గౌహతి: బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అసోం అసెంబ్లీ గురువారం ఒక బిల్లును ఆమోదించింది. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందుకు కొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, రాష్ట్రంలో ఆరో షెడ్యూల్ అమల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇది వర్తించదని తెలిపింది.
అసోం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్లు–2025ను గురువారం హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రవేశపెట్టారు. ఇందులో మతంతో సంబంధం లేదని, ఇస్లాంకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలతోపాటు ఇతర అన్ని వర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ బిల్లున ఉమ్మడి పౌర స్మృతి దిశగా పడిన ముందడుగుగా అభివర్ణించారు.


