breaking news
homo sapiens
-
బుద్ధిజీవులకైనా 'బలమైన సవాల్'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని నా రచనల్లో ఎలీన్ ఇంటెలిజెన్స్‌గా కూడా ప్రస్తావిస్తూ ఉంటాను. బుద్ధిజీవు లైన మానవ జాతిని మానవ పరిణామ శాస్త్ర పరిభాషలో హోమో సేపియన్స్గా పిలుస్తారు. నాకెందుకో ఒక కొత్త జాతి వృద్ధి చెంది ఈ హోమో సేపియన్స్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అనిపిస్తోంది. ఈ భూగోళంపై మొదటిసారిగా మనకు నిజమైన పోటీ ఎదురవుతోంది. ఇప్పటికి కొన్ని వేలాది ఏళ్ళుగా మనమే అత్యంత తెలివైన జాతిగా ఉంటూ వస్తున్నాం. ఆఫ్రికాలో ఓ మూలన ప్రాధాన్యం లేని కోతులుగా పడి ఉన్న మనం ఈ తెలివి తేటల కారణంగానే, ఈ భూగోళానికి తిరుగులేని పాలకులుగా మారగలిగాం. కానీ, ఇపుడు మనం సృష్టిస్తున్నది సమీప భవిష్యత్తులో మనకు పోటీగా పరిణమించవచ్చు. పిల్లల్ని పెంచడం లాంటిదే!ఏఐ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. అది ఒక సాధనం కాదు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన ఏజెంట్. అది కొత్త ఐడియాలను కనిపెట్టగలదు. నేర్చుకోగలదు. తనకుతాను మారగలదు. మనం ఇంతకు ముందు కనుగొన్న ముద్రణాలయం, అణు బాంబు లాంటివి మనల్ని శక్తిమంతులను చేసిన సాధనాలు. వాటికి మన అవసరం ఉంది. ప్రెస్ స్వయంగా పుస్తకాలు రాయలేదు. ఏ పుస్తకాలను ప్రచురించాలో నిర్ణయించలేదు. అణు బాంబు తనకన్నా శక్తిమంతమైన మరో బాంబును కనుగొనలేదు. తానెక్కడ పేలాలో దాని కంతట అదే నిర్ణయించుకోలేదు. కానీ, ఏఐ ఆయుధం దాడికి లక్ష్యాన్ని ఎంచుకోగలదు. తదుపరి తరం ఆయుధాలను దానికంతట అదే డిజైన్ చేయగలదు.నా తాజా పుస్తకం ‘నెక్సస్’లో ఏఐని చిన్న పిల్లాడిలా అభివర్ణించాను. మనం ఏది నేర్పుతామో వాడు అదే నేర్చుకుంటాడు. కనుక, మనందరం ముఖ్యంగా, వివిధ దేశాల స్థితిగతులను ప్రభావితం చేస్తున్న నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. మనం అబద్ధాలాడుతూ, వంచన చేస్తూ, ఏఐ మాత్రం దయగలదిగా ఉండా లంటే కుదరదు. ఒక నిర్దిష్టమైన రీతిలో ఈ ఏఐని మనం డిజైన్ చేయగలమా? ఏఐకి నీతి నియమాలు బోధించగలమా? వాటిలోకి కొన్ని లక్ష్యాలను చొప్పించగలిగిన విధంగా కోడింగ్ చేయగలమా? అనే అంశాలపై పరిశోధన, ప్రయత్నాలు సాగుతున్నాయి. అపుడు మనం సురక్షితంగా ఉంటాం కదా అని భావిస్తున్నారు. కానీ, ఈ దృక్పథంలో రెండు ప్రధాన సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఒకటి– అసలు ఏఐ అంటేనే నేర్చుకోగలదు, దానికంతట అది మారగలదు. కనుక మనం ఏఐని డిజైన్ చేస్తే, నిర్వచనాన్ని అనుసరించి, మనం ఊహించలేని అన్ని రకాల పనులనూ అది చేసేస్తుంది. రెండు– ఇది ఇంకా పెద్ద సమస్య. మనం ఏఐని పిల్లాడిలానే భావించి విద్యా బుద్ధులు నేర్పించాం అనుకుందాం. సత్పౌరుడుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. వారి చదువు సంధ్యలపై మీరు ఎంత వెచ్చించారన్నది లెక్కలోకి రాదు. చివరకు, వారు చేసే పని మిమ్మల్ని ఆశ్చర్యపరచనూవచ్చు లేదా భయపెట్టనూవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది. ఇది పిల్లల్ని పెంచేవారందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మనం పిల్లలకి ఏం చెబుతామన్న దానికన్నా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. మనం పిల్లలకి అబద్ధా లాడవద్దని చెప్పేసి, మనం మాత్రం ఇతరులతో అబద్ధాలు చెబుతూంటే, వారు చూసి మనల్నే అనుకరిస్తారు. మన ఆదేశాల్ని పాటించరు. అబద్ధాలాడకూడదనే నీతిని ఏఐలలో చొప్పించే ప్రాజెక్టును చేపట్టామనుకుందాం. కానీ, వాటికి ప్రపంచంతో యాక్సెస్ ఉంది. మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారో అవి గమనిస్తాయి. అదే నడతను మన పట్లా ప్రదర్శిస్తాయి. అన్నింటిలోనూ... అన్ని చోట్లా...