ఏ దేశ అభివృద్ధి అయినా అక్కడి మానవ వనరుల వికాసం మీదే ఆధారపడి
ఉంటుంది. ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రధానమైనది ‘విద్య’. బ్రిటిష్ కాలంలో కేవలం వారికి అనుకూలమైన గుమస్తాలను తయారుచేసే విద్యా విధానాన్నే అనుసరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్య శాఖ మంత్రిగా కొన్ని సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. ఆయన జయంతినే ‘జాతీయ విద్యా దినోత్సవం (National Education Day 2025 ) గా జరుపుకొంటున్నాం.
కేంద్ర పాలకులు 1968లో మొదటి జాతీయ విద్యా విధానాన్ని, 1986లో రెండవ జాతీయ విద్యా విధానాన్ని, 1992లో పరిమిత స్థాయిలో మూడవ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. కానీ ప్రపంచ దేశాలతో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశా లతో సమానంగా పోటీపడి నైపుణ్యాలతో ముందుకు వెళ్లలేక పోయాము. మానవ వనరుల శాఖను కూలంకషంగా చర్చించి 34 ఏళ్ల తరువాత విద్యా రంగంలో కీలకమైన మార్పులు చేయాలనే తలంపుతో డా‘‘ కస్తూరి రంగరాజన్ అధ్యక్షతన ‘జాతీయ నూతన విద్యా కమిషన్’ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సూచనల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యా విధానం 2020’ (ఎన్‌ఈపీ–2020) ప్రకటించింది. ఇది దేశంలో విద్యారంగా నికి సంబంధించి సమగ్రమైన సంస్కరణ. సాంకేతిక విజ్ఞానం, నైతిక విలువ లతో కూడిన విద్య, ఉపాధి కల్పన, పారదర్శకత దీని లక్ష్యం.
2035వ సంవత్సరం నాటికి ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 3 కోట్ల సీట్లు అదనంగా రానున్నాయి. యూజీసీ కోర్సులలో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలు చేర్చారు. దేశ జీడీపీలో 6% నిధులు విద్యా రంగానికి కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది 4.4% శాతంగా మాత్రమే ఉంది. విదేశీ విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటివరకు – కంటెంట్ కేవలం ఆంగ్లం, హిందీలోనే అందుబాటులో ఉండగా ప్రస్తుతం అది 8 భారతీయ భాషల్లో (ఇందులో తెలుగు కూడా ఉంది) అందు బాటులోకి రానుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తారు. దీనికై ‘నేషనల్ టెక్నాలజీ ఫోరమ్’ను ఏర్పాటు చేస్తారు.
పాఠశాల విద్యను ప్రీ–ప్రైమరీ పాఠ్యంశాలను ఎన్‌సీఈఆర్టీ అభివృద్ధి చేస్తుంది. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆటల కార్యక్రమాల ద్వారా సరళమైన పాఠ్యంశాలను అమలు చేస్తారు. 1–3 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక అక్షరాలను, అంకెలను త్వరగా గుర్తుపట్టి చదివేలా తీర్చిదిద్దుతారు. దీనికై ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేశారు. ‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల’ను ఇప్పుడున్న 8 – 10 తరగతుల నుండి 12వ తరగతి వరకు పొడిగిస్తారు. బోర్డు పరీక్షకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తారు. ఏటా ఒకసారి కాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయ టకు వెళ్లే సమయానికి వాళ్ళు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారో వాటిని ఒక డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా ఏ భాషను కూడా బలవంతంగా రుద్దడం జరగదు. అన్ని స్థాయుల తరగతుల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు పరుస్తారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 బదులు... 5+3+3+4 ఉండేలా మార్పులు చేస్తారు. 9–12 తర గతుల విద్యార్థులు ఏ మార్కులు వచ్చినా నచ్చిన సబ్జెక్టు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే వాటితో పాటు విద్యార్థులు తమకు నచ్చిన ఫ్యాషన్ డిజైన్, ఆహార తయారీ, తదితర కోర్సులు నేర్చుకోవచ్చు. డిజిటల్ లాకర్ ద్వారా పాత క్రెడిట్స్ అట్టిపెట్టు కొని... చదువు మానేసినా, తనకు వీలైన సమయంలో తిరిగి చదువు కొనసాగించేలా వెసులుబాటు కల్పించారు.
చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
వృత్తి విద్యను 6వ తరగతి నుండే ప్రారంభిస్తారు. దీనిలో ఇంట ర్న్‌షిప్ కూడా ఉంటుంది. యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపా ధ్యాయ మండలి వంటివాటిని విలీనం చేసి మొత్తం విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే రకమైన నిబంధనలను అమలు చేస్తారు. గుర్తింపు ఆధారంగానే స్వయం ప్రతిపత్తి ఇస్తారు. విద్యా ర్థులు, అధ్యాపకులకు మార్గదర్శనం చేయడానికి ‘నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్’ను ఏర్పాటు చేస్తారు.
ఈ సంస్కరణలను సంకుచితమైన రాజకీయ దృక్కోణంలో చూడకుండా అన్ని రాష్ట్రాలూ అమలు చేయడానికి ముందుకు రావాలి. మనమందరం కూడా ఈ సంస్కరణ ను స్వాగతిద్దాం. అదే మనం అబుల్ కలావ్‌ు ఆజాద్‌కు ఇచ్చే నిజమైన నివాళి.
బండారు దత్తాత్రేయ వ్యాసకర్త మాజీ గవర్నర్
(నేడు ‘జాతీయ విద్యా దినోత్సవం)


