కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆరునెలల నిర్బంధం తర్వాత
విడుదలైన పర్యావరణ ఉద్యమనేత
స్వాగతించిన ప్రతిపక్షాలు
లేహ్/న్యూఢిల్లీ/జోద్‌పూర్: లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని ఉద్యమించి చివరకు జైలుపాలైన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. గత ఆరునెలలుగా కారాగారానికే పరిమితమైన వాంగ్‌చుక్‌పై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణం రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన విడుదలచేసింది. తక్షణం ఆయనను విడుదలచేస్తున్నట్లు వెల్లడించింది. వెనువెంటనే ఆయనను జోధ్‌పూర్ కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదలచేశారు. భర్త విడుదల కోసం కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న గీతాంజలి ఆంగ్మో జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి వచ్చి ఆయనను వెంట తీసుకెళ్లారు.
వాంగ్‌చుక్‌ను అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ భార్య వేసి న పిటిషన్ మార్చి 17వ తేదీన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు రాబోతున్న వేళ కేంద్రం ఆయనను విడుదలచేయడం గమనార్హం. ‘‘తాజా పరిస్థితులు, లద్దాఖ్‌లో శాంతిస్థాపనే ధ్యేయంగా వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం. లద్దాఖ్‌లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పాదుగొల్పడమే మా లక్ష్యం. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ వంటి అంశాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో అర్థవంతమైన చర్యల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాం. ఎన్‌ఏసీ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఆయనను తక్షణం వదిలేస్తున్నాం’’అని కేంద్రం శనివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.
లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి, ఆరో షెడ్యూల్‌లో చేర్చడం సహా పలు డిమాండ్ల సాధన కోసం 59 ఏళ్ల వాంగ్‌చుక్ సారథ్యంలో యువత చేపట్టిన ఉద్యమం ఆనాడు లేహ్ పరిధిలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఉద్యమకారులతోపాటు 22 మంది పోలీసులు సహా ఆనాడు 90 మంది గాయపడ్డారు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న లద్దాఖ్‌లో ఉద్యమం లేవదీసి అత్యంత సున్నితమైన సరిహద్దు భద్రతా అంశాన్ని ఆయన ప్రమాదంలో పడేశారంటూ కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద గత ఏడాది సెపె్టంబర్ 26వ తేదీన ఆయనను లద్దాఖ్ పాలనాయంత్రాంగం అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాలతో ఆయనను తర్వాత జోధ్‌పూర్ జైలుకు మార్చిన విషయం తెల్సిందే.
మిగతా వారినీ విడుదలచేయండి
వాంగ్‌చుక్ విడుదలను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వాగతించాయి. వాంగ్‌చుక్‌తోపాటు ఉద్యమించి జైలుపాలైన తమ తోటి వారిని తక్షణం విడుదలచేయాలని ఉద్యమకారుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ‘‘సోనమ్ రాక మాకు ఆనందమే. కానీ ఉద్యమం వేళ జైలుపాలైన ఉద్యమకారులనూ విడుదలచేయాలి. వాళ్లపై మోపిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఉద్యమం చేయడమనేది రాజ్యాంగబద్ధ హక్కు. మా రాష్ట్ర హోదా డిమాండ్‌ను మోదీ సర్కార్ నెరవేర్చాల్సిందే’’అని లద్దాఖ్ లోక్‌సభ సభ్యుడు మొహమ్మద్ హనీఫా డిమాండ్‌చేశారు.
‘‘వాంగ్‌చుక్ విడుదల లద్దాఖ్ ప్రజల విజయం. లద్దాఖ్ వాసులపై మోపిన జాతీయవ్యతిరేక ముద్ర తప్పు అని వాంగ్‌చుక్ విడుదలతో తేలిపోయింది’’అని ది లేహ్ అపెక్స్ బాడీ(ఎల్‌ఏబీ) సహ చైర్మన్ చెరింగ్ డోర్జే అన్నారు. ‘‘దిల్దాన్ నామ్గియాల్, స్మాన్లా డోర్జీలనూ విడుదలచేయాలి. ఉద్యమం ఆగదు’’అని కార్గిల్ ప్రాంత రాజకీయనేత, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్(కేడీఏ) సభ్యుడు సజ్జద్ కార్గిలీ అన్నారు. ‘‘లద్దాఖ్ భద్రత, సుస్థిరతలో జాతీయవాది వాంగ్‌చుక్ పాత్ర అత్యంత కీలకమైంది’’అని అతని లాయర్, కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వ్యాఖ్యానించారు. వాంగ్‌చుక్ విడుదలను జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు.
హింసను ఆపేయాలి: ఎల్జీ
‘‘లద్దాఖ్ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. వాంగ్‌చుక్ విడుదల తర్వాత మళ్లీ హింసాత్మక మార్గంలో ఉద్యమిస్తామంటూ ఊరుకునేది లేదు. ఉద్యమాలకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. లద్దాఖ్ పౌరులు, నేతలు, వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపుల మార్గంలోనే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’అని లద్దాఖ్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశం కాగా అందులో వాంగ్‌చుక్‌ను తక్షణం విడుదలచేయాలని ఎల్‌ఏబీ, కేడీఏ నేతలు కోరడం తెల్సిందే.


