గౌహతి: అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం.. ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే దోషులకు ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, ఆరో షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు.
బహుభార్యత్వం కారణంగా బాధితులుగా మారిన మహిళలకు పరిహారం ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘ద అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామీ బిల్లు–2025’కు కేబినెట్ ఆదివారం ఆమోదం తెలిపినట్లు స్పష్టంచేశారు. ఈ నెల 25వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు.
స్థానికులకు ఆయుధ లైసెన్స్‌లు
అస్సాంలో మారుమూల కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలకు ఆయుధ లైసెన్స్‌లు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మొదటి బ్యాచ్ లెసెన్స్‌ల జారీ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. అస్సాంలో వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఆయుధ లైసెన్స్‌ల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని, అధికారులు వాటిని క్షుణ్నంగా పరిశీస్తున్నారని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలియజేశారు.
ఆయన ఆదివారం కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. స్థానికులకు మాత్రమే లైసెన్స్‌లు లభిస్తాయని తేల్చిచెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లైసెన్స్ లభించే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని వెల్లడించారు. అస్సాంలోని మొత్తంగా 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. అస్సాంలో చొరబాటుదారుల నుంచి స్థానికులకు ముప్పు ఎదురవుతున్నట్లు చాలా సంవత్సరాలుగా వాదనలు వినిపిస్తున్నాయి.