వ్యాపారాలలో ఏఐ ప్రాధాన్యం ప్రస్తుతానికి పెద్ద లెక్కలోకి రానిదిగానే కనిపించవచ్చు. ఇప్పటికి 36 నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా అంటే... అది టైమ్ స్కేల్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఉదాహరణకు, ఇది లండన్‌లో 1835 సంవ త్సరం అనుకుందాం. మాంచెస్టర్– లివర్‌పూల్ మధ్య మొదటి రైలు మొదలై అప్పటికి ఐదేళ్లయింది. లండన్‌లో 1835లో చర్చకు కూర్చున్నవాళ్లకు ‘రైల్వేలు ప్రపంచాన్ని మార్చేస్తాయి, పారిశ్రామిక విప్లవం వచ్చేస్తుంది’ అంటే నాన్సెన్స్ అని కొట్టిపడేస్తారు. కానీ, ఇపుడు రైల్వేలు మొదలై చాలా ఏళ్ళు అయింది. పారిశ్రామిక విప్లవం, రైల్వేలు ప్రతీదాన్నీ మార్చేశాయని మనకు ఇపుడు తెలుసు. కానీ, మార్పు వచ్చేందుకు ఐదేళ్ళకన్నా ఎక్కువే పట్టింది. అలాగే, ఇప్పటికి తెలిసిన రంగాలు, అంతగా తెలియని రంగా లన్నింటిలో కూడా ఏఐతో మార్పులు రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం ప్రధానమైన మార్పులను చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థను ఏఐ చాలా వేగంగా హస్తగతం చేసుకోబోతోంది. ఆర్థికం పూర్తిగా సమా చార ప్రభావిత రంగం. డ్రైవర్ సీట్లో మనిషి లేకుండా నడిచే కార్లు లక్షల్లో మనకు అప్పుడే రోడ్డు మీద కనబడకపోవచ్చు. ఎందుకంటే, రోడ్డుమీద గుంతలుంటాయి, మనుషులు నడుస్తూంటారు, కంగా ళీగా ఉంటుంది కనుక ఏఐతో నడిచే వాహనాలు రాకపోకలు సాగించడానికి సమయం పడుతుంది. కానీ, ఆర్థికంలో సమాచా రమే ప్రధానం. వస్తుంది, వెళుతుంది. దానిపై పట్టు సాధించడం ఏఐకి చాలా తేలిక. ఆయుధ పోటీ లాంటి స్థితిఏఐ కొందరి ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది అంటున్నారు. దీనిపై చాలా మందిలో ఆందోళన ఉంది. మరి ఒక సమాజంగా బతికి బట్టకట్టడమే కాదు, వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏఐకి అపారమైన సానుకూల సామర్థ్యమూ ఉంది. ప్రమాదకరమైన సామర్థ్యమూ ఉంది. ఒకే టెక్నాలజీ పూర్తిగా భిన్నమైన సమాజాలను సృష్టించడాన్ని మనం 20వ శతాబ్దంలో గమనించాం. అందుకే కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వాలతోపాటు, ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలూ ఏర్పడ్డాయి. ఏఐతోనూ అంతే! దాన్ని అనేక విధాలుగా ఉపయోగించుకునేందుకు మనకు అవకాశం ఉంది. కాకపోతే, మనం మొదటిసారిగా పనిముట్లతో కాకుండా ఏజెంట్లతో వ్యవహరిస్తున్నామనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఇప్పటికీ ఏఐ చాలా వరకు మన చెప్పుచేతల్లోనే ఉంది. మనం ఆ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేస్తాం? అంతకన్నా ముఖ్యంగా మనం దాన్ని ఎక్కడెక్కడ నియోగించబోతున్నాం? అన్నది ప్రశ్న. ఎంచుకునేందుకు మనకు చాలా అవకాశాలున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే, ఏఐ విప్లవంలో ప్రస్తుతం అగ్ర భాగాన ఉన్న కంపెనీలు, దేశాలు ఆయుధాల సమీకరణ లాంటి పోటీ స్థితిలో చిక్కుకున్నాయి. ఈ విషయంలో మందగతిన సాగడమే మంచిదని వాటికి తెలిసినా, సురక్షణపై మరింత వ్యయం అవసరమనే గ్రహింపు ఉన్నా, ఆ శక్తిమంతమైన పరిణామం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన ఉన్నా, మనం బ్రేకులు వేసి నంత మాత్రాన ఇతరులు వేయకపోవచ్చనే భయం వారిని నిరంతరం వెన్నాడుతోంది. ఎక్కడ ఎదుటివారు ప్రపంచంపై ఆధిపత్యం సంపాదిచ్చేస్తారేమోననే ఆదుర్దా వారిని నిలువనీయడం లేదు. -
