బాగ్‌పత్: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. కొద్దిసేపటిలో జరిగే వివాహానికి సిద్ధమవుతున్న వరుడు సుబోధ్ కుమార్ (25) అకాల మృత్యువు బారిన పడ్డాడు. అప్పటివరకూ ఆనందోత్సాహాలతో కళకళలాడిన పెళ్లి వేదికపై విషాదం తాండవించింది. పిచోక్రా గ్రామానికి చెందిన సుబోధ్ కుమార్ బంధువులతో సహా ఆదివారం రాత్రి సరూర్‌పూర్ కలాన్ గ్రామానికి వాహనంలో బయలుదేరాడు.
కొద్దిసేపటికి సుబోధ్‌కు అస్వస్థతగా అనిపించి, వాంతి చేసుకునేందుకు వాహనం నుంచి దిగి రోడ్డు పక్కకు వెళ్లాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబోధ్ రోడ్డు పక్కన వాంతులు చేసుకుంటున్న సమయంలో ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అతన్ని ఢీకొని కొన్ని మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సుబోధ్‌ను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సుబోధ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వరుడిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బినౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ట్రక్ డ్రైవర్‌ను గుర్తించేందుకు అధికారులు హైవేతో పాటు సమీప ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: 25న అయోధ్యలో మరో ఉత్సవం.. ప్రధాని మోదీ హాజరు


