
నెలకోసారి నాలుగు వేల పింఛన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఖర్చుల సంగతి కాసేపు పక్కనబెడదాం. కానీ, ఈ పర్యటనల సందర్భంగా ఆయన అసత్యాలు, అర్ధ సత్యాలూ మాట్లాడుతుండటం ఆయన పదవికి శోభనిచ్చేది కాదు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సినంత అనుభవం బాబు గారిది. అబద్ధాలకోరు అని ప్రజలు అనుకునేలా ఉండకూడదు. ప్రతిపక్షాల ఆరోపణలు కాకపోయినా ప్రజలందరికీ ఇట్టే అర్థమైపోయే అబద్ధాలు ఆడటం వల్లనే వస్తోంది చిక్కు.
చంద్రబాబుకు సంక్షేమం మీద అస్సలు నమ్మకం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. అప్పు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించిన వ్యక్తి ఈయన. కానీ.. ఎన్నికలు వస్తే చాలు.. ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఖర్చులతో నిమిత్తం లేకుండా ఎడాపెడా హామీలు గుప్పించేస్తారు. 2024లోనూ ఇలాగే చేసి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అరకొర అమలుతో మమా.. అనిపించేశారు. గోరుముద్దలు పెట్టేటప్పుడు ఇదే పప్పు అనుకో! ఇదే కూర అనుకో, ఇదే పచ్చడి అనుకో, ఇదే పెరుగు అనుకో.. అని పిల్లలకు చెబుతారు చూడండి.. సరిగ్గా అలాగే చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారు.
పర్యటనల సందర్భంగా ‘పేదల సేవలో ప్రజా వేదిక’ అనే పేరు స్టేజికి పెట్టి చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, తీసుకునే చర్యలేవీ పేదలకు అనుకూలంగా ఉండవు. పేదల పేరు చెప్పి ధనికులు, పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాస్తవం దీనికి చాలా భిన్నం. ఒక ఫించన్ల మొత్తంలో పెంపు మినహా కూటమి సర్కారు తొలి ఏడాది ఎన్నికల హామీలు నెరవేర్చింది ఏమీ లేదు. అయినా సరే.. ఫించన్ల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అంటారు బాబుగారు.
వాస్తవానికి ఈ క్రెడిట్ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దక్కాలి. ఎందుకంటే సుమారు 45 లక్షలుగా ఉన్న ఫించన్లను 64 లక్షలకు తీసుకువెళ్లారు. అదే సమయంలో 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాలుగున్నర లక్షల ఫించన‍్లు తొలగించారు. ఇదిలా ఉంటే.. ఫించన్ల సొమ్మును ఇంటి పన్నులకు జమ చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటిది జగన్ టైమ్‌లో జరిగి ఉంటే చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఉండేవారు. విజయనగరం జిల్లాను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని చంద్రబాబు చెప్పడం స్వాగతించదగిందే. కాకపోతే ఇప్పటికే ఆయన సుమారు 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సంగతి మర్చిపోతుంటారు.
చంద్రబాబు ఈ మధ్య చెబుతున్న పలు అసత్యాల్లో పెట్టుబడుల అంశం ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో గత 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. నిజమైతే ఇదో అద్భుతమైన రికార్డు. కేంద్రమే ప్రకటించి ఉండేది. అదేమీ జరగలేదు. ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు నిరుద్యోగ భృతిని ఎగవేయడం కోసం ఇలా అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. వలంటీర్లు 2.5 లక్షల మందితోపాటు ఏడాది కాలంలో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటుంది. అలాగే 2014-19 మధ్య మాదిరిగానే ఇప్పుడు కూడా పెట్టుబడులపై అసత్యాలు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చేశాయని ఆయన చెప్పారని ఎల్లో మీడియానే రాసింది. ఇందులో వాస్తవం ఎంతన్నది ఆయనకు, ఎల్లో మీడియాకు తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటూ సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
విశాఖలో జరగబోయే సదస్సుకు రావాలని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌లు ఢిల్లీ వెళ్లి పారిశ్రామిక వేత్తలను కోరారు. ఇది తప్పు కాదు. కానీ, ఇంతకాలం చంద్రబాబు బ్రాండ్‌ను చూసి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారని ప్రచారం చేశారు. ఆ బ్రాండ్ ఏమైందో తెలియదు కానీ.. వీరే వెళ్లి సదస్సుకు రావాలని పరిశ్రమల వారిని అభ్యర్ధించవలసి వస్తోంది. ఇదే పనిమీద వీరు దుబాయికి కూడా వెళుతున్నారట. సదస్సు తర్వాత మరో పదో, పదిహేను లక్షల కోట్లో లేదా అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు చెబుతారు. ఆ తర్వాత అవి వచ్చేశాయని అంటారు.
