అంకగణితం ప్లస్‌ అనైతికత! | Sakshi Editorial On NDA alliance wins Bihar elections | Sakshi
Sakshi News home page

అంకగణితం ప్లస్‌ అనైతికత!

Nov 16 2025 3:18 AM | Updated on Nov 16 2025 3:18 AM

Sakshi Editorial On NDA alliance wins Bihar elections

జనతంత్రం

ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్ర దాయం. ఇక ఆరింట ఐదొంతుల సీట్లు గెలిస్తే చెప్పేదేముంది! బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం లభించింది. భారత జాతీయ బడా మీడియా సంస్థలన్నీ కాషాయ దీక్షను స్వీకరించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. మరి కాషాయ పార్టీ నాయకత్వంలోని కూటమి అంతటి భారీ గెలుపును నమోదు చేస్తే భజించకుండా బజ్జోవు కదా! శరభ నాట్యాన్ని ప్రదర్శించాయి. అసోయ్‌ దూలాకు అసలు తగ్గలేదు. మొత్తం 243 స్థానాలున్న సభలో 202 స్థానాలను కైవసం చేసు కోవడమంటే మాటలు కాదు.

ఈ అంక గణితంలో ఇంకో పార్శా్వన్ని కూడా గమనించాలి. ప్రతిపక్ష కూటమికి క్యాప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌జేడీ పార్టీకి 23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇంతే శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకున్నది. ఈసారి పెద్దగా తగ్గిందేమీ లేదు. బీజేపీకి ఇప్పుడు 20 శాతం ఓట్లు పడ్డాయి. ఐదేళ్ల కింద కూడా అంతే! 19.8 శాతం ఓట్లను సాధించింది. గణనీయమైన పెరుగుదలేమీ కాదు. 

జేడీ (యు)కు అప్పుడు 16 శాతం, తాజాగా 19 శాతం ఓట్లు లభించాయి. మూడు శాతం పెరుగుదల! మహాగuЇబంధన్‌ (ఎంజీబీ) కూటమికి వైస్‌ క్యాప్టెన్‌గా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అప్పుడూ ఇప్పుడూ కూడా కూటమికి గుదిబండగానే మారింది. కాకపోతే దాని ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అప్పుడు తెచ్చుకున్న తొమ్మిది శాతం ఓట్లను దాదాపుగా కాపాడుకోగలిగింది.

ఒక కూటమిగా ఎంజీబీకి 2020లో 37.23 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో అదే కూటమి సాధించిన ఓట్లు 37.5 శాతం. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్య క్రమం తర్వాత గతంతో పోలిస్తే బిహార్‌ ఓటర్ల సంఖ్య నికరంగా 47 లక్షలు తగ్గింది. అయినా ఎంజీబీ ఓట్లు తగ్గలేదు. కానీ, సీట్ల లెక్కల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవలసివచ్చింది. 

ఈ రకమైన ఫలితాల లోగుట్టు పెరిగిన పోలింగ్‌ శాతంలో ఉన్నది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తొమ్మిది శాతం పైచిలుకు ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఈసారి ఎన్ని కల్లో తొమ్మిది శాతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. పురుష ఓటర్ల కంటే తొమ్మిది శాతం అధికంగా మహిళలు ఈసారి ఓటేశారు. గత ఎన్నికల్లో 37.26 శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి తొమ్మిది శాతం అదనంగా 46.7 శాతం ఓట్లను సంపాదించింది. 

సాధారణంగా పురుషులు, స్త్రీల పోలింగ్‌ శాతాల్లో ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ తేడాలుండవు. కానీ బిహార్‌లో ఈసారి మహిళల ఓటింగ్‌ శాతం పురుషులతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది. గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి పెరిగిన ఓట్ల శాతంతో మహిళా ఓట్ల పెరుగుదల సమానంగా ఉండటం ఒక విశేషం. అంతేకాదు. ఎన్డీఏ కూటమి ఓట్ల పెరుగు దల కూడా ఇంతే స్థాయిలో ఉండటం మరో విశేషం. ఇక్కడొక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. 

బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందట నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ‘మహిళా రోజ్‌గార్‌’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఏటా పదివేల రూపాయలుఅందజేస్తారు. కేవలం ప్రకటించడమే కాదు. దాదాపు కోటి యాభై లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. ఈ బదిలీ కార్యక్రమం షెడ్యూల్‌ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగిందని ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలను ఈ సంద ర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. ‘వైఎస్సార్‌ చేయూత’ అనే పథకాన్ని అప్పటికి నాలుగేళ్లుగా జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఆ సంవత్సరం గడువు ప్రకారం విడదల చేసిన 4 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతా లకు చేరకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఆ నిధులను విడుదల చేశారు. ఈ రెండు ఉదంతాలు ఎన్నికల సంఘం ‘నిష్పాక్షికత’కు నిలువెత్తు అద్దాల నుకోవాలి. 

