భోపాల్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఓటు చోరీ’ అంశాన్ని ఆయుధంగా చేసుకుని, బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నర్మదాపురంలోని పచ్‌మరి కొండ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటు చోరీ’ని కప్పిపుచ్చేందుకే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)నిర్వహించారని, అలాగే ఇది ఓటు చోరీని సంస్థాగతీకరించడానికి చేసిన ఒక ప్రయత్నమని ఆరోపించారు.
విలేకరులతో రాహుల్ మాట్లాడుతూ..హర్యానాలో మాదిరిగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లలో కూడా ‘ఓట్ల దొంగతనం’ జరిగిందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను హర్యానాలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చానని, అప్పుడు ఓటు దొంగతనం ఓలా జరుగుతోందో స్పష్టంగా వివరించానని అన్నారు. హరాన్యాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రతి ఎనిమిది ఓట్లలో ఒక కోటు చోరీ అయ్యిందని రాహుల్ ఆరోపించారు. ఈ డేటాను చూసిన తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదే జరిగిందని తాను నమ్ముతున్నానని అన్నారు.
తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని తాము క్రమంగా అందిస్తామని రాహుల్ పేర్కొన్నారు. తొలుత తన సమస్య ఓటు చోరీ అని, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అన్నారు. కాగా విలేకరులు రాహుల్‌ను ‘భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వివరాలను వెల్లడిస్తారా?’ అని అడిగినప్పుడు ఆయన తమ దగ్గర చాలా భిన్నమైన సమాచారం, వివరణాత్మక సమాచారం ఉందని, దానిని వెల్లడిస్తామని అన్నారు. ఇప్పటివరకూ కొంచెమే వెల్లడించామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ల ఉమ్మడి భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతున్నదని రాహుల్ ఆరోపించారు. దీని కారణంగా భారతమాతకు హాని జరుగుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: kolkata: మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యం


