న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను కేటాయిస్తూ తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ చట్టం–2023 అమలుపై స్పందన తెలియజేయాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీస్ జారీ చేసింది. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో సంబంధం లేకుండా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా మహిళలకు పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభల్లో తగు ప్రాతినిధ్యం లేదని పిటిషనర్ జయా ఠాకూర్ పేర్కొన్నారు.
చదవండి: జడ్జీలపై ఆరోపణలు చేయడం ట్రెండ్‌గా మారింది సుప్రీంకోర్టు ఆందోళన
ప్రస్తుత జనాభా గణాంకాల ఆధారంగా 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. తాజాగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాక అమలు చేస్తామనడం సరికాదన్నారు. పార్లమెంట్ ఈ మేరకు అవసరమైన చట్ట సవరణ చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం మన దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గం మహిళలేనని వ్యాఖ్యానించింది. జనాభాలో 48 శాతం వరకు ఉన్న మహిళలకు రాజకీయ సమానత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంది. ‘చట్టాన్ని అమలు చేసే అధికారం కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే ఉంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వానికి మాండమస్ రూపంలో ఆదేశాలను జారీ చేయలేం’అని స్పష్టం చేసింది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరుతామని తెలిపింది.
ఇదీ చదవండి : 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం


