breaking news
Raja ram mohan roy
-
రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపికైన డాక్టర్ ఏబీకే ప్రసాద్
జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబీకే ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆధ్ర ప్రదేశ్ నుంచి వెలువడిన ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది. 2004-2009 వరకు ఆంధ్ర ప్రడేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటి ఈ అవార్డును ప్రకటించింది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. -
చైతన్య భారతి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833
మూఢ నమ్మకాలు, మత దురభిమానం, అన్నీ దైవ నిర్ణయాలనే వాదం, బహుభారాత్వం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, పుట్టిన వెంటనే శిశువులను తల్లి అంగీకారంతో చంపే ఆచారం దేశ ప్రగతికి పెద్ద ప్రతిబంధకాలుగా పరిణమించిన 19వ శతాబ్దం అది. ఈ ఆచారాలను నిర్మూలించనిదే భారత ప్రజానీకానికి భవిష్యత్తు లేదన్న గ్రహింపు ఆరంభమైన కాలం కూడా అదే. ఆ గ్రహింపువల్ల ఆనాటి వలస ప్రభుత్వం కన్నా ఎక్కువ విప్లవాత్మక వైఖరితో వ్యవహరించారు మన సంస్కర్తలు కొందరు. అటువంటి యోధులలో రామ్ మోహన్ రాయ్‌ని అగ్రగణ్యునిగా చెప్పాలి. రామ్ మోహన్ రాయ్ 1772లో బెంగాల్లో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం వంగ, సంస్కృత భాషలలో సాగింది. తర్వాత పర్షియన్, అరబిక్ భాషలు నేర్చుకునేందుకు ఆయన పాట్నా వెళ్లారు. ఆ తర్వాతే ఆయన ఇంగ్లీషులోను, మరికొంత కాలానికి గ్రీకు, హిబ్రూ భాషలలోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఉపనిషత్తులను అధ్యయనం చేసిన తర్వాత భగవంతుడొక్కడే అనే భావన ఆయనలో మరింత బలపడింది. ఉపనిషత్తులలో కొన్నింటిని ఆయన ఆ తరువాత వంగ భాషలోకి అనువదించారు. ‘హేతుబద్ధత కలిగిన మతపరమైన భావాలను వ్యాప్తిలోకి తేవడానికి ఆయన 1814లో ‘ఆత్మీయ సభ’ను నెలకొల్పారు. సతీ సహగమనాన్ని నిర్మూలించడం కోసం ఉద్యమించారు. దీనిపై రామ్ మోహన్ రాయ్ చేసిన నిరంతర కృషి కారణంగానే, అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని నిషేధిస్తూ 1829లో చట్టం తెచ్చారు. రాయ్ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. మహిళలు విద్యావంతులు కావాలని కోరుకున్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించాలని కూడా ఆయన ఆనాడే వాదించారు. రామ్ మోహన్ రాయ్ విశ్వవాదం నేటి సామాజిక పరిస్థితులకూ వర్తిస్తుంది. – ఎస్.బి.ఉపాధ్యాయ్, ఐ.జి.ఎన్.ఓ.యు.లో చరిత్ర బోధకులు -
సంస్కరణలకు వేగుచుక్క
