
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అయిన తనను కూటమికే చెందిన పొరుగు ఎమ్మెల్యే రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభలో జీరో అవర్ సందర్భంగా తన దుస్థితిని చెప్పుకునే అవకాశం దొరికిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులతో ఎంతైనా పోరాటం చేయొచ్చు గానీ, సొంత కూటమికే చెందిన తనపక్క నియోజవర్గ ఎమ్మెల్యే కుట్రకు కొమ్ముకాస్తుంటే ఎమ్మెల్యేగా ఎవరికి చెప్పుకోవాలని సభలో ప్రశ్నించారు.
10 రోజులుగా తనపై తీవ్ర ఆరోపణలతో పత్రికలు, టీవీల్లో వార్తలు రాయిస్తూ తీవ్ర అవమానానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో క్వారీలు తీసుకున్న వారికి రూ.కోట్లు జరిమానాలు విధించారు. కానీ మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారు. నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రజా సమస్యలపై నా పని నేను చేస్తుంటే వ్యాపారాలు చేసుకోవడం కోసం నన్ను బలి చేయడం చాలా తప్పు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.