పదాధికారులు, ముఖ్యనేతలు, మాజీ ఎంపీలకు బాధ్యతలు
నోటిఫికేషన్ వెలువడగానే అభ్యర్థులకు బీఫామ్
బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఎన్నికలు జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పార్టీపరంగా ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది.
వీరితోపాటు ఎన్నికలపై అనుభవమున్న వారిని, గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను కూడా కొన్నిచోట్ల ఇన్‌చార్జ్‌లుగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరికొన్నిచోట్ల ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లకు సైతం బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. అన్నిచోట్లా ఎక్కడికక్కడే ఆయా వార్డులు, డివిజన్ల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించి ముగ్గురునలుగురు పేర్లతో జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది.
దీనికి సంబంధించి అభ్యర్థుల నుంచి సేకరించేందుకు ఓ నమూనా దరఖాస్తులను కూడా నేతలకు అందజేసినట్టు పార్టీవర్గాల సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులకు బీఫామ్ అందజేయడంతోపాటు ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఆయా మున్సిపాలిటీల్లో సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యవేక్షణ జరిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రాష్ట్ర కార్యాలయంలో ‘వార్‌రూమ్’ ఏర్పాటు
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లోని నాయకులతో సమన్వ యానికి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వార్‌రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వార్‌రూమ్‌లో పారీ్ట నేతలతోపాటు, మానిటరింగ్ టీమ్, లీగల్‌సెల్‌కు చెందిన న్యాయవాదులు కూడా అందుబాటులో ఉంటారు. గురువారం రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఇన్‌చార్జ్‌లుగా ఆయా మున్సిపాలిటీల బాధ్యతలను చూసే నేతలు ఏదో మొక్కుబడిగా కాకుండా అంకితభావంతో పనిచేసి పూర్తి ఫలితాలు సాధించేలా పనిచేయాలని రాంచందర్‌రావు సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించినందున, మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా పారీ్టశ్రేణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
అనుబంధ విభాగాల పనితీరును గురించి కూడా తెలుసుకున్నారు. పార్టీ నేతలు డా.ఎన్.గౌతమ్‌రావు, టి.వీరేందర్‌గౌడ్, అశోక్ వేముల, డా.కాసం వెంకటేశ్వర్లు, డా. బూర నర్సయ్యగౌడ్, బండా కార్తీకరెడ్డి, జయశ్రీ, బండారు విజయలక్ష్మి, డా.శిల్పారెడ్డి, ఎన్వీ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.
దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
తాజా దావోస్ పర్యటనతో పాటు గతేడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరం పర్యటనలో భాగంగా ఎంతెంత పెట్టుబడులు వచ్చాయో తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గతేడాది దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు.
గత పన్నెండేళ్లలో...బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నామన్నారు. రాష్ట్రంలోని రెండేసి ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున (మొత్తం అయిదు) నిర్వహించే బహిరంగ సభల్లో కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని తెలిపారు.


