శ్రీకాకుళం: నకిలీ మద్యం వ్యాపారాలపై ప్రజా ప్రయోజనాల కోసం నిరసన ర్యాలీ నిర్వహించినందుకు తనపై కేసు నమోదు చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ప్రజల కోసం మేము ర్యాలీ చేశాం. కానీ ఆ ర్యాలీని పోలీసు విధులకు ఆటంకం కలిగించామంటూ మాపై కేసు పెట్టడం విచారకరం అని అప్పలరాజు అన్నారు.
గత 16 నెలల్లో తనపై 10 కేసులు నమోదు చేశారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న చర్య. విద్యుత్ చార్జీలు పెంచారని ప్రజల తరపున నేను నిరసన చేపట్టాను. దానిపైనా మరో కేసు పెట్టారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను వైద్య వృత్తి నుంచి వచ్చి నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నానని, కానీ కూటమి ప్రభుత్వం తనలాంటి వారిపై తప్పుడు కేసులు మోపుతోందని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కేసులు పెట్టలేదు. ప్రజల సమస్యలపై మేము గళం విప్పితే దాన్ని అణచివేయాలనే ప్రయత్నం జరుగుతోంది అని అప్పలరాజు తీవ్రంగా విమర్శించారు.
ప్రజా సమస్యలపై పోరాడినందుకు శిక్షించాలన్న తీరుతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన పేర్కొన్నారు. “ప్రజల కోసం మాట్లాడడమే నేరమా?” అని అప్పలరాజు ప్రశ్నించారు.


