దళపతి విజయ్ 'జన నాయగణ్' చిత్రాన్ని కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. లెక్క ప్రకారం ఈ రోజే (జనవరి 09) థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఈ మేరకు మొన్ననే నిర్మాతలు.. వాయిదా ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఇది తీరేలా కనిపించట్లేదు. తాజాగా అప్‌డేట్ ఏంటంటే?
సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'జన నాయగణ్' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈరోజు మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌పై డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు కోర్టుపై ఒత్తిడి చేశారని డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చిత్ర నిర్మాతలు, సోమవారం(జనవరి 11) నాడు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.