వైఎస్సార్‌సీపీ విద్యుత్తు ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచిందని తాము ఆ పని చేయలేదని ఆయన చెబుతున్నారు. ఛార్జీల మోత తట్టుకోలేక ప్రజలు హాహాకారాలు చేస్తూంటే చంద్రబాబు అసలు పెరగలేదని ధైర్యంగా చెబుతున్నారు. దీని గురించి ఆయన జనాన్ని ప్రశ్నించి ఉంటే తెలిసేది. పైగా అనుమతించిన దానికన్నా ఎక్కువ వసూలు చేసినందుకు విద్యుత్ నియంత్రణ మండలి చివాట్లు పెట్టి డబ్బు వెనక్కు ఇవ్వాలని ఆదేశించిన విషయాన్నీ కప్పిపుచ్చుతున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలోనూ ఇలాంటి అబద్ధాలను ఎవరైనా నమ్ముతారా? అన్నది కూడా ఆలోచించడం లేదు. 2024లో ఏపీకి స్వాతంత్రం వచ్చిందని అంతటి సీనియర్ నేత చెప్పడం దారుణంగా ఉంటుంది. నిజంగానే వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు కాని, ఆయన పార్టనర్ పవన్ కళ్యాణ్ తదితరులు అన్ని అసత్యాలు ప్రచారం చేయగలిగేవారా?.
ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను కట్టడి చేయడానికి, హామీల గురించి ప్రశ్నించకుండా ఉండడానికి నిర్భంధకాండను అమలు చేస్తున్న సర్కార్, లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అధినేతగా చంద్రబాబు స్వాతంత్రం గురించి మాట్లాడడం అర్థరహితం అనిపిస్తుంది. ఇప్పుడు నియంతృత్వంగా ఉందా? గతంలో ఉందా అని ఆయన ఒక సర్వే చేయించుకుంటే మంచిది. పైగా సోషల్ మీడియాను అణచివేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్నే నియమించిన ఆయన స్వేచ్చ గురించి కథలు చెబుతున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తానని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మంచిదే.. నిజంగా అందులో నిజం ఉంటే ఆయన ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు ఎందరిపై మహిళల వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎందరి తోలు తీశారో చెబితే బాగుండేది కదా!.
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేని ఏం చేశారు?. ఒక విద్యాలయ ప్రిన్సిపాల్‌ను వేధించిన మరో ఎమ్మెల్యేని ఏం చేశారు?. చిత్తూరులో ఒక యువతిని హింసించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల తోలు తీశారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కబుర్లు చెప్పడం వేరు. కార్యాచరణ వేరు. లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పని చేయించాలన్నది తమ ఆలోచన అని, అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతానని ఆయన చెబుతున్నారు. ఎల్లో మీడియాలోనే వసూల్ రాజాలుగా మారిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ వచ్చిన వార్తల సంగతేమిటి?. తొలుత వారిని కట్టడి చేసిన తర్వాత ఇలాంటి కబుర్లు చెప్పాలి.
ప్రజలకు ఎలాంటి లంచాలతో పని లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలను ధ్వంసం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడేదో ఆకస్మిక తనిఖీల ద్వారా ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు!. దీపావళికి మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ఆయన అంటున్నారు. అవి ఎవరి హయాంలో నిర్మితమైంది అందరికీ తెలుసు. కాకపోతే వాటిని తామే నిర్మించామని చెప్పకుండా, గత ప్రభుత్వం ఏం చేసింది.. తమ సర్కార్ ఏం చేసింది వివరిస్తే గౌరవంగా ఉంటుంది. అలాకాకుండా జగన్ ప్రభుత్వం క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నంత మాత్రాన జనానికి వాస్తవాలు తెలియకుండా పోవు కదా!. చంద్రబాబు నుంచి సత్యం ఆశించడం అత్యాశేనా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.