ప్రస్తుతం ఆన్‌లైన్ యూజర్స్, సోషల్ యాప్స్ వాడుతున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలని, ఫాలోవర్స్‌ని పెంచుకోవాలని, రీల్స్ వైరల్ కావాలని యువతలో ఉన్న తపన వారిని ‘ఏఐ ఫేక్ వీడియో’ వైపు పురిగొల్పుతోంది. ఈ రూపంలో యువతను టెక్నాలజీ కొత్త దారిలోకి నెడుతోంది. సాంకేతికత ద్వారా వచి్చన స్వేచ్ఛను సృజనాత్మకత పేరుతో మాయచిత్రాలుగా మలుస్తున్న ఈ కొత్త ట్రెండ్ నగరంలోని సైబర్ నేర విభాగాలను ఆందోళనకు గురిచేస్తోంది.
సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ టెక్నాలజీ ఎటు దారితీస్తుందోనని విశ్లేషకులు, టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పులి వీడియో వైరల్‌గా మారింది. ఒక యువకుడు ఏఐ టూల్స్ సహాయంతో తమ కాలనీలో ఒక చిరుత పులి తిరుగుతున్నట్లు వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో సహాజంగా, వాస్తవంగా కనిపించడం వల్ల చాలా మంది భయంతో పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అది వీడియో ఫేక్ అని తెలిసినా.. ఆ క్షణం వరకూ నెటిజన్లను అది నిజమైనదిలా భ్రమింపజేసింది.
ఇదే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ శక్తి. ఇలాంటి ప్రభావాలు రానున్న రోజుల్లో విస్తృతం అవుతాయని నిపుణులు చెబుతున్న మాట. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, ప్రధానంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నవీ పెరుగుతున్నాయి. ప్రఖ్యాత నటులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ఎవరి వీడియోలైనా ఏఐ సహాయంతో మార్ఫ్ చేసి ‘వైరల్’ కంటెంట్‌గా మార్చేస్తున్నారు.
సైబర్ చట్టాలు చెప్పేదేంటి?..
భారత చట్టప్రకారం.. ఎవరినైనా తప్పుదోవ పట్టించే, లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఫేక్ కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం సైబర్ నేరంగా పరిగణించబడుతుంది. ఐటీ యాక్ట్ 2000, ఐపీసీ సెక్షన్ 66డీ, 67, 468, 469, 500 వంటి నిబంధనల కింద ఇటువంటి చర్యలు శిక్షార్హం.
దీనికి సంబంధించి దోషిగా తేలితే మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు వేలల్లో, లక్షల్లో జరిమానా విధించవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఫేక్ వీడియోలు తయారు చేయడం ఒక రకమైన నేరం (ఫ్రాడ్)గా పరిగణించబడుతుంది. ఇది ప్రజల్లో భయం లేదా ద్వేషం.. వంటి వాటిని ప్రేరేపిస్తే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని, దీనికి మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని చట్టం చెబుతోంది.
యువతలో పెరుగుతోన్న ‘వైరల్’ పిచ్చి..
హైదరాబాద్ యువతలో చాలామంది ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పేరు సంపాదించాలనే ఆరాటంలో ఉన్నారు. ఏఐ యాప్స్ సులభంగా అందుబాటులో ఉండటం, వాటిని వాడటానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడం వల్ల ఈ ఫేక్ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ రూపంలో వచ్చే డోపమైన్ రష్ వల్ల యువతలో వాస్తవం, నైతిక అంశాల మధ్య సున్నితమైన పరిపక్వత మసకబారుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
సైబర్ నేర విభాగం ప్రకారం.. 18–28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ తరహా కంటెంట్ ఎక్కువగా రూపొందిస్తున్నారు. టెక్ సావీ స్టూడెంట్స్, డిజిటల్ క్రియేటర్స్ పేరుతో ఉండే ఇన్‌స్టా లేదా యూట్యూబ్ యూజర్లు ఫేక్ కంటెంట్‌ను ‘ఫన్’గా తీసుకుంటున్నారు. కానీ ఫలితాలు మాత్రం తీవ్రమైనవేనని నిపుణులు చెబుతున్నారు. వైరల్ పేరుతో వాస్తవాన్ని మర్చిపోవద్దు, నేటి ఫేక్ వీడియోస్ రేపటి రోజున నేరం అవుతుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.
సోషల్ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యత..
మెటా, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారŠమ్స్ కూడా ఇప్పుడు డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. అయితే యూజర్లు కంటెంట్ షేర్ చేయడానికి ముందు దాని వాస్తవికతను నిర్ధారించుకోవడం వారి బాధ్యత. ‘షేర్ చేసేముందు చెక్ చేయండి’ అనే కొత్త డిజిటల్ ప్రచారం అవసరం. హైదరాబాద్ వంటి టెక్ సిటీకి ‘ఏఐ ఫేక్ వీడియోలు’ సాంకేతిక అభివృద్ధి కాదు, విలువల సంక్షోభ సూచిక. సాంకేతికత మన చేతిలో ఉన్న అస్త్రం.. దాన్ని వినియోగించే విధానమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా.. లేక గందరగోళంలో పడేస్తుందా అన్నది నిర్ణయిస్తుంది.
డిజిటల్ ఎథిక్స్..
ఇలాంటి వీడియోలు ప్రజల్లో అపోహలు, భయాలు, అనవసర వివాదాలు రేపుతున్నాయి. ఉదాహరణకు చిరుతపులి వీడియో వల్ల ఒక ప్రాంతంలో పిల్లలను బయటకు పంపకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం, ఫేక్ సెలబ్రిటీ వీడియోల వల్ల ఫ్యాన్స్ మధ్య ద్వేషం పెరిగి ఘర్షణలకు దారితీసిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి ఇది సమాజంలో తీవ్ర ప్రభావం చూపి.. ‘వాస్తవం’, ‘అవాస్తవం’ అనే అంశాలపై నమ్మకం కోల్పోయే దిశకు చేరే ప్రమాదం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు, సోషల్ మీడియా కంపెనీలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ‘డిజిటల్ ఎథిక్స్’ అనే అంశాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం ద్వారా యువతకు వాస్తవం–వైరల్ మధ్య తేడాను తెలియజెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు.


