మనిషి నడక చిత్రంగా ఉంటుంది. అతను ముందుకు వెడుతున్నాననుకుంటాడు, కానీ అతనికి తెలియకుండానే అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. అది తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకే చూడండి: మనిషి పుడుతూనే మనిషి కాలేదు. ఇతర జంతుజాలంలానే తనూ పుట్టాడు; తనలాంటివాళ్ళతో గుంపు కట్టాకే మనిషయ్యాడు, పదిమందిలో ఒకడిగా ఉంటేనే తనకూ, పదిమందికీ కూడా భద్రత అని తెలుసుకున్నాడు. గణంగా మారాడు, సమాజంగా ఎదిగాడు, రాజ్యంగా అవతరించాడు, సామ్రాజ్యంగా విస్తరించాడు. మళ్ళీ తనే దేశంగా మారే క్రమంలో సరిహద్దులు గీసుకుని సాటి మనుషుల్ని దూరం పెట్టే తిరోగమనమూ చిత్తగించాడు.
మనిషి హోమోసేపియన్స్ పేరిట ఆధునిక మానవుడిగా అవతరించే నాటికే ఈ భూగోళం సువిశాలం. భూమ్మీద మానవ జనాభా లక్షల సంఖ్యకు చేరడానికి కూడా చాలా కాలం పట్టిందని శాస్త్రవేత్తలు అంటారు. మనుషుల గుంపుల మధ్య అనంతమైన దూరం ఉండేది. ఆ దూరాన్ని తరించడానికి కాలాన్ని జయించవలసివచ్చేది. ఆయుర్దాయం ముప్పై, నలభయ్యేళ్ళను మించేది కాదు కనుక, అందుకొక జీవితకాలం కూడా చాలేది కాదు.
గణాల మధ్య అల్లుకున్న బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు దూరాల్ని చెరిపి మనుషులను మానసికంగా దగ్గర చేసేవి. పసిఫిక్ మహాసముద్రంలోని టోబ్రియాండ్ దీవిజనం నౌకల మీద వెళ్ళి వెయ్యి మైళ్ళదూరంలో ఉన్న గణబంధువుల్ని కలిసి వాళ్ళకు కానుకలు ఇచ్చి రావడాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలా ఎలా జరిపేవారో ప్రముఖ మానవ శాస్త్రవేత్త బోనిస్లా మలినోవ్‌స్కీ రాస్తాడు. విచిత్రంగా, వాటికి ‘కులయాత్ర’లని పేరు.
తరగని దూరాలు ఉన్నప్పుడు మానసికంగా మమతలు పెంచుకుంటూ దగ్గరగా ఉన్న మనుషులు, దూరాలు మాయమై భౌతికంగా దగ్గరగా ఉన్నా కూడా దూరమయ్యే స్థితికి చేరుకున్నారు. మహానగరాలు, పట్టణాలలో బహుళ అంతస్తుల గృహ సము దాయాల్లో ఏళ్ల తరబడిగా కలసి ఉంటున్నా ఒకరికొకరు తెలియని పరిస్థితికి వచ్చారు. తమ ఉమ్మడి భద్రత కోసం, తమను కలిపి ఉంచడం కోసం తమే సృష్టించుకున్న వ్యవస్థలే తమను విడదీసేవయ్యాయి.
బ్రిటిష్ ఏలుబడిలో న్యాయస్థానాల ఏర్పాటు జరిగిన తర్వాత చిన్నాచితకా వివాదాలపై కూడా కోర్టుకు వెళ్ళడం ఎలా వేలంవెర్రిగా మారిందో, చివరికది కుటుంబ సభ్యుల్లోకి కూడా పాకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఎలా ఛిద్రం చేసిందో ఆ కాలపు ఉదంతాలు కళ్ళకు కట్టిస్తాయి. ఓ కుటుంబంలో ఆస్తి తగాదా పుట్టి ఏకంగా తల్లీ, కొడుకులే కోర్టు కెక్కారట. వాయిదాకు పొరుగూరు వెళ్లవలసి వచ్చి నప్పుడు ఇద్దరూ కలిసే వెళ్ళేవారట.
ఒకే సత్రంలో దిగేవారట. కొడుకు బయట ఎక్కడా భోజనం చేయడు కనుక తల్లే వండిపెట్టేదట! రాను రాను, శాస్త్రసాంకేతిక విజ్ఞానాల చేతిలో మనుషులు మరబొమ్మలయ్యారు. బంధుత్వాలూ, స్నేహాలూ ముఖాముఖీ అభివ్యక్తికి దూరమై మొబైల్ తెరకు పరిమితయ్యే పలకరింపులవుతున్నాయి.
సాహిత్య రంగానికే వస్తే, ‘పాట’ దశను దాటి ‘రాత’ దశకు చేరడాన్ని పురోగమనంగా చెప్పుకోవడం పరిపాటి అయింది. కానీ నిజానికి పాటే కాదు, ఆట కూడా సమూహ చింతన నుంచి, సమష్టి చైతన్యం నుంచి పుడితే; రాత వైయక్తిక స్పందన నుంచి పుట్టింది. సమూహం నుంచి విడివడి మనిషి ఒంటరి అయ్యే ఆ పరిణామాన్ని పురోగమనమనాలో, తిరోగమనమనాలో తేల్చుకోలేక పోవడమే మానవ జీవనంలోని మహా వైచిత్రులలో ఒకానొకటి.
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ/మచ్చుకైనా లేడు చూడూ’ అనే పాట కొద్ది రోజులుగా తెలుగునాట వాడవాడలా వినిపిస్తూ, గుండె గుండెనూ తట్టిలేపడం చూశాం. తనే నిలువెత్తు పాటగా మారి, జనంలోకి వెళ్ళి, మనిషి మనిషిలో మోగి హఠాత్తుగా మన మధ్య నుంచి మాయమైన మనకాలపు పాటల గంధర్వుడు అందెశ్రీ కట్టిన పాట అది.
‘ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా... అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా... కదిలె విశ్వం తనా కనుసన్నలో నడువా, కనుబొమ్మ లెగరేసి కాలగమనం లోన’ మనిషి మాయమై పోతున్నడమ్మా అని హెచ్చరిస్తున్న ఆ పాట నిజానికి సందేశ పరంగా మానవ జాతీయ గీతాలలో ఒకటి కాదగినదీ, విశ్వవేదిక మీద వినిపించవలసినదీ.


