చెన్నై: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్.. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కజగం(టీవీకే) పార్టీలో చేశారు. బుధవారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, గురువారం టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతో ఓ మాజీ ఎంపీతోపాటు, అతని మద్దతు దారులు కూడా చేరారు. పసుపు–ఎరుపు మిశ్రమంతో రంగులతో ఉన్న టీవీకే శాలువాను విజయ్ ఆయనకు కప్పారు.
సెంగొట్టయన్‌కు పార్టీ ఆర్గనైజింగ్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సెంగొట్టయన్ తాను రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలనను తీసుకురావడానికే టీవీకేలో చేరానని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఎలాంటి తేడా లేదని, ప్రజలు పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. మంచి పాలన అందించే నాయకుడిని కోరుకుంటున్నారని, అందుకు విజయ్ సరైన వ్యక్తని సెంగొట్టయన్ అన్నారు.
ఆ సమయంలోనూ ఆయన జేబులో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకురాలు జయలలిత ఫొటో ఉంది. ఫొటోపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను అన్నా డీఎంకేకు విధేయుడిగా ఉన్నాను. 50 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. చివరకు నాకు లభించిన బహుమతి పార్టీ నుంచి తొలగించటం.
పార్టీని బలోపేతం చేద్దామన్న నా ఆలోచననను సమరి్థంచిన నా మద్దతుదారులు కూడా బహిష్కరణకు గురయ్యారు’అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అత్యంత సీనియరైన ఆయన చేరికతో టీవీకే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్వస్థలం ఈరోడ్ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి.


