హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన.. హచికో కథను గుర్తు చేసింది.. తన యజమాని మరణించిన తర్వాత కూడా.. దాదాపు పదేళ్లు ప్రతిరోజూ షిబుయా రైల్వే స్టేషన్ వద్ద అతని కోసం ఎదురుచూసిన హచికో కథ జపాన్ అంతటా, తరువాత ప్రపంచవ్యాప్తంగా నిబద్ధత, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. హచికో కథ ఆధారంగా Hachi: A Dog’s Tale(2009) అనే హాలీవుడ్ సినిమా రూపొందించారు. అలాగే 777 చార్లీ.. ఆ చిత్రంలో పెంపుడు కుక్కతో ఓ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఎంత గొప్పగా చూపించారో తెలిసిందే.
మనుషులు, జంతువులకు మధ్య ఉండే విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలిచిన ఘటన.. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్‌లో వెలుగులోకి వచ్చింది. బయట అడుగుపెట్టడానికే మనుషులు భయపడేంతటి గడ్డకట్టే చలిలో.. భారీ మంచు కురుస్తున్నా.. తన చనిపోయిన యజమాని వెంటే నాలుగు రోజుల పాటు ఉండిపోయింది ఓ పిట్‌బుల్ శునకం..
భర్మౌర్‌లోని భర్మణి ఆలయం సమీపంలో యువకులు విక్షిత్ రానా, పియూష్ అదృశ్యమయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా వారు మంచులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల తర్వాత సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. పియూష్ మృతదేహం మంచు పొరల కింద కూరుకుపోయి ఉండగా, అతని పెంపుడు కుక్క మాత్రం అతని పక్కనే కూర్చుని ఉంది.
खोने का दर्द... कैसे करे बयान
भारी फीट बर्फबारी में भी नहीं छोड़ा साथ, 4 दिन भूखा-प्यासा मालिक के शव की निगरानी करता रहा#chamba #dog pic.twitter.com/elMS11O7xZ— Pravin Yadav/प्रवीण यादव (@pravinyadav) January 26, 2026
ఆ నాలుగు రోజుల పాటు ఆహారం ముట్టని ఆ మూగజీవి.. కనీసం ఆ ప్రదేశం నుంచి కూడా కదల్లేదు. గడ్డకట్టే గాలులను, మంచు తుఫానును తట్టుకుంటూ.. తన యజమాని మృతదేహాన్ని అడవి జంతువుల బారి నుంచి కాపలా కాసింది. రెస్క్యూ బృందం మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ కుక్క మొదట దూకుడుగా ప్రవర్తించింది. గుర్తు తెలియని వ్యక్తులు తన యజమానికి హాని చేయడానికి వచ్చారమోనని భావించింది. చివరకు సహాయక బృందం ఎంతో ఓపికతో ఆ కుక్కను శాంతింపజేసి, తాము సహాయం చేయడానికే వచ్చామని నమ్మించడంతో ఆ శునకం వెనక్కి తగ్గింది. జంతువుల ప్రేమ, విశ్వాసం మరణం తర్వాత కూడా నిలిచి ఉంటాయని ఈ ఘటన నిరూపించింది.