భారతీయ భాషా జర్నలిజానికి రాజా రామమోహన్ రాయ్ (మే 22, 1772–సెప్టెంబర్ 27,1833) ఆద్యుడని అంటారు నెహ్రూ. ఆధునిక యుగపు ప్రాధాన్యం గురించి ఆనాడే∙ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి రాయ్ అని రవీంద్రనాథ్ టాగూర్ శ్లాఘించారు. రాయ్ ఏకేశ్వరోపాసనను ప్రగాఢంగా నమ్మారు. మాతృభాష బెంగాల్‌తో పాటు, పర్షియన్, అరబిక్, సంస్కృతం, లాటిన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలను నేర్చారు. సతీసహగమనాన్ని వ్యతిరేకించడంతో రాయ్ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైనాడు. టిబెట్ వెళ్లి బౌద్ధాన్ని ఆచరించదలిచాడు. కానీ అక్కడ కూడా లామా ను ఆరాధించడం నచ్చలేదు. బెంగాల్ సివిల్ సర్వీస్‌లో దివాన్‌గా 1815లో పదవీ విరమణ చేసిన రాయ్ సతీ సహగమనం నిషేధం, పత్రికా స్వేచ్ఛలే లక్ష్యంగా కృషి చేశారు. ఇందుకోసమే జర్నలిస్ట్ అయ్యారు. మొదట ‘సంబాద్ కౌముది (1821) అనే వార పత్రికను స్థాపించారు. దేశంలో సామాజిక, రాజకీయ అంశాలపై నిర్దిష్ట ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించిన తొలి పత్రిక ఇదే. దీనితో మతపరమైన చర్చలకు శ్రీకారం చుట్టారాయన. క్రైస్తవ మిషనరీలు నిర్వహించే ‘సమాచార దర్పణ్’ హిందూ మతాన్ని విమర్శించేది. వీటిని ఖండించడంలో సంబాద్ కౌముది కీలకంగా ఉండేది. తరువాత సతీ సహగమనం దురాచారం, మత సంస్కరణల ప్రచారానికి రాయ్ ‘మిరాతుల్ అక్బర్’ (పర్షియన్) వారపత్రికను ఆరంభించారు. ఇది సంప్రదాయ హిందూ సమాజాన్ని కలవర పెట్టింది. భారతీయ సమాజాన్ని సంస్కరించేందుకు ఉద్దేశించిన రాతలే అయినా, అవి తమ ఉనికికి భంగం వాటిల్ల చేసేవిగా ఉన్నాయని ఈస్టిండియా కంపెనీ భావించింది. ఫలితమే 1823 నాటి ప్రెస్ లైసెన్సింగ్ చట్టం. దీని ప్రకారం పత్రిక ఏదైనా ప్రచురణకు గవర్నర్ జనరల్ అనుమతి అనివార్యం. అలాగే ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకునే అధికారం కూడా ఉండేది. అంటే సెన్సార్ షిప్. ఇందుకు నిరసనగా రాయ్ ‘మిరాతుల్ అక్బర్’ ప్రచురణను నిలిపివేశారు. ప్రెస్ రెగ్యులేషన్ చట్టం మీద సుప్రీం కోర్టుకు కూడా విన్నవించారాయన. కానీ ఆ కోర్టు ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది. రాయ్ లండన్‌లోని కింగ్ ఇన్ కౌన్సిల్‌కు విన్నవించారు. హిందూ వేదాంతం మీద దాడి చేయడమే కాకుండా, దానిని ఖండిస్తూ రాయ్ ఇచ్చిన వివరణలను ప్రచురించడానికి సమాచార దర్పణ్ నిరాకరించేది. దీనితో రాయ్ ‘బ్రాహ్మనికల్ మ్యాగజైన్’ను ఇంగ్లిష్, బెంగాలీ భాషలలో ఆరంభించారు. సతీసహగమనం వంటి దురాచారాన్ని చూసి కదలి పోయిన రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వదినగారి సహగమనాన్ని చూసి ఆయన చలించి పోయారు. ఒక్క 1818లోనే 544 మంది సజీవ దహనం చేశారు. ఈ అంశం మీద ఆయన పోరాటం విజయవంతమైంది. మొగల్ పాదుషా రెండవ అక్బర్ భరణం గురించి విన్నవించడానికి ఇంగ్లండ్ వెళ్లిన రాయ్ అక్కడే మరణిం చారు. భరతమాత గర్వించే ముద్దుబిడ్డ రాయ్. డాక్టర్ సీవీ నరసింహారెడ్డి మొబైల్ : 92465 48901 -
ది కామన్ వీల్ పత్రికా స్థాపకులెవరు?
మత సంస్కరణోద్యమాలు -వాటి ప్రభావం రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’ సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది అయింది. దీని ప్రధాన ఉద్దేశాలు ‘ఏకేశ్వరోపాసన’ ద్వారా నిర్గుణభక్తిని పెంపొందించడం, స్త్రీ సమస్యలపై ఉద్యమించడం, ఆధునిక విద్యా విధానం కోసం పోరాడటం. రామ్మోహన్రాయ్ సామాజిక, ఆర్థిక సమస్యలపై తువ్వత్ఉల్, మువాయుద్దీన్ పత్రిక, మహానిర్వాణ్ తాంత్రిక మండలి సంస్థల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. రాజా రామ్మోహన్రాయ్ ఆధ్వర్యంలోని బ్రహ్మసమాజం సతీసహగమన నిషేధం (1829), ఆంగ్ల భాషను ప్రవేశ పెట్టడంలో (1835) కీలక పాత్ర పోషించింది. కానీ ఈయన అనంతరం నేతృత్వం వహించిన దేవేంద్రనాథ్ ఠాగూర్‌కు వ్యతిరేకంగా ‘కేశబ్ చంద్రసేన్’, అతడి అనుచరులు ఆనంద మోహన్ బోస్, ఎస్.ఎస్. చిప్లూంకర్ తిరుగుబాటు చేయడంతో బ్రహ్మసమాజం మొదటిసారిగా విభజనకు గురైంది. బ్రహ్మసమాజానికి, బ్రాహ్మణ మతానికి మధ్య ఉన్న తేడాలను నిరూపించడంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ విఫలమైనందువల్ల కేశబ్ చంద్రసేన్ అతని అనుచరులు బ్రహ్మసమాజం నుంచి విడిపోయి 1866లో ‘అఖిల భారత బ్రహ్మ సమాజం’ స్థాపించారు. కేశబ్ చంద్రసేన్ అభ్యుదయ భావాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలకు పూనుకోవడం, బ్రహ్మసమాజంలో భజనలు, కీర్తనలు ప్రవేశ పెట్టడం, తనను ఒక ప్రవక్తగా ప్రకటించుకోవడం లాంటివి సహించలేని ఆనందమోహన్ బోస్, చిప్లూంకర్ 1878 లో బ్రహ్మ సమాజం నుంచి విడిపోయి సద్ధర్మ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈవిధంగా విభజనలు చోటు చేసుకోవడం, బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా తన ప్రత్యేకతను బ్రహ్మసమాజం నిలుపులేకపోవడం, సమాజం ఆలోచనలు కేవలం విద్యాధికులకే, పట్టణాలకే పరిమితం అవ్వడం, బ్రహ్మ సమాజం వైఫల్యానికి దారితీసిన కారణాలుగా చెప్పవచ్చు. ఆర్య సమాజం ఆర్య సమాజాన్ని 1875లో స్వామి దయానంద స్థాపించారు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక భిన్న దృక్పథాన్ని అలవర్చుకుంది. బ్రహ్మసమాజాన్ని అభ్యుదయ భావాలతో ప్రారంభించారు. వేదాల సారమైన నిర్గుణోపాసన బోధించిన ఉపనిషత్తులు బ్రహ్మ సమాజానికి ఆధారం కాగా, ఆర్య సమాజం వేదాలనే ప్రమాణంగా భావించింది. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఆర్య సమాజం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. నిమ్న జాతుల్లో విద్యావ్యాప్తికి పాటు పడింది. సమాజంలోని దురాచారాలకు పురోహిత వర్గం సంకుచిత వైఖరే కారణమని భావించింది. సంఘసేవ కోసం విద్యాలయాలు, వైద్యశాలలను విస్తృతంగా స్థాపించింది. ఆర్య సమాజం సామాజిక కార్యక్రమాల్లో అత్యంత వివాదాస్పదమైన రెండు అంశాలు న్నాయి. అవి: 1. శుద్ధి ఉద్యమం 2. గో సంరక్షణ ఉద్యమం శుద్ధి ఉద్యమంలో భాగంగా హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారినవారిని తిరిగి హిందూమతంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇందువల్ల 19వ శతాబ్దం చివరి భాగంలో పలుచోట్ల ముఖ్యంగా బాంబే, మీరట్, కాన్పూర్, లక్నో లాంటి పట్టణాల్లో హిందువులకు, క్రైస్తవులకు మధ్య మత కలహాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా గో సంరక్షణ ఉద్యమం కూడా హిందు, ముస్లింల మధ్య మత కలహాలకు కారణమైంది. వేద సంస్కృతి ప్రాతిపదికన ప్రారంభమైన ఆర్య సమాజ ఉద్యమం క్రమంగా బలపడి, జాతీయ ఉద్యమాన్ని కూడా ఆకర్షించింది. జాతీయ ఉద్యమాన్ని ఆద్యంతం ప్రభావితం చేసిన నినాదం ‘స్వరాజ్’ను ఆర్య సమాజమే ప్రవేశపెట్టింది. స్వామీ దయానంద మరణానంతరం విద్యా మాధ్యమంపై ఆర్య సమాజంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. స్వామి శ్రద్ధానంద ఆధ్వర్యంలోని గురుకుల వర్గంగా పిలిచే వర్గం సంస్కృత విద్యను మాధ్యమ భాషగా ఉండాలని భావించగా, లాలా లజపతిరాయ్, లాలా హన్సరాజ్ కళాశాల వర్గం ఆంగ్ల భాష మాధ్యమంగా ఉండాలని పట్టుబట్టింది. స్వామీ శ్రద్ధానంద నేతృత్వంలో గురుకుల వర్గం హరిద్వార్ వద్ద సంస్కృత విద్యాపీఠం నెలకొల్పింది. లాలా లజపతిరాయ్, హన్సరాజ్ వర్గం లాహోర్‌లో ఓరియంటల్ కాలేజ్‌ను స్థాపించింది. దివ్యజ్ఞాన సమాజం 1875లో రష్యన్ మహిళ అయిన మేడమ్ హెచ్.పి. బ్లావట్క్సీ, కల్నల్ ఒ.హెచ్. అల్నాట్ నేతృత్వంలో దివ్యజ్ఞాన సమాజం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైంది. తర్వాత దీని కేంద్ర కార్యాలయాన్ని చెన్నైలోని అడయార్‌కు మార్చారు. అనిబీసెంట్ 1916లో హోమ్‌రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. హోమ్‌రూల్ భావాలను ప్రచారం చేయడానికి అనిబీసెంట్ ది కామన్ వీల్, న్యూ ఇండియా అనే పత్రికలు స్థాపించారు. ఉద్యమంలో భాగంగా అనిబీసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాలను, వారణాసిలో సంస్కృత విద్యాపీఠాన్ని స్థాపించారు. రామకృష్ణ మఠం 19వ శతాబ్దం నాటి సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక విశిష్టమైన సంస్థగా రామకృష్ణమఠం ఆవిర్భవించింది. రామకృష్ణ పరమహంస మతాలకు అతీతమైన విశ్వజనీన భావాలకు ప్రాధాన్యమిచ్చారు. పరమహంస భావాలను ప్రచారం చేయడం కోసం 1887లో స్వామి వివేకానంద బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. మఠానికి అనుబంధంగా సామాజిక సేవా సంస్థగా 1897లో రామకృష్ణ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. మతాలకతీతమైన విశ్వజనీన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ, సామాజిక సేవను అందించడంలోనూ ఇప్పటికీ రామకృష్ణమఠం తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది. బ్రహ్మసమాజంలో భాగంగా ఆత్మారాం పాండురంగ స్థాపించిన ప్రార్థనా సమాజం బాంబే ప్రెసిడెన్సీలో సంస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. స్త్రీ జనోద్ధరణ, వితంతు పునర్ వివాహాలు, నిమ్న కులాల్లో విద్యావ్యాప్తి లాంటి ఉత్తమ ఆశయాలకు ప్రార్థనా సమాజం ప్రేరణ అయింది. శివదయాల్ (తులసీరామ్) ఆగ్రాలో 1861లో ‘రాధాస్వామి సత్సంగ్’ను స్థాపించారు. 