మహిళల ఓట్లను ఇలా టోకున కొనుగోలు చేయడంతోపాటు మహిళల సాంస్కృతిక విశ్వాసాలను సైతం ఎన్డీఏ కూటమి బాగానే మార్కెటింగ్‌ చేసుకున్నది. ఛట్ పూజ అనేది ఉత్తరాదిన మరీ ముఖ్యంగా బిహార్‌లో మహిళలు చేసుకునే పూజా కార్యక్రమం. తమ భర్తల క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం నదీ తీరాల్లో మహిళలు సూర్యదేవుడిని, ఆయన సోదరి ఛట్ దేవిని వేడుకుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పూజ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. చిత్తం పూజ మీద, భక్తి ఓట్ల మీద!

ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఒక జాతీయ  పార్టీగా తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించవలసిన బాధ్యత కూడా ఆ పార్టీదే! లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అనే సామెత చందంగా ఆ పార్టీ పరిస్థితి మారుతుంది. ఆర్జేడీ హుందాగా ప్రజా తీర్పును అంగీకరించింది. ఓటమిలో విచారాన్ని, గెలుపులో గర్వాన్ని చూడబోమని ప్రకటించింది. నిరంతరం జనజీవితంతో మమేక మవుతామని వెల్లడించింది. ఎమ్‌జీబీలో ఆర్జేడీ మినహా మరో బలమైన పార్టీ లేకపోవడం ఆ కూటమికి పెద్ద బలహీనత. తన సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కోల్పోయి కాంగ్రెస్‌ పార్టీ ఓకుంటి గుర్రంగా మారింది. 

అయినా 64 సీట్లకు తగ్గేదే లేదని మొండికేసింది. ఆపైన మరికొన్ని సీట్లలో ‘స్నేహపూర్వక పోటీ’ పేరుతో కూటమిని ఇబ్బందులకు గురిచేసింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ 75 సీట్లకు పోటీచేసి కూటమి ఓటమికి కార ణమైంది. అప్పుడు దాదాపు విజయ తీరాలకు వచ్చిన తేజస్వీ యాదవ్‌ (ఆర్‌జేడీ) కాంగ్రెస్‌ కారణంగా అధికారాన్ని కోల్పో యారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు.

కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్‌ పార్టీల పలుకుబడి కేవలం ఓ పాతిక సీట్ల వరకే పరిమితం. వాటిలో ఈసారి సీపీఎమ్‌ఎల్‌ (లిబరేషన్‌) పార్టీ రెండు సీట్లలో, సీపీఎం ఒక్క సీటులో గెలిచాయి. ఇండియన్‌ ఇన్‌క్లూజివ్‌ పార్టీ అనే మరో అల్పప్రాణి కూడా ఈ కూటమిలో ఉన్నది. దానికీ ఒక సీటు లభించింది. ఎమ్‌జీబీ అలయెన్స్‌ కూర్పు ఓ బలహీనత. ఇక తేజస్వీ యాదవ్‌ తన సాంప్రదాయిక ప్రాబల్యాన్ని దాటిమరింత విస్తరించలేకపోవడం మరో బలహీనతగా మారింది. ముస్లిం – యాదవ్‌ (ఎమ్‌వై) కాంబినేషన్‌ ముప్ఫయ్యేళ్ల క్రితం సత్ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు. 

మిగిలిన బలహీన వర్గాలు కూడా జాగృతమైన ఈ పరిస్థితుల్లో తన పరిధిని విస్తరించు కోకుండా తేజస్వి తన ఆశయాన్ని నెరవేర్చుకోలేరు. లాలూ రాజకీయ చతురత ఇప్పటి కాలానికి సరిపోకపోవచ్చు. పైగా అనారోగ్యం, వయోభారం. ఆయనిక పొలిటికల్‌ గేమ్స్‌ ఆడ లేరు. ఆడవలసింది తేజస్వీ యాదవే! కొత్త తరానికి సరిపోయే ఆటను ఆయన నేర్చుకోకపోతే, ప్రత్యామ్నాయ శక్తులు రంగంలోకి రావచ్చు.

ఎమ్‌జీబీ కూటమి కూర్పుకు పూర్తి భిన్నంగా ఎన్డీఏ వ్యవహరించింది. విజయానికి అవసరమైన అంకెలను దృష్టిలో పెట్టుకొని అలయెన్స్‌కు రూపకల్పన జరిగింది. గతంలో ఒంట రిగా 130 సీట్లలో పోటీచేసి, ఐదు శాతానికి పైగా ఓట్లు తెచ్చు కున్న చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీని కూటమిలోకి తెచ్చుకున్నారు. 29 స్థానాలు కేటాయిస్తే ఆయన పార్టీ అందులో 19 గెలిచింది. మిగిలిన సీట్లలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులకు పాశ్వాన్‌ పార్టీ ఉపయోగపడింది. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి మాంఝీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఆయన పార్టీ ‘హిందూస్థానీ అవావ్‌ు మోర్చా’ కూడా భాగస్వా మిగా ఐదు సీట్లు గెలిచి కూటమికి ఉపయోగపడింది. వెనుక బడిన తరగతుల్లో కుష్వాహ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎల్‌ఎమ్‌ కూడా ఎన్డీఏకు ప్లస్‌ పాయింట్‌గా మారింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే సీమాంచల్‌ ప్రాంతంలోరంగంలోకి దిగిన ఎమ్‌ఐఎమ్‌ ఐదు సీట్లలో గెలవడమే కాక పలుచోట్ల ఎమ్‌జీబీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది.