మంచి మాట: ఉండాల్సిన లక్షణం
మంచితనం; మానవ జాతి మొదలయిన రోజు నుంచి ప్రతిమనిషికి అతిముఖ్యంగా కావాల్సి వచ్చింది ఏదైనా ఉంది అంటే అది మంచితనం. ఒక మనిషి నుంచి మరొక మనిషికి జారి పోకుండా అందాల్సింది ఏది అని అంటే అది మంచితనం. మొత్తం మానవ జాతికి సర్వదా, సర్వథా క్షేమకరం అయిందీ, లాభకరం అయిందీ ఏదైనా ఉందీ అంటే అది మంచితనం. మానవజాతిలో మంచితనానికి ఆది నుంచీ కొరత ఉండడం కాదు అసలు మంచితనం మనలోకి, ప్రపంచం లోకి ఇంకా రానేలేదు. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇకపైనైనా మనలో మంచితనం కోసం మంచి ప్రయత్నాలు మెదలు అవచ్చు. మంచితనం అని మనం అనుకుంటోంది నిజానికి మంచితనం కాదు. మంచితనం అని మనం అనుకుంటోంది మంచితనమే అయి ఉంటే మన ప్రపంచంలో జరుగుతూ వస్తున్న హాని, విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాలు, ద్రోహాలు, దొంగతనాలు, కుట్రలు, మనుషుల బతుకులు అల్లకల్లోలం అవడమూ మనకు తెలుస్తూ ఉన్నంత తెలుస్తూ ఉండేవి కావు; ఇప్పటిలా మనం వాటివల్ల దెబ్బతినేవాళ్లం కాము. మంచితనానికి మంచి జరగలేదేమో? అందుకే మనలోకి, ప్రపంచంలోకి రావడానికి మంచితనానికి ఇంకా మంచిరోజు రాలేదేమో? మంచితనానికి మంచి జరిగే ఉంటే ఎంతో బావుండేది. మనకు నెమ్మది, మన బతుకులకు భరోసా ఉండేవి. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని యోగులు, గురువులు, కవులు, జ్ఞానులు అందరినీ మంచితనంవైపు మళ్లించే మాటలు చెప్పారు. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. ఎందుకో చెడు అబ్బినట్టుగా మనిషికి మంచి అబ్బలేదు. ఏమిటో మరి చెడుకు మాలిమి అయినట్టుగా మనిషి మంచికి మాలిమి అవలేదు. ఇందుకు కారణాలు తెలిసిపోతే మంచికి రోజులు వచ్చేస్తాయేమో? చెడుకు రోజులు చెల్లిపోతాయేమో? మనిషి చెడుతోనే పుడతాడు. చెడు అన్నది ఎవరికైనా పుట్టకతోనే వచ్చేస్తుంది. మనిషిలో చెడు సహజంగానే ఉంటుంది. మనిషి తనలో ఉన్న చెడును తొలగించుకుంటూ మంచిని అభ్యసిస్తూ ఆపై దాన్ని సాధించాల్సి ఉంటుంది. మనిషికి చెడు అన్నది లక్షణం; మంచి అన్నది లక్ష్యం. మనిషి తన లక్షణాన్ని వదులుకుని ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాడు. మనకు ప్రశాంతత కావాలి; అందుకు మంచితనం వచ్చి తీరాలి. మంచితనం వేగంగా రావాలి; మంచితనం నిజంగా రావాలి. కొత్తగా పుట్టిన నదిలా అది ఎప్పటికీ ఉండేలా మంచితనం మనలోకి ప్రవహించాలి. ‘ఓ మంచితనమా, నువ్వు ఎక్కడ ఉన్నావ్? నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఇదే మా స్వాగతం; ఇంకా నువ్వు వేచి ఉండకు రా మాలోకి. రాయని కవితలా ఎక్కడో ఉండిపోకు; సరైన తరుణం ఇదే రా మాలోకి. మాకు నీ అవసరం చాలా ఉంది; నువ్వు లేకపోవడం వల్ల మా ఈ లోకం అపాయకరం అయిపోతూ ఉంది. వెంటనే వచ్చేసెయ్ ఓ మంచితనమా, ఎదురు చూస్తూ ఉన్నాం రా మంచితనమా రా’ అంటూ మనం అందరమూ మన క్షేమం కోసం మంచితనాన్ని మనసా, వాచా తప్పనిసరిగా ఆవాహన చెయ్యాల్సిన అవసరం ఉంది. మంచితనం మనలో లేనందువల్ల మనం విరిగిపోయిన వాక్యాలం అయ్యాం; అందువల్ల మనం అనర్థదాయకం అయ్యాం. ఈ స్థితిని అధిగమించి మంచితనాన్ని సాధిద్దాం; మనుగడను సాత్వికం చేసుకుందాం. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. – రోచిష్మాన్ -
Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో
సాక్షి, హైదరాబాద్: మానవ జాతి పుట్టిందెలా? వానరాల నుంచి అని చెప్పడం సులువే కానీ.. మానవులను పోలిన వానరాలూ బోలెడన్ని ఉండగా పరిణామ క్రమంలో కొన్ని నశించిపోయాయి. కొన్ని అవసరాలకు తగ్గట్టుగా పరిణామం చెందుతూ నేటి ఆధునిక మానవుడు ‘హోమో సేపియన్’గా ఎదిగాయి. ఈ అద్భుత పరిణామ క్రమంలో కీలకమైన ఘట్టాలను పరిశోధించి మరీ ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఎప్పుడో అంతరించిపోయిన హోమోసేపియన్ దూరపు చుట్టం ‘నియాండెర్తల్’ జాతి జన్యుక్రమాన్ని నమోదు చేయడంతోపాటు ఇప్పటివరకూ అస్సలు గుర్తించని మరో బంధువు డెనిసోవన్ జాతిని గుర్తించినందుకు ఈ బహుమతి లభించింది. సుమారు 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైన హోమో సేపియన్ల ప్రస్థానంలో పరిణామంలో నియాండెర్తల్, డెనిసోవన్ జాతుల జన్యువులూ చేరాయని, ఈ చేరిక ప్రభావం మనపై ఈ నాటికీ ఉందని పాబో గుర్తించారు. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల కారణంగా వచ్చే జబ్బులకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు మనలో చేరిన నియాండెర్తల్, డెనిసోవన్ జాతి జన్యువులపై ఆధారపడి ఉందని పాబో పరిశోధనలు చెబుతున్నాయి. ప్రత్యేక శాస్త్ర విభాగం మానవ పరిణామంపై జరుగుతున్న పరిశోధనల్లో పాబో సరికొత్త శకానికి, విభాగానికి దారి వేశానడంలో ఎలాంటి సందేహమూ లేదు. నియాండెర్తల్, డెనిసోవన్ జాతులపై పాబో చేసిన పరిశోధనల కారణంగా ఇప్పుడు ‘పాలియో జినోమిక్స్’ అనే కొత్త శాస్త్ర విభాగం ఒకటి ఉనికిలోకి వచ్చింది. హోమో సేపియన్లను, మానవుల్లాంటి ఇతర జాతులను (హోమినిన్లు) వేరు చేసే జన్యువులను గుర్తించడం ఈ శాస్త్రం ఉద్దేశం. హోమో సేసియన్లలోని ప్రత్యేక లక్షణాలను గుర్తించడం అన్నమాట. అంతరించిపోయిన హోమినిన్ జాతి హోమో సేపియన్లు ఎప్పుడో మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పరిణమించారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నియాండెర్తల్ జాతి ఆఫ్రికాకు అవతల... స్పష్టంగా చెప్పాలంటే యూరప్, పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన వారు. నాలుగు లక్షల ఏళ్ల క్రితం నుంచి ముప్ఫై వేల ఏళ్ల క్రితం వరకూ వీరి మనుగడ కొనసాగింది. ఆ తరువాత ఈ హోమినిన్ జాతి అంతరించిపోయింది. కానీ, 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మధ్యాసియా ప్రాంతానికి వలస వెళ్లిన హోమో సేపియన్లు నియాండెర్తల్ జాతితో కలిశారని పాబో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాతి కాలంలో హోమో సేపియన్లు క్రమేపీ ప్రపంచమంతా విస్తరించారన్నమాట. ఇరు జాతులు యురేసియా ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కలిసి జీవించాయని అంచనా. అయితే ఈ నియాండెర్తల్స్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 1990 చివరి నాటికి మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కాగా.. హోమినిన్లతో