ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున విచారణకు విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై దాఖలైన పిల్‌ను వ్యతిరేకించారు. దీనిపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు.
ఎయిర్ ఫ్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి.. 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. న్యాయవాది కపిల్ మదన్ దాఖలు చేసిన ఈ పిటిషనుపై కేంద్రానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరమణ శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా.. జీఎస్టీ రేట్లను సరైన ప్రక్రియ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే నిర్ణయించగలదు. అలాగే, ఈ పిటిషన్‌పై స్పందించడానికి రెండు రోజుల సమయం సరిపోదన్నారు.
Delhi High Court heard the PIL seeking a reduction of GST on air purifiers, but did not pass any interim order. The Centre said the plea is “not a PIL” and that GST rates can only be decided by the GST Council after due process. The Court raised concerns over public health and…
— ANI (@ANI) December 26, 2025
ఈ విషయంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి పది రోజుల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జీఎస్టీ తగ్గింపునకు ఒక ప్రక్రియ ఉందని, ఈ ప్రక్రియను అడ్డుకోలేమని కోర్టుకు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఇది సమాఖ్య పన్ను అని వివరించారు. ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పాలుపంచుకుంటాయని, ఏదైనా విషయంపై ఓటింగ్ జరగాలంటే అది భౌతికంగా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. పార్లమెంటరీ కమిటీ మాకు కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటాము. ఇందులో రాజ్యాంగపరమైన అంశం ముడిపడి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో, తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
చనిపోతున్నా స్పందించరా?
అంతకుముందు.. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గాలి శుద్ధి యంత్రాలపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీఎస్టీ కౌన్సిలు తక్షణం సమావేశమై గాలిశుద్ధి యంత్రాలపై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ‘‘మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనుపై స్పందించేందుకు గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం శుద్ధి యంత్రాలనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా! ఇలాంటి ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద తాత్కాలిక పన్ను మినహాయింపును తక్షణం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని కేంద్రంపై ప్రశ్నలు కురిపించింది. ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? అంటూ ప్రశ్నించింది.


