంచి బెంగాల్‌లో ఒక ఉద్యమం ప్రారంభమవుతుందని మమత ప్రకటించారు.
ధర్నాలకు సిద్ధం కండి..
బెంగాలీలకు ఎన్‌ఆర్సీ నోటీసులు పంపే హక్కు అస్సాం ప్రభుత్వానికి ఎవరిచ్చారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 1.5 కోట్ల మంది వలసదారులకు బెంగాల్ నిలయంగా ఉందని ఆమె వెల్లడించారు. భారత నలుమూలల నుంచి ప్రజలను తాము స్వాగతిస్తున్నామని, కానీ బీజేపీ మాత్రం బెంగాలీలపై వేధింపులకు పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్‌తో కలిసి బీజేపీ కుట్రకు పాల్పడుతోందని ఆమె రోపించారు. వారు బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ద్వారా చేసినట్లు బెంగాల్‌లో కూడా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ‘బిహార్‌లో 40 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇక్కడ కూడా ప్రయత్నిస్తే అనుమతించబోం. మేం అడ్డుకుంటాం’అని మమత హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బెంగాలీని నిర్బంధించినా లేదా వేధించినా, ఇక్కడ వారికి సంఘీభావం ప్రకటించడానికి ధర్నాలో కూర్చోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీది సూపర్ ఎమర్జెన్సీ..
దశాబ్దాల కిందటి కాంగ్రెస్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ.. ఇప్పుడు దేశంలో సూపర్ ఎమర్జెన్సీ అమలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌లో అభివృద్ధి జరుగుతుందని అంటున్నారని, 11 ఏళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని మమత ప్రశ్నించారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో ఉన్న మీరు.. మాకు ఉపన్యాసాలు ఇస్తారా?’అని ఇటీవల బెంగాల్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో మోదీ ప్రసంగాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.
సంకెళ్లతో బంధించి మరీ సైనిక విమానాల్లో భారతీయ వలసదారులను అమెరికా బహిష్కరించినప్పుడు బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. టెలిప్రాంప్టర్ చూసి బెంగాలీలో మాట్లాడి బెంగాలీల హృదయాలను గెలుచుకోగలరని అనుకుంటున్నారని, పాక్ అక్రమిత కశ్మీర్‌ను ఆక్రమించలేకపోయిన బీజేపీ.. బెంగాల్ గురించి కలలు కనడం మానేస్తే మంచిదని హితవు పలికారు. బెంగాల్‌లో మహిళల భద్రతపై మాట్లాడుతున్న బీజేపీ.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింస గురించి సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. బెంగాల్ హింసాత్మక కేసులలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దీదీ స్పష్టం చేశారు.