మనకున్న సంబంధాలను వెతకడం మాత్రం మొదలు కాలేదు. నియాండెర్తల్స్ వంటి హోమినిన్ల జన్యుక్రమం ఏదీ అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాబో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నియాండెర్తల్స్ డీఎన్ఏను అధ్యయనం చేసేందుకు స్వాంటే పాబో ప్రయత్నించారు. వేల ఏళ్ల క్రితం నాటి.. అంతరించి పోయిన జాతి డీఎన్ఏ దొరకడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాలక్రమంలో ఎంతో డీఎన్ఏ నాశనమైపోయి లేశమాత్రమే మిగిలి ఉంటుంది. పైగా బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పరిణామ జీవశాస్త్ర నిపుణులు అలన్ విల్సన్ వద్ద స్వాంటే పాబో పోస్ట్ డాక్టరల్ విద్యార్థిగా నియాండెర్తల్ డీఎన్ఏ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. 1990లో జర్మనీలో మ్యూనిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పురాతన డీఎన్ఏపై పరిశోధనలను కొనసాగించిన పాబో నియాండెర్తల్‌ల మైటోకాండ్రియా నుంచి డీఎన్ఏను సేకరించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. క్రోమోజోముల్లోని డీఎన్ఏతో పోలిస్తే ఈ మైటోకాండ్రియల్ డీఎన్ఏ కాపీలు వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి విశ్లేషణ విజయవంతమవుతుందని పాబో అంచనా. సుమారు 40 వేల ఏళ్ల క్రితం నాటి నియాండెర్తల్ ఎముక ముక్క నుంచి తొలిసారి ఈయన మైటోకాండ్రియల్ డీఎన్ఏను వేరు చేయగలిగారు. ఈ జన్యుక్రమంతో మానవులు, చింపాంజీల జన్యుక్రమాన్ని పోల్చి చూడటం సాధ్యమైంది. కణ కేంద్రక డీఎన్ఏను విశ్లేషించి నమోదు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీల సాయంతో దాదాపు అసాధ్యమనుకున్న నియాండెర్తల్ జన్యుక్రమ నమోదును 2010లో పూర్తి చేశారు. ఈ జన్యుక్రమాన్ని హోమో సేపియన్ల జన్యుక్రమంతో పోల్చి చూసినప్పుడు ఇరుజాతుల ఉమ్మడి పూర్వ జాతి భూమ్మీద సుమారు ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రాంతాల్లోని హోమోసేపియన్ల జన్యుక్రమాలను పోల్చి చూడటం ద్వారా మనకున్న ప్రత్యేకతలు తెలిశాయి. యూరోపియన్, ఆసియాకు చెందిన హోమోసేపియన్లలో 1–4 శాతం జన్యుక్రమం నియాండెర్తల్స్‌దని తెలిసింది. సరికొత్త హోమినిన్ గుర్తింపు స్వాంటే పాబో పరిశోధనల్లో అత్యంత కీలకమైంది.. డెనిసోవన్ అనే సరికొత్త హోమినిన్ జాతి గుర్తింపు. సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40 వేల ఏళ్ల క్రితం నాటి చేతి వేలి ఎముక ఆధారంగా ఇది జరిగింది. మంచులో కప్పబడి ఉండటం వల్ల ఈ ఎముకలోని డీఎన్ఏకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ డీఎన్ఏ జన్యుక్రమాన్ని నమోదు చేసి నియాండెర్తల్స్, హోమోసేపియన్లతో పోల్చి చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సరికొత్త జీవజాతికి డెనిసోవ అని పేరు పెట్టారు. తదుపరి పరిశోధనల్లో డెనిసోవన్, హోమోసేపియన్ల మధ్య జన్యువుల ఆదాన ప్రదానాలు జరిగినట్లు తెలిసింది. హోమో సేపియన్లు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చే సమయానికి యూరప్ పశ్చిమ ప్రాంతంలో నియాండెర్తల్స్, తూర్పు ప్రాంతంలో డెనిసోవన్లు ఉండేవారని స్పష్టమైంది. హోమోసేపియన్లు విస్తరిస్తున్న కొద్దీ ఈ రెండు జాతులతో కలవడం కూడా ఎక్కువైంది. పరిణామక్రమంపై పరిశోధనలకు నోబెల్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్య