కరెంట్..! విద్యుదయస్కాంత తరంగాలను.. అదే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కట్ చేస్తే కరెంటు ఉత్పత్తి అవుతుందని మనం చదువుకున్నాం. జలవిద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, సౌరవిద్యుత్తు గురించి మనకు తెలుసు. జల విద్యుదుత్పత్తికి నదులపై ఆనకట్టలు అవసరం. కానీ.. ఇవేమీ లేకుండానే కేరళ సర్కారు పిల్ల కాల్వలతో కూడా స్థానిక జనాభాకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లకాల్వలతో విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. చదివేయండి..
కేరళ రాష్ట్రం.. భారత్‌లోనే సామ్యవాద భావజాలాలను మెండుగా కలిగి ఉన్న ప్రాంతం. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం..! పేదరికానికి చరమగీతం పాడి.. ఐక్య రాజ్య సమితి మన్ననలు పొందిన రాష్ట్రం..! మహిళలకు నెలసరి సెలవులు.. సమానత్వ భావజాలంతో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రం..! సంక్షేమంలోనూ.. ముఖ్యంగా ప్రజలకు విద్య, వైద్యం అందడంలో కేరళను మించాలంటే.. ఇతర రాష్ట్రాలకు దాదాపుగా అసాధ్యమే..! అలాంటి కేరళ రాష్ట్రం విద్యుదుత్పత్తిలోనూ వినూత్నంగా ముందుకు వెళ్లింది. పిల్లకాల్వలపైనా జలవిద్యుత్తు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.
కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కన్నిమారి వంతెన సమీపంలో ఉన్న ఓ చిన్న కాల్వపై ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ చిన్న ప్రాజెక్టుతో స్థానికులకు నీటిసరఫరాతో పాటు.. విద్యుత్తు అందుతోంది. పౌరులకు నీరు-వెలుగులను అందించే ఈ పైలట్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విద్యుదుత్పత్తికి ఉవ్వెత్తున ప్రవహించే భారీ జలపాతాల మాదిరి నీరు అవసరం లేదని ఈ ప్రాజెక్టు నిరూపించింది. పాలక్కాడ్ జిల్లా సరిహద్దు గ్రామం వండితవళం సమీపంలోని పట్టంచేరి పంచాయతీ ఈ ఘనతకు కేంద్ర బిందువైంది.
ఒక కాల్వ ద్వారా 100 కుటుంబాలకు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేఎస్ఈబీ ఏడాది క్రితం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే.. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైనా.. కేంద్రం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం పచ్చజెండా ఊపితే.. కేరళ వ్యాప్తంగా ఈ తరహా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లోనూ కరెంటు కొరత అనేది లేకుండా చేయడమే కేరళ సర్కారు ప్రధానోద్దేశం. నిజానికి కేరళలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల.. సౌరవిద్యుత్తు సాధ్యం కాదు. దీంతో.. పిల్లకాల్వల ద్వారా విద్యుదుత్పత్తి అక్కడి మారుమూల ప్రాంతాలకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది.
పిల్ల కాల్వలపై విద్యుదుత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? పెద్దపెద్ద హైడల్ పవర్ జనరేషన్ కేంద్రాల వద్ద ఉన్నట్లుగానే.. సూక్ష్మ వ్యవస్థలను పిల్లకాల్వలపై ఏర్పాటు చేశారు. అంటే.. పెద్ద ప్రాజెక్టుల వద్ద జనరేషన్ హౌస్ ఉన్నట్లే.. ఇక్కడ 10 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చిన్న జనరేషన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. దాని నుంచి నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పవర్ జనరేషన్ తర్వాత ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటివి సంప్రదాయ పద్ధతుల్లోనే కేఎస్ఈబీ చేపట్టింది.
3.5 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహం.. అంటే.. సెకనుకు 3,500 లీటర్ల మేర నీటి ప్రవాహం ఉంటే.. రోజుకు సమీపంలోని 100 కుటుంబాలకు సరిపడా జలవిద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కేఎస్ఈబీ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ చర్య వల్ల మారుమూల ప్రాంతాల్లో స్థిరమైన వోల్టేజీతో నాణ్యమైన విద్యుత్తును అందజేయవచ్చంటున్నారు. పిల్లకాల్వల ద్వారా ఏడాదంతా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని వివరిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుకు అయిన వ్యయం కేవలం 23 లక్షల రూపాయలేనని పేర్కొంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు కావడంతో.. నిత్యం ఇంజినీరింగ్ సాంకేతిక బృందం దీనిని పర్యవేక్షిస్తోందని చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు వస్తే.. కేరళలోని మిగతా ప్రాంతాల్లోనూ విద్యుత్తు ఉత్పత్తి వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్


