సాక్షి, ఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఈ క్రమంలో విజయ్ పార్టీ టీవీకేకు విజిల్ గుర్తును ఈసీ కేటాయించింది. అలాగే, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తమిళనాడులో టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది.
ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
BIG BREAKING 🚨
The Election Commission has allotted the whistle symbol to TVK ✅🥳🔥#TVKVijay @TVKVijayHQ pic.twitter.com/eYnFgK6doO— Vijay Social Teamⱽˢᵀ (@TST_Offcl) January 22, 2026
అయితే.. కరూర్ ఘటన తర్వాత విజయ్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా స్పందించలేదు. అయితే, ఆయన తన పనిని తాను సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా.. పొంగల్ తర్వాత ఇటీవలే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.


