అయిదేళ్ల క్రితం బిహార్‌లో అంతంతమాత్రంగా గెలిచి అధికారంలోకొచ్చిన ఎన్డీయే కూటమి ఈసారి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటున్న దాఖలా కనబడుతోంది. శుక్రవారం ఉదయం ఈవీఎంలు తెరిచినప్పటినుంచి ఆ కూటమి అప్రతిహతంగా పురోగ మించటం తప్ప వెనుకంజ లేదు. దాని ధాటికి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విపక్షాల కంచుకోటలనుకున్నవి కుప్పకూలుతున్నాయి.
అంగప్రదేశ్, భోజ్‌పూర్, మగద్, మిథిలాంచల్, సీమాంచల్, తిరుత్ తదితర ప్రాంతాలన్నిటా ఎన్డీయే కూటమి విపక్షాలకు అందనంత దూరంలో ఉందంటే... విపక్ష మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ)కి సారథ్యం వహించిన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవే తన స్థానాన్ని నిలుపుకోవటానికి యాతన పడ్డారంటే ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? గత ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరువైంది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్యలో కొన్నాళ్లు కూటమికి దూరమై... వెనక్కొచ్చినా ఎన్డీయేపై దాని ప్రభావం లేకపోవటం గమనించదగ్గది. 243 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 200 స్థానాలకు ఎగబాకే దిశగా అది దూసుకెళ్తుండగా కనీసం 40 అయినా వస్తాయా అనే సందిగ్ధంలో ఎంజీబీ పడింది. తన ప్రాభవం గతించి దశాబ్దాలవుతుండగా ఎన్నిక లొచ్చి నప్పుడల్లా ‘తగుదునమ్మా...’ అంటూ అధిక స్థానాల కోసం పట్టుబట్టే కాంగ్రెస్ షరా మామూలుగా 61 తీసుకుని బొక్కబోర్లా పడింది.
కూటమికి తాను పెద్ద గుదిబండనని రుజువు చేసుకుంది. గతంలో 70 సీట్లు తీసుకుని కేవలం 19 గెల్చుకున్న కాంగ్రెస్... ఇప్పుడు కేవలం 6తో సరిపెట్టుకునేలా కనబడుతోంది. సీమాంచల్‌లో ఎంఐఎం గతంలో గెల్చుకున్న అయిదు స్థానాలూ నిలుపుకోవటమేకాక రీ కౌంటింగ్ సాగుతున్న ఆరో స్థానంలోనూ నువ్వానేనా అన్నట్టుంది. వామపక్షాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే(సర్) పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) ఆదరాబాదరాగా మొదలెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు ఎంత హడావుడి చేసినా, సుప్రీంకోర్టుకెక్కినా... కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఓట్ చోరీ ప్రచారం చేసినా ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఫలితాల సరళి చెబుతోంది. అంతేకాదు... కుటుంబాని కొక సర్కారీ ఉద్యోగమిస్తామని ఆర్జేడీ చేసిన వాగ్దానం ఎన్డీయే నగదు బదిలీ ముందు వెలవెలబోయింది. 75 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే మహిళా రోజ్‌గార్ యోజన ద్వారా యేటా రూ. 10,000 ఇస్తామని చెప్పటమే కాక సెప్టెంబర్ 26న తొలి వాయిదాను అందించటం జనానికి నచ్చింది.
బాగా వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొన్నా 2020 నాటి తన 37.23 శాతం ఓట్లనూ పెంచుకోవటంలో ఎంజీబీ విఫలమైంది. అదే సమయంలో ఎన్డీయే గతం కన్నా పది శాతం మేర పెంచుకుంది. గతం కన్నా మహిళలు ఎన్డీయే వైపు మొగ్గటం,గతంలో అలిగి విడిగా పోటీచేసిన ఎల్‌జేపీ తిరిగి వెనక్కురావటం బాగా కలిసొచ్చింది. పెద్దమాటలు చెబుతూ వచ్చిన ప్రశాంత్ కిశోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి విపక్షాలను దెబ్బతీశారు.
ఆధిపత్య కులాల్లో ఓటు బ్యాంకును నిలుపుకొంటూనే బాగా వెనకబడిన ఎంబీసీ కులాలు, మహాదళిత్‌ల ఆదరణ పొందటం ఎన్డీయేకు లాభించింది. ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలకు తగినన్ని సీట్లివ్వటమే ఇందుకు కారణం. దీని ముందు ఆర్జేడీ ముస్లిం–యాదవ్ కలయిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 87 స్థానాల్లో దాదాపు 20 శాతం మించి ముస్లిం ఓట్లున్నా అందుకు దీటుగా సీట్లు కేటాయించటంలో ఆర్జేడీ విఫలమైంది. కొద్దోగొప్పో సీమాంచల్‌లో ఇచ్చినా ముస్లింలు ‘గెలిచే సత్తా’ ఉన్న అభ్య ర్థుల వైపే మొగ్గారు.
ఈ ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి కూడా అధికార పక్షానికి కొంతమేర లాభించింది. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయిదేళ్లుగా ఉన్న పథకాలను సైతం ఎన్నికల ముందు నిలిపేసిన ఈసీ... పెద్ద మనసు చేసుకుని బిహార్‌లో సరికొత్త మహిళా రోజ్‌గార్ యోజన జోలికి పోలేదు. ఎన్డీయే నెగ్గితే మళ్లీ నితీశ్ సీఎం అవుతారా లేదా అన్న సంశయం మొదట్లో ఉన్నా, ఫలితాల సరళి చూస్తే ఆ విషయంలో బీజేపీ పట్టుబట్టక పోవచ్చు. ఏదేమైనా ఇది ప్రధాని నరేంద్ర మోదీ, ‘సుశాసన్ బాబు’ నితీశ్ కుమార్ కలిసి సాధించిన ఘన విజయం.