శాస్త్ర నోబెల్ స్టాక్‌హోమ్: వైద్య శాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మానవ పరిణామ క్రమంలో ఆయన సాగించిన విశిష్టమైన పరిశోధనలు ఆదిమ మానవుల (హోమినిన్స్) కంటే ఆధునిక మానవులు ఏ విధంగా భిన్నమో తెలియజేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గురించి కీలక విషయాలను బహిర్గతం చేస్తాయని వెల్లడించింది. నియాండెర్తల్స్, డెనిసోవన్స్ వంటి హోమినిన్స్ జన్యువును, ఆధునిక మానవుడి జన్యువును సరిపోల్చి చూసి, రెండింటి మధ్య తేడాలను వివరించే నూతన సాంకేతికతను స్వాంటే పాబో అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. స్వాంటే పాబో తండ్రి సూనే బెర్గ్స్ట్రామ్ 1982లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో, మ్యాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతను మంగళవారం, రసాయన శాస్త్రంలో విజేతను బుధవారం, సాహిత్యంలో విజేతను గురువారం, శాంతి బహుమతి విజేతను శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో విజేతను ఈ నెల 10వ తేదీన నోబెల్ కమిటీ ప్రకటించనుంది. నోబెల్ ప్రైజ్ గ్రహీతకు 9 లక్షల డాలర్ల (రూ.7.35 కోట్లు) నగదు అందజేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం జరుగనుంది. -
కాలగర్భంలోకి మానవ తొలిజాతి సంస్కృతి
లండన్: తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో ఆదిమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం కష్టమే! దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న మానవ జాతి పూర్వికుల సంస్కృతి, సంప్రదాయాలు ఈ తరానికే కాకుండా భవిష్యత్తులో మరే తరానికి తెలియకుండా కాలగర్భంలో కలసిపోయే ప్రమాదం ఏర్పడింది. శ్యాన్ తెగగా పిలిచే వీరే మానవ తొలి జాతి వారసులని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిపుణులు తేల్చారు. వీరు 20 వేల ఏళ్ల కిందటి నుంచే దక్షిణాఫ్రికా అటవి ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు దక్షిణాఫ్రికా నుంచి బోట్స్వానా, అంగోలా, నమీబియా వరకు విస్తరించి ఉన్నారు. బోట్స్వానాలో వీరిని బసర్వాలని పిలుస్తారు. వీరు సంచార జీవితమే ఎక్కువగా గడుపుతారు. బోట్స్వానా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని అక్కడి ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. వారికి పునరావాసం కల్పిస్తోంది. ఆధునిక ఆరోగ్య వసతులతోపాటు పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. దీంతో వారి సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా మారిపోనున్నాయి. శ్యాన్ తెగ పిల్లలు ఇంగ్లీషు చదువులు నేర్చుకుంటే క్రమంగా మారి ఆదిమ భాష కనుమరుగై పోతుంది. ఇప్పటికే వారి నృత్య రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి సంప్రదాయ కళలు కూడా నశించి పోతున్నాయి. ఎంతో మంది చరిత్రకారులు, కళాకారులు ఆదిమ జాతుల కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఆదిమ జాతుల సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగయ్యాయి. ఎప్పటికో ఓ నాటికి అంతరించిపోయే సంస్కృతిని మనం క్రియాశీలకమని గుర్తించాలని, అప్పుడే అది ఏదో రూపంలో బతికి ఉంటుందని లండన్‌లోని బోట్స్వానా హై కమిషన్‌లో పనిచేసిన బిహేలా సెకిరే వ్యాఖ్యానిస్తున్నారు.