కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రాష్ట్రంలో తొలిసారిగా మేయర్ పదవికి కైవసం చేసుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ పదవిని దక్కించుకుని కాషాయ పార్టీ నవ శకం ఆరంభించింది. బీజేపీకి చెందిన వివి రాజేష్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తిరువనంతపురం నగర చరిత్రలో బీజేపీ పార్టీ అభ్యర్థి మేయర్ పదవిని అధిష్టించడం ఇదే మొదటిసారి. శుక్రవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో రాజేష్‌కు 51 ఓట్లు వచ్చాయి. ఎల్‌డీఎఫ్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29, యూడీఎఫ్‌కు చెందిన కేఎస్ సబరినాథన్‌కు 19 ఓట్లు వచ్చాయి. తిరువనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 101 వార్డులు ఉన్నాయి.
తిరువనంతపురం నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని మేయర్ రాజేష్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని, 101 వార్డులన్నింటినీ సమానంగా చూస్తామని చెప్పారు. కాగా, శుక్రవారం ఉదయం జరిగిన మేయర్ ఎన్నికల్లో 99 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర కౌన్సిలర్ పి. రాధాకృష్ణన్ మద్దతు తెలపడంతో బీజేపీకి 51కి ఓట్లు వచ్చాయి. స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఎవరీ రాజేష్?
వృత్తిరీత్యా న్యాయవాది అయిన 50 ఏళ్ల రాజేష్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుండి 515 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆయన కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ(ఎం)కి చెందిన వికె ప్రశాంత్ చేతిలో 21,515 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రశాంత్‌కు 61,111 ఓట్లు, రాజేష్‌కు 39,596 ఓట్లు వచ్చాయి.
చదవండి: మమ్మల్ని జైల్లో పెట్టండి


