
చరిత్రకారుడు, ‘సేపియన్స్’ పుస్తక రచయిత యువల్ నోవా హరారీ ‘వాల్ స్ట్రీట్ జర్నల్ లీడర్‌షిప్ ఇన్‌స్టి ట్యూట్’లో జరిపిన సంభాషణ సంక్షిప్త పాఠం.
విశ్వగురు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని నా రచనల్లో ఎలీన్ ఇంటెలిజెన్స్‌గా కూడా ప్రస్తావిస్తూ ఉంటాను. బుద్ధిజీవు లైన మానవ జాతిని మానవ పరిణామ శాస్త్ర పరిభాషలో హోమో సేపియన్స్‌గా పిలుస్తారు. నాకెందుకో ఒక కొత్త జాతి వృద్ధి చెంది ఈ హోమో సేపియన్స్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అనిపిస్తోంది. ఈ భూగోళంపై మొదటిసారిగా మనకు నిజమైన పోటీ ఎదురవుతోంది.
ఇప్పటికి కొన్ని వేలాది ఏళ్ళుగా మనమే అత్యంత తెలివైన జాతిగా ఉంటూ వస్తున్నాం. ఆఫ్రికాలో ఓ మూలన ప్రాధాన్యం లేని కోతులుగా పడి ఉన్న మనం ఈ తెలివి తేటల కారణంగానే, ఈ భూగోళానికి తిరుగులేని పాలకులుగా మారగలిగాం. కానీ, ఇపుడు మనం సృష్టిస్తున్నది సమీప భవిష్యత్తులో మనకు పోటీగా పరిణమించవచ్చు.
పిల్లల్ని పెంచడం లాంటిదే!
ఏఐ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. అది ఒక సాధనం కాదు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన ఏజెంట్. అది కొత్త ఐడియాలను కనిపెట్టగలదు. నేర్చుకోగలదు. తనకుతాను మారగలదు. మనం ఇంతకు ముందు కనుగొన్న ముద్రణాలయం, అణు బాంబు లాంటివి మనల్ని శక్తిమంతులను చేసిన సాధనాలు. వాటికి మన అవసరం ఉంది.
ప్రెస్ స్వయంగా పుస్తకాలు రాయలేదు. ఏ పుస్తకాలను ప్రచురించాలో నిర్ణయించలేదు. అణు బాంబు తనకన్నా శక్తిమంతమైన మరో బాంబును కనుగొనలేదు. తానెక్కడ పేలాలో దాని కంతట అదే నిర్ణయించుకోలేదు. కానీ, ఏఐ ఆయుధం దాడికి లక్ష్యాన్ని ఎంచుకోగలదు. తదుపరి తరం ఆయుధాలను దానికంతట అదే డిజైన్ చేయగలదు.
నా తాజా పుస్తకం ‘నెక్సస్’లో ఏఐని చిన్న పిల్లాడిలా అభివర్ణించాను. మనం ఏది నేర్పుతామో వాడు అదే నేర్చుకుంటాడు. కనుక, మనందరం ముఖ్యంగా, వివిధ దేశాల స్థితిగతులను ప్రభావితం చేస్తున్న నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. మనం అబద్ధాలాడుతూ, వంచన చేస్తూ, ఏఐ మాత్రం దయగలదిగా ఉండా లంటే కుదరదు.
ఒక నిర్దిష్టమైన రీతిలో ఈ ఏఐని మనం డిజైన్ చేయగలమా? ఏఐకి నీతి నియమాలు బోధించగలమా? వాటిలోకి కొన్ని లక్ష్యాలను చొప్పించగలిగిన విధంగా కోడింగ్ చేయగలమా? అనే అంశాలపై పరిశోధన, ప్రయత్నాలు సాగుతున్నాయి. అపుడు మనం సురక్షితంగా ఉంటాం కదా అని భావిస్తున్నారు. కానీ, ఈ దృక్పథంలో రెండు ప్రధాన సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఒకటి– అసలు ఏఐ అంటేనే నేర్చుకోగలదు, దానికంతట అది మారగలదు.
కనుక మనం ఏఐని డిజైన్ చేస్తే, నిర్వచనాన్ని అనుసరించి, మనం ఊహించలేని అన్ని రకాల పనులనూ అది చేసేస్తుంది. రెండు– ఇది ఇంకా పెద్ద సమస్య. మనం ఏఐని పిల్లాడిలానే భావించి విద్యా బుద్ధులు నేర్పించాం అనుకుందాం. సత్పౌరుడుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. వారి చదువు సంధ్యలపై మీరు ఎంత వెచ్చించారన్నది లెక్కలోకి రాదు. చివరకు, వారు చేసే పని మిమ్మల్ని ఆశ్చర్యపరచనూవచ్చు లేదా భయపెట్టనూవచ్చు.
ఇంకో విషయం కూడా ఉంది. ఇది పిల్లల్ని పెంచేవారందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మనం పిల్లలకి ఏం చెబుతామన్న దానికన్నా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. మనం పిల్లలకి అబద్ధా లాడవద్దని చెప్పేసి, మనం మాత్రం ఇతరులతో అబద్ధాలు చెబుతూంటే, వారు చూసి మనల్నే అనుకరిస్తారు. మన ఆదేశాల్ని పాటించరు. అబద్ధాలాడకూడదనే నీతిని ఏఐలలో చొప్పించే ప్రాజెక్టును చేపట్టామనుకుందాం. కానీ, వాటికి ప్రపంచంతో యాక్సెస్ ఉంది. మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారో అవి గమనిస్తాయి. అదే నడతను మన పట్లా ప్రదర్శిస్తాయి.