సామాజిక సమీకరణాలను పక్కా లెక్కలతో కూర్పు చేసు కున్న ఎన్డీఏ కూటమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంగబలం, అర్థబలంతోపాటు ఎన్నికల సంఘం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనేందుకు ‘మహిళా రోజ్‌గార్‌’ పథకమే ఉదాహరణ. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఏటా పదివేల పథకాన్ని ప్రకటించే నైతిక హక్కు ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎన్నికల సంఘమే జవాబు చెప్పాలి. 

ఈ రకమైన అనైతికతకు తోడు అంకగణిత కూర్పులతో బిహార్‌ను ఎన్డీఏ గుప్పెట్లో పెట్టుకున్నది. అంతే తప్ప అక్కడ ఒక మహా ప్రభంజనం వీచి ఆర్జేడీని కూకటివేళ్లతో సహా పెకిలించిందేమీ లేదు. ఆ పార్టీ కొత్త శ్రేణు ల్లోకి విస్తరించలేకపోయింది. అంతే తప్ప తన పునాదిని పోగొట్టుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీకి కొత్తగా జరిగిన శృంగభంగం కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ముక్కూచెవులను బిహారీలు ఏనాడో కోసిపారేశారు.

భారతీయ జనతా పార్టీ పచ్చి మితవాద పార్టీ. తన మతవాద ముద్రను కూడా దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక, సామాజిక విషయాల్లో పచ్చి సోషలిస్టు వ్యతిరేకి. కానీ తన ప్రాబల్య విస్తరణ కోసం భావజాల సారూప్యత లేని పార్టీలతో సైతం చెలిమికి వెనకాడటం లేదు. నవభారత నిర్మాత పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను, ఆయన సోషలిస్టు ఆర్థిక విధా నాలను రోజూ విమర్శించే బీజేపీ బిహార్‌లో అంటకాగుతున్నది ఎవరితో? భారతీయ సోషలిస్టు పార్టీ స్థాపకులైన రామ్‌మనో హర్‌ లోహియా విచారధార లోంచి ప్రవహించినవాడే నితీశ్‌ కుమార్‌. దిగ్గజ సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్‌ అడుగుజాడల్లోనే నితీశ్‌ కుమార్‌ రాజకీయ అడుగులు పడ్డాయి. 

నెహ్రూకూ, లోహియా వాదులకూ విభేదాలుండవచ్చు. అంతిమ లక్ష్యం సామ్యవాదమే కదా! అంతెందుకు బిహార్‌లోని ఆర్జేడీ, జేడీయూ... రెండూ ఒకే తాను ముక్కలు. నితీశ్‌ పార్టీకి ఆయన తర్వాత వారసత్వ నాయకత్వం లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రం. ఇప్పుడు పెద్ద పార్టీగా గెలిచిన బీజేపీ నితీశ్‌ను మరికొంతకాలం కొనసాగనిచ్చి తర్వాత తానే పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్‌ తదనంతరం ఆయన పార్టీని కూడా బీజేపీ తనలో లీనం చేసుకోవచ్చనే అభిప్రాయం ఉన్నది.

హిందీ మాట్లాడే ‘కౌ బెల్ట్‌’ ప్రాంతంలో ఒక్క బిహార్‌ మాత్రమే పూర్తిస్థాయిలో బీజేపీకి చేజిక్కలేదు. అనతికాలంలోనే ఈ గోక్షేత్రమంతా కాషాయ ఛత్రఛాయలోకి రావడం ఖాయ మన్న ఆశాభావం బీజేపీలో ఇప్పుడు బలపడింది. ఇక మిగిలింది ఆర్యావర్త సంపూర్ణ కాషాయీకరణ! త్రివేణుల్లో ఒకటైన సరస్వతీ నది ఒకనాడు అదృశ్యమైనదని భావిస్తున్న నేటి రాజస్థాన్, గుజరాత్‌ ప్రాంతం నుంచి గంగా ప్రవాహపు ఆఖరి మజిలీ వంగభూమి వరకు విస్తరించిన ఆర్యావర్తంలో బీజేపీకి ఇప్పటిదాకా అందని రాష్ట్రం బెంగాల్‌ మాత్రమే. నిన్నటి విజ యోత్సవ ర్యాలీలో నరేంద్ర మోదీ బెంగాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ విజయయాత్రను మమతా దీదీ నిలువరించగలరా... లేదా? ఇంకో ఏడాది వేచి చూడాలి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement