న్యూఢిల్లీ: తమకు అనుకూలంగా తీర్పులు రాని పక్షంలో లాయర్లు, కక్షిదారులు న్యాయమూర్తులపై అవమానకరమైన, అశ్లీలతతో కూడిన ఆరోపణలు చేయడం నేడు ట్రెండ్‌గా మారిపోయిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిణామాలు న్యాయవ్యవస్థ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వీటిని అడ్డుకోవాలనిప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణకు చెందిన కక్షిదారు పెద్ది రాజు, అతడి తరఫున వాదించిన ఇద్దరు లాయర్లపై ధిక్కార చర్యలను నిలిపివేస్తూ ఈ మేరకు పేర్కొంది. ఈ ముగ్గురూ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పడం, న్యాయస్థానం అంగీకరించడం జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని తెలిపింది. అదేవిధంగా, న్యాయస్థానపు అధికారులుగా ఉన్న లాయర్లు ఈ కోర్టు లేదా ఏ హైకోర్టు న్యాయమూర్తులపై అయినా ఆరోపణలు చేసే పిటిషన్‌దారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై పెద్ద రాజు, అతడి ఇద్దరు లాయర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది.
ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
న్యాయవ్యవస్థలో ఏఐపై మార్గదర్శకాలు: సుప్రీం
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత దుర్వినియోగం అవుతుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు గదిలో విచారణ జరుగుతున్న సమయంలో తనపై ఓ లాయర్ షూ విసిరేసిన ఘటనను తప్పుగా చూపిస్తున్న ఒక మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ అభినవ్ శ్రీవాస్తవ అనే లాయర్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో వాదనలు వింటామన్నారు. వివిధ అంశాలను ఏఐ వ్యవస్థలతో కావాల్సిన విధంగా మల్చుకునే ప్రమాదముందని పిటిషనర్ హెచ్చరించారు. ఏఐ వినియోగంతో అనేక అనూహ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. న్యాయవ్యవస్థ, న్యాయ విధులకు సంబంధించినంత వరకు ఏఐ నిష్పాక్షిక డేటాను కలిగి ఉండాలని, జవాబుదారీతనంతో కూడిన డేటా యాజమాన్యం పారదర్శకంగా ఉండాలని పిటిషన్ పేర్కొంది. లేకుంటే సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించింది. అక్టోబర్ 6వ తేదీన రాకేశ్ కిశోర్ అనే లాయర్ విచారణ జరుగుతున్న సమయంలో సీజేఐ వైపు షూ విసరడం తీవ్ర కలకలం రేపింది.


