కాలం మారుతుందనీ, రేగిన గాయాన్ని మాన్పుతుందనీ అనుకుంటాం. కానీ, అన్ని సార్లూ అది నిజం కాదు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ ప్రాంత అత్యాచార కేసులో తాజా పరిణామాలు పాత గాయాన్ని మళ్ళీ రేపి, బాధితుల గుండెల్లో బడబాగ్నిని రగిలించాయి. సదరు కేసులో దోషి అని తేల్చి, మాజీ ఎమ్మెల్యే – బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్‌సింగ్ సెంగార్‌కు ఆరేళ్ళ క్రితం 2019లో ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధిస్తే, వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్ట్ ఆ శిక్షను సస్పెండ్ చేయడం గగ్గోలు రేపింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కుల్దీప్ ‘ప్రజా సేవకుడు’ కిందకు రారనీ, కాబట్టి చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినవారిపై ప్రయోగించే ‘పోక్సో’ చట్టంలోని కఠిన అంశాల కింద గతంలో ఆయనకు శిక్ష వేయడం సరికాదనీ హైకోర్ట్ మాట. ఇది అన్యాయ మంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, సీబీఐ అప్పీలు చేయడం, హైకోర్ట్ ఉత్తర్వును డిసెంబర్ 29న సుప్రీంకోర్ట్ పక్కనపెట్టడం ఇప్పుడు ఒకింత ఊరట.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన 17 ఏళ్ళ మైనర్, దళిత బాలిక అత్యాచారం, ఆ తదుపరి సంఘటనలు తలుచుకుంటే ఇవాళ్టికీ గుండె బద్దలవుతుంది. ఉద్యోగం మిషతో రప్పించిన మైనర్ బాలికపై కుల్దీప్ తన నివాసంలో 2017 జూన్‌లో అత్యాచారం జరి పారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా, కొన్ని నెలల పాటు అతీగతీ లేదు. పోరాటం చేసిన బాలిక తండ్రిని సైతం తప్పుడు కేసులో ఇరికించి, చావచితక కొట్టారు. ఆఖరికి 2018 ఏప్రిల్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట బాలిక ఆత్మాహుతి యత్నానికి దిగేసరికి, ఉన్నావ్ కేసు జాతీయస్థాయి సంచలనమైంది. కనపడని పోలీసు దెబ్బలతో కన్నతండ్రి కస్టడీలోనే మరణించడం రచ్చ రేపేసరికి, కేసు సీబీఐకి చేరింది. అయినా తిప్పలు తప్పలేదు.
కేసులో పోరాడుతున్న బాధిత కుటుంబం, లాయరుతో సహా వెళుతున్న కారును గుర్తు తెలియని వాహనం గుద్ది, బాధితురాలి కుటుంబసభ్యులిద్దరిని 2019 జూలైలో పొట్టనబెట్టుకుంది. బెదిరింపులకు తాళలేక ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని రక్షణ కోరేసరికి, విషయం సుప్రీం దృష్టికి వెళ్ళింది. 2019 డిసెంబర్‌లో కుల్దీప్‌ను దోషిగా తేల్చి, శిక్ష వేసినా, చట్టంలోని లోటుపాట్లు ఆసరాగా బయటకు వచ్చే ప్రయత్నం హైకోర్ట్‌లో సాగింది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు సభ్యుల తాజా మధ్యంతర ఉత్తర్వుల ఫలితంగా... ఇప్పటికైతే కుల్దీప్‌ను కస్టడీ నుంచి విడుదల చేయరు. కానీ ఆయన అప్పీలు పెండింగ్‌లో ఉంటుంది.
బాధితులను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టంలోని అసలు స్ఫూర్తిని అర్థం చేసు కోకుండా, కేవలం అందులోని మాటలను అడ్డం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే కష్టమే నని తాజా ఘటనలో హైకోర్ట్ వ్యవహారశైలి రుజువు చేసింది. అదే సందర్భంలో రకరకాల ఆరోపణలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతున్న వేళ హైకోర్ట్ జడ్జీల నిబద్ధతను సమర్థిస్తూనే, సుప్రీం ఇచ్చిన తీర్పు కొత్త ఆశలు రేపుతోంది. బాలికపై అత్యాచారం, ఆ పైన ఆమె తండ్రి మరణంలో దోషి అయిన మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకొస్తే, ప్రాణాపాయం తప్పదని బాధిత కుటుంబం బెంబేలెత్తుతున్న సమయంలో సుప్రీం తీర్పు మళ్ళీ ధైర్యం ఇచ్చింది. పైపెచ్చు, ఈ వ్యవహారంలో చట్టంతో ముడిపడిన అనేక కీలక ప్రశ్నలు ముందుకు వచ్చాయనీ, వాటిపై పూర్తిస్థాయిలో ఆలోచన జరపడం అవసరమనీ సుప్రీంకోర్ట్ పేర్కొనడం గమనార్హం. అంటే, రాబోయే రోజుల్లో పలు అంశాల్లో ఈ కేసులో కోర్ట్ ఇచ్చే స్పష్టత, దాని పర్యవసానాల ప్రభావం దీర్ఘకాలం ఉండనుంది.
‘ప్రజా సేవకుడు’ ఎవరనే అంశంలో హైకోర్ట్ చెప్పిన భాష్యం లోపభూయిష్ఠం. ఒక వేళ ఆ భాష్యాన్నే అనుసరిస్తే, తీవ్రమైన లైంగిక నేరాల పరిధి నుంచి చట్టసభల సభ్యులు ఇట్టే తప్పించుకొనే ప్రమాదం ఉంది. ‘ఈ లెక్కన పోక్సో చట్టం కింద కానిస్టేబులేమో పబ్లిక్ సర్వెంట్ కానీ, ఎమ్మెల్యే మాత్రం కాదన్నమాట’ అని సుప్రీం చేసిన వ్యాఖ్య చిన్నది గానే కనిపించినా, లోతుగా ఆలోచన రేపే చురకత్తి. దోషిగా తేలిన వ్యక్తిని సైతం సాంకేతిక కారణాలతో రక్షించాలనుకోవడం వకీళ్ళకు చెల్లుతుందేమో కానీ, చేసిన నేరాన్నీ, దాని తీవ్రతనూ వదిలేసి వ్యవహరించడం న్యాయమూర్తులకు పాడి కాదు. ఒకవేళ చేసిన చట్టంలోనూ, దానిలో ప్రొవిజన్లలోనూ స్పష్టత లోపిస్తే, వాటిని సరిదిద్దేలా కోర్టులు వివరణ ఇస్తేనే ధర్మం నిలబడుతుంది. దోషులకు శిక్ష పడి, బాధితులకు న్యాయం జరుగుతుంది. ఉన్నావ్ కేసులో తాజా సుప్రీం జోక్యం ఆ దిశగా అడుగులేయడమే ఇప్పుడు అవసరం.


