శాంతిని కోరుకునే దేశం భారత్
మన సైనిక దళాల పనితీరు అద్భుతం
‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’లో రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక, నిరోధక చర్యల్లో ఆపరేషన్ సిందూర్ ఒక నిర్ణయాత్మక ఘట్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభివరి్ణంచారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు. శాంతిని సాధించడంలో భారత్ అత్యంత దృఢంగా, అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నట్లు తెలిపారు.
గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. మనదేశం ఆనాదిగా ‘వసుధైవ కుటుంబం’అనే సూత్రానికి కట్టుబడి ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రపంచ దేశాలతో శాంతియుత సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ కేవలం శాంతిని కోరుకుంటున్నట్లు మన దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, మన సైనిక దళాలు ఉమ్మడిగా నిరూపిస్తున్నట్లు స్పష్టంచేశారు.
మరోవైపు దేశ సరిహద్దులను, ప్రజలను కాపాడుకోవడంలో ఎంతమాత్రం రాజీపడడం లేదని పేర్కొన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించడంలో మన సైనిక దళాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. జవాన్ల పనితీరు, దేశభక్తిని కొనియాడారు. దేశ అభివృద్ధికి సైన్యం కీలకమైన ఆధారంగా నిలుస్తోందని వివరించారు.
సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో సైన్యం చురుగ్గా పనిచేస్తోందని గుర్తుచేశారు. నేడు ప్రపంచమంతటా శాంతికి, ఘర్షణకు మధ్య విభజన రేఖ చెదిరిపోతోందని పేర్కొన్నారు. అందుకే సైనిక దళాలపై బాధ్యత మరింత పెరుగుతోందని వెల్లడించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలని సైన్యానికి రాష్ట్రపతి పిలుపునిచ్చారు.


