విశ్లేషణ
2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వ్యూహరచనలో ఇప్పటికీ హిందూత్వమే అగ్ర భాగాన ఉంది. తిరుప్పరన్ కుండ్రంలో దీపం వివాదం అంతర్లీనంగా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది.
బిహార్‌లో ఇటీవల ఘన విజయం సాధించిన బీజేపీ, 2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రాభవం కనిపించదు.
తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే), పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి కూడా తమ సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తమిళనాట డీఎంకేతో సర్దుబాటు చేసుకుని, సంతృప్తి చెందేందుకే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
కానీ, బెంగాల్‌లో దానికి ఆ మాత్రం ఊతం కూడా లభించడం లేదు. అందులోనూ బిహార్‌లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను తోడు తీసుకెళ్ళేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. మరోపక్క బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ సమరానికి సై అంటోంది.
ఒంటరిగానే సై!
అయితే, బెంగాల్‌లో 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో, ఇక ఆ తూర్పు రాష్ట్రాన్ని ‘జయించడం’ తనకు చిటికెలో పనిగా బీజేపీ భావించింది. తీరా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. మొత్తం 294 స్థానాల్లో 200 కైవసం చేసు కోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, 77 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, పోలైన ఓట్లలో 38 శాతం గడించి, ముఖ్య ప్రతిపక్షంగా అవతరించినందుకు కొంత సంతృప్తి చెందింది.
ఈ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా, బిహార్‌లో విజయఢంకా మోగించాక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘‘గంగా నది బిహార్ నుంచి బెంగాల్‌లోకి ప్రవహిస్తుంది’’ అని ప్రకటించారు. అది ఏదో ప్రాసంగికంగా దొర్లిన విషయంలా లేదు.
బెంగాల్ విపుల ప్రణాళికపై కార్యాచరణకు హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహరచనలో హిందూత్వమే ఇప్పటికీ అగ్ర భాగాన ఉంది. కానీ, పశ్చిమ బెంగాల్, తమిళ నాడుల్లో అది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు.
దీప ప్రజ్వలన వివాదం
తిరుప్పరన్ కుండ్రంలో దీపం వెలిగించడానికి సంబంధించి ఇటీవల రేగిన వివాదం అంతర్లీనంగా ఆ అంశాన్నే ప్రతిబింబించింది. తమిళులు ‘మురుగా!’ అంటూ విపరీతంగా ఆరాధించే సుబ్ర హ్మణ్య స్వామికి చెందిన ఆరు పవిత్ర క్షేత్రాలలో తిరుప్పరన్ కుండ్రం ఒకటి. అక్కడి ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే సుల్తాన్ సికందర్ ఔలియా దర్గా ఉంది.
చెదురుమదురు ఘర్షణలను మినహా యిస్తే అక్కడ కార్తీక దీపోత్సవం శాంతియుతంగానే సాగిపోయింది. కాకపోతే, దర్గాకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న దీపత్తూన్‌గా పిలిచే ప్రాచీన స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు ఉత్తర్వు తెచ్చుకోవలసి వచ్చింది. దీపాన్ని వెలిగించే కార్యక్రమానికి అను మతి కోరుతూ మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనం ముందు ఈసారి పిటిషన్ దాఖలైంది. కోర్టు దీపారాధనకు అనుమతించడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరం చేసుకున్నాయి.
కానీ, జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయడంతో, పోలీసులు వాటిని అమలుపరచవలసి వచ్చింది. ‘‘ఆశించిన ఫలితం సాధించడానికి హిందువులలో చైతన్యాన్ని రేకెత్తిస్తే చాలు’’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య అవసరమైతే ఘర్షణకు దిగవలసిందని పరోక్షంగా సూచించి నట్లయింది.
తమిళనాడు సాంస్కృతిక, మత సమ్మేళనాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీకి ‘ప్రాథమికమైన లోపం’ ఉందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘తమిళ నాడు ప్రజానీకానికి దైవభక్తి ఎక్కువ. కానీ, మతాన్ని రాజకీయా లతో మిళితం చేసి చూడరు’’ అని ఆయన అన్నారు.
చిన్నాచితక ప్రాంతాల్లో తప్పించి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు తమిళ నాడులో పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు లేవు. అయినా, అవి దీపారా ధనపై వివాదాన్ని నిలకడగా కొనసాగించగలిగితే, ఓటర్ల మనసును కొంత వరకు పట్టుకోవచ్చు. కానీ, తమిళనాడు రాజకీ యాలు చాలావరకు ద్రావిడ కళగం నాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి సిద్ధాంతాలతో ప్రభావితమైనవి.
ఆయన చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమంలో ముస్లింలను కూడా దళితులుగా చిత్రించడం ఒక కీలకమైన అంశం. హిందూయిజంలో అంతర్లీనంగా ఉన్న కుల అణచివేత నుంచి తప్పించుకునేందుకు దళితులు ఇస్లాంలోకి మారారన్నది ఆయన సిద్ధాంతాలలో ఒకటి.
ఓటుబ్యాంకుకు దెబ్బ
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ వరుసగా మూడు విడతలుగా అధికారంలో ఉంది. ఆరోపణల తీవ్రతతో ఈసారి టీఎంసీ దుర్బల మైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధేయులు పాల్పడినట్లుగా చెబుతున్న అవినీతి వాటిలో ప్రధానమైనది.
అలాగే, కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వీధులకెక్కాయి. పాలక పార్టీకి చెందిన గూండాలు, దళారీలకు తృణమో పణమో చెల్లిస్తేనే పనులు అవుతాయనీ, రక్షణ లభిస్తుందనీ ప్రజలు చెబుతున్న దృష్టాంతాలున్నాయి. దాంతో, తాము వామపక్ష కూటమి పాలన నాటి రోజుల్లోకే తిరిగి వెళ్ళినట్లుందని వారు అంటున్నారు.
అయితే, అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఒక రకంగా తానే చిక్కుల్లో పడింది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం వలస దారుల కన్నా హిందూ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల సునిశిత సవరణ (సర్) బీజేపీ ఓటు బ్యాంకు లోపల కూడా ఆందో ళనను రేకెత్తించింది. బెంగాలీ భాషను ఢిల్లీ పోలీసులు ‘బంగ్లాదేశీ భాష’గా పేర్కొంటూ మరింత అపకీర్తిని తెచ్చిపెట్టారు.
హిందూ పూజారులకు నెలసరి జీతాలు చెల్లించడం, దుర్గా ఉత్సవాలను నిర్వహించడం వంటి చర్యల ద్వారా తనను ‘హిందు వుల ఆప్తురాలు’గా చిత్రించుకునేందుకు మమత గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ, హిందూత్వపై బీజేపీతో పోటీ పడటం ప్రతి పక్షా లకు ఇప్పటికీ కష్టమవుతోందని ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలు వెల్లడిస్తున్నాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు బలమైన ప్రాంతీయ గుర్తింపుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చడానికి లేదు. అక్కడి ఓటర్లు హిందూత్వతో సునాయాసంగా మమేకమవుతారు. హిందూత్వ థీమ్‌లోకి భాష, సంస్కృతులను కూడా బీజేపీ ఈసారి అంతర్లీనం చేయ గలుగుతుందా? అన్నదే ప్రశ్న. 
వ్యాసకర్త: రాధికా రామశేషన్
సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