1887 లో లాహోర్‌లో శివనారాయణ అగ్నిహోత్రి ‘దేవసమాజాన్ని’, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1864 లో సైంటిఫిక్ సొసైటీ, 1863లో గాజీపూర్‌లో విక్టోరియా స్కూల్‌ను, థియోడార్బిక్ ప్రిన్సిపాల్‌గా మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ప్రారంభించారు. పార్సీల్లో దాదాబాయి నౌరోజీ వయోజన విద్య కోసం ‘జ్ఞాన ప్రసారక మండలి’ సంస్థను ప్రారంభించారు. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో సరికానిది ఏది? 1) దాదాబాయి నౌరోజీ: ‘ది పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ 2) దయానంద సరస్వతి: సత్యార్థ ప్రకాశిక 3) బంకించంద్ర చటర్జీ: దేవికారాణి 4) స్వామి వివేకానంద: లైఫ్ డివైన్ సమాధానం: 4 వివరణ: స్వామి వివేకా జ్ఞానమార్గ, కర్మమార్గ, రాజమార్గ గ్రంథాలనే కాకుండా, ఉద్బోధన (బెంగాల్), ప్రబుద్ధ భారత్ (ఆంగ్లంలో) పత్రికలు ప్రారంభించారు. ‘డివైన్ లైఫ్’ను స్వామి వివేకానంద, లైఫ్ డివైన్’ను అరబిందో ఘోష్ రచించారు. 2. 1863లో మహ్మదరన్ లిటరరీ సొసైటీని స్థాపించింది ఎవరు? 1) నవాబ్ అబ్దుల్ లతీఫ్ 2) సయ్యద్ అమీన్ అలీ 3) షరియతుల్లా 4) ముక్తార్ అహ్మద్ అన్సారీ సమాధానం: 1 వివరణ: కలకత్తాలో అబ్దుల్ లతీఫ్ ఈ సంస్థను ప్రారంభించారు. ముస్లింలలో ఆధునిక భావాలు, విద్యా విషయాల్లో నూతన ఆలోచనల కోసం ఈ సంస్థను ప్రారంభించారు. 3. పుణేలో ‘పరమహంస సభ’ను స్థాపించిందెవరు? 1) బాలశాస్త్రి 2) మహాదేవ గోవిందరనకడే 3) గణేష్ వాసుదేవ్ జోషి 4) దారోగా పాండురంగ సమాధానం: 4 వివరణ: పాండురంగ 1840లో పరమహంస మండలి సంస్థను పుణేలో ప్రారంభించారు. ధర్మ వివేచన అనే రచన చేసి, 1849లో ఉద్యమం ప్రారంభించారు. 4. రాజా రామ్మోహన్రాయ్ వేటి కోసం పోరాడారు? ఎ) సతీసహగమన నిషేధం బి) ఆధునిక విద్య సి) వితంతు పునర్వివాహం డి) స్త్రీ విద్య 1) ఎ, బి మాత్రమే 2) ఎ,బి,సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) అన్నీ సమాధానం: 1 5. ‘దేవి చౌదరిరాణి’ గ్రంథ రచయిత ఎవరు? 1) అరబిందో గోష్ 2) బంకించంద్ర చటర్జీ 3) శివనారాయణ అగ్నిహోత్రి 4) శివదయాల్ సమాధానం: 2 6. ‘మేఘనాథ్ బంద్ కావ్యం’ రచించింది? 1) మధుసూదన్ దత్ 2) దీనబందు మిత్ర 3) బంకించంద్ర 4) రవీంద్రనాథ్ ఠాగూర్ సమాధానం: 1 7. ఇండియన్ బ్రహ్మసమాజ్‌ను కేశబ్ చంద్రసేన్, సాధారణ బ్రహ్మ సమాజ్ ఆనంద్ మోహన్ బోస్, ఆది బ్రహ్మసమాజ్ దేవేంద్రనాథ్ స్థాపించారు. అయితే ‘దక్షిణ భారత బ్రహ్మ సమాజ్’ను స్థాపించిందెవరు? 1) చిప్లూంకర్ 2) శ్రీధర్‌లు నాయుడు 3) వీరేశలింగం పంతులు 4) జ్యోతిబా పూలే సమాధానం: 2 వివరణ: చిప్లూంకర్, ఆనంద్ మోహన్ బోస్ సాధారణ బ్రహ్మసమాజం, శ్రీధర్‌లు నాయుడు దక్షిణ భారత బ్రహ్మసమాజం లేదా ‘వేదసమాజం’ను స్థాపించారు. వీరేశలింగం పంతులు 1905లో హితకారిణి సమాజాన్ని, జ్యోతిబా పూలే ‘సత్యశోధక్’ సమాజాన్ని స్థాపించారు.