బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ మధ్య నెలకొన్న వివాదం కీలక దశకు చేరింది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్‌కు పరోక్ష హెచ్చరికలా మారాయి. ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై శివకుమార్ వర్గం తన అభిప్రాయం వెల్లడించింది. సీఎం పదవిని మార్చేందుకు గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారని శివకుమార్ వర్గం చెబుతోంది. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు జరగనుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. శివకుమార్ శిబిరం నాయకత్వ మార్పు కోసం గట్టిగా పట్టుబడుతోంది. 2023 ఎన్నికల విజయం తరువాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే నాడు హైకమాండ్ రొటేషన్ సీఎం పోస్టుకు అంగీకరించిందని శివకుమార్ మద్దతుదారులు చెబుతున్నారు.
అయితే సిద్ధరామయ్య బృందం ఈ వాదనను తోసిపుచ్చింది. మరోవైపు గత రెండు వారాలుగా శివకుమార్ మద్దతుదారులోని పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనలు చేయడం ఈ అధికార మార్పు చర్చలను మరింత పెంచింది. ఈ వివాదంపై వస్తున్న నివేదికల ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని యోచిస్తోంది. డిసెంబర్ ఒకటి లోపు కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ తాను, రాహుల్, సోనియా కలిసి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ సమస్యపై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని అంగీకరించారు. ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్... ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన అన్నారు. మరోవైపు డీకే శివకుమార్.. ‘పార్టీకి ఇబ్బంది కలిగించడం లేదా బలహీనపరచడం తనకు ఇష్టం లేదని అన్నారు. అయితే డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల దరిమిలా డిసెంబర్ ఒకటి గడువులోగా అధికార మార్పు జరగవచ్చనే ఊహాగానాలు కర్ణాటక రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: అమెరికా: వీడని తుపాకీ హింస..