అన్నింటిలోనూ... అన్ని చోట్లా...
వ్యాపారాలలో ఏఐ ప్రాధాన్యం ప్రస్తుతానికి పెద్ద లెక్కలోకి రానిదిగానే కనిపించవచ్చు. ఇప్పటికి 36 నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా అంటే... అది టైమ్ స్కేల్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఉదాహరణకు, ఇది లండన్‌లో 1835 సంవ త్సరం అనుకుందాం. మాంచెస్టర్– లివర్‌పూల్ మధ్య మొదటి రైలు మొదలై అప్పటికి ఐదేళ్లయింది.
లండన్‌లో 1835లో చర్చకు కూర్చున్నవాళ్లకు ‘రైల్వేలు ప్రపంచాన్ని మార్చేస్తాయి, పారిశ్రామిక విప్లవం వచ్చేస్తుంది’ అంటే నాన్సెన్స్ అని కొట్టిపడేస్తారు. కానీ, ఇపుడు రైల్వేలు మొదలై చాలా ఏళ్ళు అయింది. పారిశ్రామిక విప్లవం, రైల్వేలు ప్రతీదాన్నీ మార్చేశాయని మనకు ఇపుడు తెలుసు. కానీ, మార్పు వచ్చేందుకు ఐదేళ్ళకన్నా ఎక్కువే పట్టింది.
అలాగే, ఇప్పటికి తెలిసిన రంగాలు, అంతగా తెలియని రంగా లన్నింటిలో కూడా ఏఐతో మార్పులు రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం ప్రధానమైన మార్పులను చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థను ఏఐ చాలా వేగంగా హస్తగతం చేసుకోబోతోంది. ఆర్థికం పూర్తిగా సమా చార ప్రభావిత రంగం. డ్రైవర్ సీట్లో మనిషి లేకుండా నడిచే కార్లు లక్షల్లో మనకు అప్పుడే రోడ్డు మీద కనబడకపోవచ్చు.
ఎందుకంటే, రోడ్డుమీద గుంతలుంటాయి, మనుషులు నడుస్తూంటారు, కంగా ళీగా ఉంటుంది కనుక ఏఐతో నడిచే వాహనాలు రాకపోకలు సాగించడానికి సమయం పడుతుంది. కానీ, ఆర్థికంలో సమాచా రమే ప్రధానం. వస్తుంది, వెళుతుంది. దానిపై పట్టు సాధించడం ఏఐకి చాలా తేలిక.
ఆయుధ పోటీ లాంటి స్థితి
ఏఐ కొందరి ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది అంటున్నారు. దీనిపై చాలా మందిలో ఆందోళన ఉంది. మరి ఒక సమాజంగా బతికి బట్టకట్టడమే కాదు, వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏఐకి అపారమైన సానుకూల సామర్థ్యమూ ఉంది. ప్రమాదకరమైన సామర్థ్యమూ ఉంది. ఒకే టెక్నాలజీ పూర్తిగా భిన్నమైన సమాజాలను సృష్టించడాన్ని మనం 20వ శతాబ్దంలో గమనించాం. అందుకే కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వాలతోపాటు, ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలూ ఏర్పడ్డాయి.
ఏఐతోనూ అంతే! దాన్ని అనేక విధాలుగా ఉపయోగించుకునేందుకు మనకు అవకాశం ఉంది. కాకపోతే, మనం మొదటిసారిగా పనిముట్లతో కాకుండా ఏజెంట్లతో వ్యవహరిస్తున్నామనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఇప్పటికీ ఏఐ చాలా వరకు మన చెప్పుచేతల్లోనే ఉంది. మనం ఆ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేస్తాం? అంతకన్నా ముఖ్యంగా మనం దాన్ని ఎక్కడెక్కడ నియోగించబోతున్నాం? అన్నది ప్రశ్న. ఎంచుకునేందుకు మనకు చాలా అవకాశాలున్నాయి.
ప్రధాన సమస్య ఏమిటంటే, ఏఐ విప్లవంలో ప్రస్తుతం అగ్ర భాగాన ఉన్న కంపెనీలు, దేశాలు ఆయుధాల సమీకరణ లాంటి పోటీ స్థితిలో చిక్కుకున్నాయి. ఈ విషయంలో మందగతిన సాగడమే మంచిదని వాటికి తెలిసినా, సురక్షణపై మరింత వ్యయం అవసరమనే గ్రహింపు ఉన్నా, ఆ శక్తిమంతమైన పరిణామం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన ఉన్నా, మనం బ్రేకులు వేసి నంత మాత్రాన ఇతరులు వేయకపోవచ్చనే భయం వారిని నిరంతరం వెన్నాడుతోంది. ఎక్కడ ఎదుటివారు ప్రపంచంపై ఆధిపత్యం సంపాదిచ్చేస్తారేమోననే ఆదుర్దా వారిని నిలువనీయడం లేదు.