ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏదైనా మంత్ర దండం ఉందా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థలకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఎదుట అమికస్ క్యూరీగా ఉన్న అపరాజిత ప్రస్తావించారు.
ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని నివేదించారు. ఇది హెల్త్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి అని పేర్కొన్నారు. స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్..‘ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ప్రమాదకర పరిస్థితులున్న విషయం మాకూ తెలుసు. సమస్య పరిష్కారానికి న్యాయ వ్యవస్థ ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తుందని అనుకోవద్దు. స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడానికి ఎలాంటి మార్గనిర్దేశాలు చేయగలమో చెప్పండి? వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణకు గతంలో ఎన్నో కమిటీలు ఏర్పాటు చేశారు.
కానీ, నిర్ణయాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. కఠినమైన రోజువారీ పర్యవేక్షణతోనే ఈ పరిస్థితి మెరుగుపడుతుంది’అని వ్యాఖ్యానించారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆంక్షలు అమలు చేయాలన్న వాదనను తోసిపుచ్చింది. దీర్ఘకాల పరిష్కారం అవసరమంది.‘ప్రభుత్వం వేసిన కమిటీలు చేసిన సిఫార్సులు ఏమిటి? తక్షణ చర్యలు చూపే చర్యలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫైళ్లలో మగ్గుతున్న ఆదేశాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాం’అని ధర్మాసనం అభిప్రాయపడింది.


