కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌కు తోడుగా పార్టీలో యువరక్తం నింపేందుకు బీజేపీ కసరత్తు
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 100 మంది నేతల గుర్తింపు
జాతీయ జట్టులో సగటు వయస్సు 50–53 ఏళ్లు ఉండేలా చూసుకుంటున్నట్లు చర్చలు
2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రెండు దశాబ్దాలకు నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా యువనేత నితిన్ నబిన్ ఇటీవల పగ్గాలు చేపట్టాక పార్టీ సంస్థాగత పునరి్నర్మాణంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులోభాగంగా నబిన్ సహాయక జట్టును పూర్తిగా యువరక్తంతో నింపేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. జనవరిలోకొత్త అధ్యక్షుడిని అధికారికంగా నియమించిన తర్వాత ఉపా ధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రతినిధులతో కూడిన కొత్త ఆఫీస్ బేరర్ల బృందాన్ని ఎంపిక చేసేందుకు దేశ వ్యాప్తంగా యు వ నేతలను జల్లెడ పడుతోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా దేశాన్ని నడిపించేలా యువ నాయకత్వానికి అధిక ప్రాతినిధ్యం కలి్పంచే లక్ష్యంతో జట్టు కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
పార్టీలో మొదలైన ‘తరాల’మార్పు..
తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే తన నాయకత్వ మార్పు ముద్రను స్పష్టంగా వ్యక్తం చేస్తూ వస్తోంది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రివర్గ కూర్పులో యువకులకు పెద్ద పీట వేస్తోంది. 56 ఏళ్లున్న సామ్రాట్ చౌదరి, 57 ఏళ్లున్న విజయ్ సిన్హాలను బిహార్‌లో ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయగా, ఛత్తీస్‌గఢ్‌లో 57 ఏళ్లున్న అరుణ్ సావో, 52 విజయ్ శర్మలను ఉపముఖ్యమంత్రులుగా ఎంపికచేశారు. 50 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, 53 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో కూర్చోబెట్టారు.
ఇటీవలే గుజరాత్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి 19 మంది కొత్త మంత్రులను చేర్చుకున్నారు. దీంతో మంత్రివర్గం సగటు వయస్సు 60 నుంచి 55 ఏళ్లకు తగ్గింది. 40 ఏళ్ల హర్‡్ష సంఘ్వీని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇవన్నీ రాష్ట్రాల్లో బీజేపీ యువనాయకత్వాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతలకు అద్దంపడుతున్నాయి. 50 ఏళ్లుకూడా లేని నబిన్‌ను ఏకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబిన్ ఎన్నిక అనేది పార్టీ యువనాయకత్వం వైపు అడుగులేస్తోందనడానికి ప్రబల తార్కాణం. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఇది నిర్ణయాత్మక మార్పే. బీజేపీ రాబోయే పాతికేళ్లకు వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే యువనాయకత్వాన్ని సంసిద్ధం చేసుకుంటోంది’’అని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.
రెండు దశాబ్ధాలను నడిపించే నేతలకై వెతుకులాట..
2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత, అంతగా తెలియని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. 52 ఏళ్ల గడ్కరీ అప్పట్లో తన జట్టుని పునరి్నరి్మంచినప్పుడు, ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకోబోయే దిశను సూచించాయి. ముఖ్యంగా ఆయన తన జట్టులోని ప్రధాన కార్యదర్శులలో అనంత్ కుమార్, వసుంధరా రాజే, అర్జున్ ముండా, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా వంటి నేతలున్నారు. వారంతా గడిచిన పదహారేళ్లుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు మోస్తున్నారు. మరో పదేళ్ల పాటు సేవలందించే స్థాయిలో ఉన్నారు. అదే మాదిరి ప్రస్తుతం నబిన్ నేతృత్వంలోని జట్టులోనూ భవిష్యత్ నాయకత్వాన్ని ప్రతిబింబించే నేతలకు అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
రాబోయే రెండు, మూడు దశాబ్దాల పాటు పార్టీకి నాయకత్వం వహించే కొత్త నాయకులను తయారు చేయాలనే రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సూచనలకు అనుగుణంగా నవతరం ఆఫీస్ బేరర్లను ఎంపిక చేసే అవకాశాలున్నాయని∙తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తమ తమ రాష్ట్రాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకుల వివరాలను పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా తెప్పించి పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీళ్లలో అత్యధికులు 35 నుంచి 50 ఏళ్ల వయస్సు వారేకావడం గమనార్హం. ఇప్పటికే కొందరి నేతలకు భవిష్యత్‌లో పోషించే పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిని సైతం పార్టీ ప్రారంభించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తంగా జాతీయ కార్యవర్గంలో సగటు వయస్సు 53 ఏళ్లకు మించకుండా ఉండేలా నాయకుల ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది.


