చెన్నై: తమిళనాడు రాజకీయ రంగస్థలంపై సరికొత్త సమీకరణలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, జాతీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు సంఘీభావం తెలపడం సంచలనంగా మారింది. ఆమధ్య కరూర్‌లో జరిగిన విషాదకర ఘటన తర్వాత విజయ్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాహుల్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి, మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ఫోన్ కాల్ వెనుక అసలు కథ..
తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున ఒక ఫోన్ కాల్ రహస్యాన్ని బయటపెట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ మానసిక వేదనలో ఉన్నప్పుడు, ఆయనకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు. ‘బ్రదర్.. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, దేనికీ చింతించకు’ అంటూ ఫోన్‌లో రాహుల్ అన్నారని ఆధవ్ అర్జున తెలిపారు. ఈ భరోసా వెనుక ఉన్నది కేవలం వారి వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదని, లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇలా నేరుగా విజయ్‌కు మద్దతు పలకడం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.
డీఎంకేకు ఇది ‘ప్లాన్ బి’ హెచ్చరికా?
తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే నీడలో జూనియర్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోందా? అన్న అనుమానాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. 2009లోనే విజయ్‌కు యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావించారు. ఇప్పుడు విజయ్ సొంత పార్టీ పెట్టడంతో, రాహుల్ ఆయనకు అండగా నిలవడం ద్వారా డీఎంకేపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో డీఎంకేకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
బహిర్గతమైన అసహనం
విజయ్ పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి డీఎంకే ఇప్పటికే అప్రమత్తమైంది. అరుమనైలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వెనుక డీఎంకే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సెంగుట్టయ్యన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలవడం చూస్తుంటే భవిష్యత్తులో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
2026 సమరానికి నాంది
2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్-విజయ్ దోస్తీ తమిళనాడులో కొత్త కూటములకు బాటలు వేసేలా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును విజయ్ వైపు మళ్లిస్తే, రాష్ట్రంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర మారిపోతుంది. 1967లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలనే కాంగ్రెస్ ఆశలకు విజయ్ ఒక వేదికగా మారతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి


